సోనూసూద్: తిరస్కరణలే శక్తిమంతుడిని చేశాయ్!

సోనూసూద్.. తెలుగు వాడే అనేంతగా టాలీవుడ్ లో, తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఎక్కడో పంజాబ్ లో సినీ పరిశ్రమతో ఏ మాత్రం సంబంధం లేని కుటుంబంలో పెట్టి పెరిగి, అవకాశాల వేటలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని .. దశాబ్దం నుంచి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా కొనసాగుతున్న సోనూ.. ఇప్పుడు నిర్మాతగా మారాడు. ఏ మాత్రం సినీ నేపథ్యం లేని తను ఈ స్థాయికి ఎదిగి రావడం తన తల్లిదండ్రులు గర్వించే అంశమని, తన తండ్రి పేరుతో తాను ఏర్పాటు చేసిన సినీ నిర్మాణ సంస్థ రూపొందించిన తొలి సినిమాను తల్లిదండ్రులతో కూర్చుని చూడబోయే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా అని సోనూ అంటున్నాడు. ఏకంగా మూడు భాషల్లో ఒకేసారి రూపొందించిన ఆ సినిమానే తెలుగులో ‘అభినేత్రి’ పేరుతో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సోనూ ఎదుర్కొన్న ఒడి దుడుకులు ఆయన మాటల్లోనే… 

వాచ్ షోరూం చూసుకొమ్మన్నారు…
సిన్సియర్ స్టూడెంట్ ని, చదువు మీదే ధ్యాస.. మంచి పర్సెంటేజీలు తెచ్చుకుని తల్లిదండ్రులకు పేరు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇంజనీరింగ్ పూర్తి కాగానే, ఫ్యామిలీ బిజినెస్( వాచ్ ల షోరూం) చూసుకొమ్మన్నారు. అయితే సినిమాల్లో ప్రయత్నిస్తా అనే సరికి, ఆశీర్వదించి పంపారు మా అమ్మానాన్న.

ఫొటోలు చూడటానికీ ఆసక్తి చూపలేదు…
ముంబై వచ్చిన తొలి రోజుల్లో అవకాశాల వేటలో పడ్డ కష్టాలను మరిచిపోలేను. కొత్త వాళ్లను ఎవరూ పట్టించుకోరు పరిశ్రమలో. ఫొటోలు పట్టుకుని రోడ్లలో తిరిగిన రోజులున్నాయి. ఆ ఫొటోలను చూడటానికి కూడా చాలా మంది ఆసక్తి చూపే వారు కాదు. నిమిషం కేటాయించకుండా వాళ్లు పక్కన పడేసిన రోజుల్లోని బాధ అంతా ఇంతా కాదు. అలాంటి తిరస్కరణలే నన్ను శక్తిమంతుడిని చేశాయి. 

గుంపులో కనిపించిన సినిమాలున్నాయ్..
చాలా సినిమాల్లో గుంపులో గోవిందయ్యలా కనిపించా.. కొన్ని సన్నివేశాల్లో వంద మందిపైగా ఉండే గుంపులో ఒక మూల ఒకడిగా కనిపించే వాడిని. అప్పుడప్పుడు అలాంటి అవకాశం దక్కేది. రోజుకు రెండువేల రూపాయలు ఇచ్చేవాళ్లు.

తొలి అవకాశాలు దక్షిణాదినే…
2000 సంవత్సరం సమయంలో తమిళ, తెలుగు భాషల్లో అవకాశాలు వచ్చాయి. ఒడ్డూ పొడుగు అవసరమున్న విలన్ తరహా పాత్రలు వచ్చాయి.

భగత్ సింగ్ పాత్రతో గుర్తింపు…
అదే సమయంలో హిందీలో భగత్ సింగ్ జీవిత కథ ఆధారంగా వరసగా పలు సినిమాలు వచ్చాయి. లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, షాహిద్ వంటి వాటితో పాటు “షాహిద్ ఈ ఆజామ్’’ వచ్చింది. అందులో భగత్ పాత్ర చేశా. అయితే విడుదలలో జాప్యం. రెండేళ్లకు ఆ సినిమా విడుదల అయ్యింది.

మణిరత్నం యువ, పూరీ సినిమాలు, అతడు…
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ సినిమాలో కొంచెం లెంగ్తీ పాత్ర దక్కింది. అలాగే పూరీ దర్శకత్వంలో వచ్చిన సూపర్, అతడు, చంద్రముఖి వంటి సినిమాల్లో పాత్రలతో బిజీ అయిపోయా. హిందీలో ఆషిక్ బనాయా అప్నే తదితర సినిమాలతో బిజీ ఆర్టిస్టు అయ్యా. అరుంధతితో దక్షిణాదిన స్టార్ డమ్, దబాంగ్ లో చేసిన విలన్ పాత్ర కెరీర్ కు మేలి మలుపు.

ఊహించలేదు.. గర్వంగా ఉంటుంది..
ఈ స్థాయికి ఎదగడం మా తల్లిదండ్రులు గర్వించే అంశం. ఒకనాటి సిన్సియర్ స్టూడెంట్ సినిమాల్లో ఈ స్థాయికి ఎదిగిరావడం గొప్పే కదా.. చిత్రసీమలో కొత్తగా అవకాశాల కోసం ప్రయత్నించే వాళ్లను గమనిస్తే నాకు నేనే గుర్తుకు వస్తా. నేను అనుభవించిన కష్టాలు గుర్తుకు వస్తాయి. అలాంటి వారిని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటా.

అభినేత్రి గురించి…
ఈ సినిమాను మూడు భాషల్లో తీశాం. ఒక్కో భాష కోసం ఒక్కో షాట్ నూ మూడు సార్లు చిత్రీకరించాం. నిర్మాతగా మారాలన్న కోరిక మనసులో ఉన్న సమయంలో ఈ కథ వినంగానే, ప్రొడక్షన్ కు రెడీ అయిపోయా. ప్రభుదేవా, తమన్నాలు జాయిన్ కావడంతో సినిమాకు మంచి స్టార్ క్యాస్ట్ యాడ్ అయ్యింది. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది

Show comments