భక్తుడికే పట్టం.. ఆ ఒక్కటి తప్ప.!

తమిళనాడు రాజకీయాల్లో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జయలలిత, తన వద్దనున్న శాఖలన్నిటినీ, తనకు అత్యంత సన్నిహితుడు, తన ప్రధాన అనుచరుడు (భక్తుడు కూడా) అయిన మంత్రి పన్నీర్‌ సెల్వంకు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆమె తీసుకున్నారా.? ఆమె పేరుతో ఇంకెవరైనా ఆ నిర్ణయం తీసుకున్నారా.? (జయలలిత సంతకాల్ని ఫోర్జరీ చేస్తున్నారని సాక్షాత్తూ అన్నాడీఎంకే పార్టీ ఎంపీనే ఆరోపించారు) అన్నది వేరే విషయం. 

నిన్ననే ఈ శాఖల బదలాయింపుపై ఇన్‌ఛార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు లాంఛనంగా, పన్నీర్‌ సెల్వం గవర్నర్‌ ఆదేశాల మేరకు జయలలిత నుంచి పలు శాఖల బాధ్యతల్ని స్వీకరించారు. అంటే, పన్నీర్‌ సెల్వంని ఇకపై ఆపద్ధరమ్మ ముఖ్యమంత్రిగా పరిగణించాల్సి వుంటుంది. ఎందుకిలా.? జయలలిత ఎందుకు ముఖ్యమంత్రి పదవిని తాత్కాలికంగా అయినా వదులుకోలేకపోతున్నారు.? ఈ ప్రశ్న ఇప్పుడు దేశ రాజకీయాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. 

మామూలుగా అయితే, ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షం రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి, ప్రభుత్వాన్ని కుప్పకూల్చి, అధికారంలోకి రావడం అనేది సాధారణ ప్రక్రియ. కానీ, తమిళనాడు రాజకీయాల్లో అలాంటి వ్యూహాలేమీ తెరపైకి రాలేదు. ఓ రకంగా, తమిళ రాజకీయాలు జయలలిత పట్ల గౌరవం కారణంగా సంయమనంతో వ్యవహరిస్తున్నాయనుకోవచ్చేమో.! 

ఈ మొత్తం తతంగం చూస్తోంటే, జయలలిత అతి కొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయిలో కోలుకుని, తిరిగి ముఖ్యమంత్రిగా పూర్తి బాధ్యతల్ని కొనసాగిస్తారనే సంకేతాలు పంపేందుకే, ఏఐఏడీఎంకే ఈ శాఖల బదలాయింపుతో సరిపెట్టిందనే విషయం అర్థమవుతోంది. అయితే, గతంలో జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టయి, జైలుకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. కానీ, ఆనాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. 

ఏదిఏమైనా, తమిళనాడు రాజకీయాల్లో ఇది ఓ అత్యంత ఆసక్తికరమైన ఘట్టం. జయలలిత కోలుకునేదాకా.. అని చెబుతున్నా, జయలలిత ఎప్పుడు కోలుకుంటారన్నదానిపై ఏఐఏడీఎంకే వర్గాలుగానీ, ఆసుపత్రివర్గాలుగానీ స్పష్టత ఇవ్వలేని పరిస్థితి.

Show comments