ముద్రగడ దీక్ష.. ఇంత ఘోరమా.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సామాన్యుడేమీ కాదు. పైగా ఆయనిప్పుడు కాపు ఉద్యమ నేత. కాపు సామాజిక వర్గానికి ప్రస్తుతానికైతే ఆయనే అసలు సిసలు నాయకుడు. ఆయన పిలుపునిస్తే చాలు, క్షణాల్లో రాష్ట్రం అల్లకల్లోలమైపోతుంది. అందుకు, తుని విధ్వంసమే నిదర్శనం. నమ్మించి, కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు సర్కార్‌ నట్టేట్లో ముంచేసిన దరిమిలా, చంద్రబాబు తీరుని ప్రశ్నిస్తున్న ముద్రగడ వెనుక మొత్తం కాపు సామాజిక వర్గం అండగా నిలిచింది. 

అయితే, కాపు సామాజిక వర్గంలో 'ఐక్యత' చాలా చాలా చాలా తక్కువ. హైద్రాబాద్‌లో కూర్చుని దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ.. ఇంకొందరు కాపు సామాజిక వర్గ ప్రముఖులు హడావిడి చేశారు తప్ప, ఒక్కరంటే ఒక్కరు కూడా 14 రోజుల ముద్రగడ దీక్షలో.. ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించలేదు. ఇది చాలు, కాపు సామాజిక వర్గంలో ఐక్యత లేదని చెప్పడానికి. 

ఒక్కడే, ఒంటరిగా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాడు. ఇది అత్యంత దారుణమైన విషయం. సరే, ఉద్యమం విషయంలో ముద్రగడ తప్పటడుగులు వేస్తున్నారన్నది వేరే అంశం. తెలంగాణ ఉద్యమం విషయంలో కేసీఆర్‌ తప్పటడుగుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఎన్నో అవమానాలు, ఎన్నో వెక్కిరింతలు.. చివరికి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారా? లేదా? అప్పట్లో తెలంగాణ సమాజం ఒక్కతాటిపై నిలబడలేదు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం పరిస్థితీ అంతే. 

ఇంట్లోంచి దీక్ష ఆసుపత్రికి మారింది. అక్కడేం జరిగిందో ఎవరికీ తెలియదు. ముద్రగడ చెబుతున్నదాన్ని బట్టి చూస్తే అత్యంత దారుణంగా ఆయన్ని ఆసుపత్రిలో వేధించారనే విషయం అర్థమవుతోంది. ఏమీ లేకుండా, అంత వైల్డ్‌గా ముద్రగడ ఆరోపణలు చేస్తున్నారని అనుకోలేం. కొట్టడం, తన్నడం తప్ప అన్నీ చేశారంటూ ముద్రగడ పద్మనాభం దీక్ష విరమిస్తూ, ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంత్రిగా పనిచేసిన తనను ఇంత అవమానించడమేంటని ఆయన ప్రశ్నించారు. 

అలాగని, తనను వేధించినవారెవరిపైనా చర్యల్ని తాను కోరుకోవడంలేదనీ, భగవంతుడు వున్నాడనే నమ్మకం తనకుందనీ, వారికి తగిన శిక్ష పడేదాకా తన ఇంట్లో ఏ పండుగా జరుపుకోనని ముద్రగడ శాపనార్ధాలు పెట్టడం గమనార్హం. ఒంట్లో సెలైన్‌ తప్ప, ఆగ్రహావేశాలుగానీ ఇంకేమీగానీ లేవని ముద్రగడ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఉగ్రవాదిలా తనను ప్రభుత్వం చూస్తోందనీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని మాత్రమే నెరవేర్చాలని తాను కోరుతున్నానన్నారు ముద్రగడ. 

ఏదిఏమైనా, ముద్రగడ విషయంలో ప్రభుత్వం అత్యంత హేయంగా వ్యవహరించిందన్నది నిర్వివాదాంశం. ఒక్కరోజు కూడా ముద్రగడ దీక్ష చేయకుండానే ఆయన్ను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది.? అన్నది ఇందులో ముఖ్యమైన ప్రశ్న. అదొక్కటే కాదు, 'నన్ను అరెస్ట్‌ చెయ్యండి..' అంటూ అమలాపురం పోలీస్‌స్టేషన్‌ యెదుట ధర్నా చేసినప్పుడే ముద్రగడను అరెస్ట్‌ చేసి వుండాల్సింది. ముద్రగడ దీక్ష మొదలు పెట్టాక, ఆయన్ని అదుపులోకి తీసుకుని, ఆసుపత్రికి తరలించిన పోలీసులు, దీక్ష చేస్తున్నందుకు కాదు, పురుగుల మందు తాగేందుకు యత్నించడంతోనే అరెస్ట్‌ చేశామని చెప్పడం ఇంకా హాస్యాస్పదం. 

మొత్తంగా చూస్తే, ముద్రగడ ఆవేదనలో అర్థం వుంది. మరి, ప్రభుత్వం వద్ద ముద్రగడ ఆరోపణలకు సమాధానం వుందా.? 

Show comments