జగన్ గట్స్: అందరికీ గట్టి సమాధానమిచ్చాడా!

ఇప్పుడు అయితే.. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక ఒడంబడికకు వచ్చి.. ప్రత్యేక హోదా వేస్టు అని తేల్చేశాయి. ముసుగులో గుద్దులాట లేకుండా, ప్రత్యేక హోదా హామీని ఇరు పార్టీలు కలిసి తుంగలో తొక్కేశాయి. తామిద్దరం ఉమ్మడి గా ఇచ్చిన హామీ విషయంలో.. ఇరువురూ చేతులు కలిపి మరీ ఏపీ జనాలను ఫూల్స్ చేసేశాయి బీజేపీ, తెలుగుదేశం పార్టీలు. అదేమంటే.. ప్రత్యేకహోదా స్థాయికి మించిన ప్యాకేజీ, ప్రత్యేక హోదాకు మించిన లబ్ధి అంటూ కహానీలు చెప్పడంలో కమలనాథులు, పసుపు పార్టీ నేతలు బిజీగా ఉన్నారు.

ఇప్పటి సంగతిలా ఉంటే.. మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమకు సహజసిద్ధంగా అలవాటు అయిన ద్వంద్వ వైఖరినే ప్రదర్శించే వాళ్లు. “ప్రత్యేకహోదా’’ విషయంలో కేంద్రం వైఖరి తో తన రక్తం మరిగిపోతోందని తెలుగుదేశం అధినేత చెప్పే రోజుల్లో… ఆ విషయంలో బీజేపీని కార్నర్ చేయడానికి సైకిల్ పార్టీ ప్రయత్నించింది. అదే సమయంలో… ఈ హోదా విషయంలో వైకాపా నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ “కేంద్రంతో పోరాడు..’’ అనే మాట మాట్లాడేది!

కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ, రెండు మంత్రి పదవులను కూడా తీసుకున్న తెలుగుదేశం పార్టీ.. కేంద్రంతో తమకేం సంబంధం లేదన్నట్టుగా జగన్ కు కేంద్రంతో పోరాడమనే సూచన చేసేది! అధికారంలో ఉంటూ, బీజేపీతో అధికారాన్ని పంచుకునేది, బీజేపీతో కలిసి ఏపీని మోసం చేసేది తెలుగుదేశం పార్టీ, రోడ్డు ఎక్కాల్సింది జగన్ మోహన్ రెడ్డి..అనేది తెలుగుదేశం పార్టీ ఆనాడు వినిపించిన బాష్యం.

ఇక మోడీని జగన్ ఏమనడం లేదు, బీజేపీని విమర్శించడం లేదు.. అనే మాట కూడా తెలుగుదేశం వైపు నుంచి వినిపించేది! ఆ గట్స్ జగన్ కు లేవు.. కేసుల భయం అని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానించే వాళ్లు.

అక్కడకీ జగన్ మోహన్ రెడ్డి ఎన్డీయే హయాం వచ్చాకా.. ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో ధర్నా చేసినా.. పసుపు పార్టీ మాత్రం అది కళ్లకు కనపడనట్టుగా మాట్లాడేది. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా విషయంలో పోరాటానికి నిర్వహిస్తున్న “యువ భేరీ’’ల్లో చంద్రబాబు మీదే కాదు, మోడీ మీద, వెంకయ్య మీద కూడా డైరెక్టుగా మాటల దాడి జరుగుతోంది.

తాజాగా జగన్ పాల్గొన్న ఈ సదస్సుల్లో ఎన్నికల ప్రచారం సమయంలో నరేంద్రమోడీ ప్రత్యేకహోదా హామీని ఇవ్వడానికి సంబంధించిన క్లిపింగ్స్ ను కూడా ప్రదర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసింది.. అని మోడీ అనడం, అది కూడా వెంకయ్య నాయుడు చలవే అని ఆయన సెలవీయడం, ఆ హిందీ ప్రసంగాన్ని శ్రీమాన్ వెంకయ్య నాయుడు తనదైన శైలిలో అనువదించడం.. ఇందుకు సంబంధించిన  వీడియో క్లిప్స్ ను వైకాపా యువభేరీల్లో ప్రదర్శిస్తున్నారు.

మోడీ, వెంకయ్య, తెలుగుదేశం పార్టీలు కలిసి తడి గుడ్డతో ఏపీ ప్రజల గొంతులు ఎలా కోశారో.. ఈ వీడియోలతో స్పష్టం అవుతోంది. మరి రాజకీయంగా చూసుకున్నా.. కమలం పార్టీ మోసం పై ఇంత కన్నా సూటిగా మాట్లాడాల్సిన అవసరం లేదని అనాలి. కేంద్రానికి భయపడుతున్నాడు, మోడీకి భయపడుతున్నాడు.. అంటూ తెలుగుదేశం పార్టీ చేసే రన్నింగ్ కామెంట్రీకి ధీటైన సమాధానాన్నే ఇచ్చాడు జగన్ మోహన్ రెడ్డి. మరి కమలం పార్టీ మోసం పై డైరెక్టుగా జగన్ చేస్తున్న ఈ దాడి కి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి!

Show comments