సినీ ఉన్మాత్తులు.. ఈ హీరో మాట వినండి!

’ సినిమా వాళ్ల అభిప్రాయానికి కించిత్ విలువ ఇవ్వకండి.. సినిమా వాళ్లు నకిలీ మనుషులు.. వీళ్లకు ఎందులోనూ సీరియస్ ఉండదు.. వీళ్ల అభిప్రాయాల గురించి చర్చ అనవసరం. ప్రజలు, మీడియా వీళ్ల మాటలకు ఎలాంటి విలువనూ ఇవ్వనక్కర్లేదు. సినీ నటులు పురుగులతో సమానం. అసలైన హీరోలు.. సరిహద్దుల్లో పోరాడే సైనికులు మాత్రమే. సినిమాదంతా నకిలీ సరుకు…’’

ఇదీ బాలీవుడ్ ‘రియల్ హీరో’ నానా పాటేకర్ చెప్పిన మాట. పాకిస్తాన్ నటీనటులు ఇండియా నుంచి వెళ్లిపోవాలని ఒకవైపున, కళాకారులు ఏమీ ఉగ్రవాదులు కాదు, వారికి పెద్ద పీట వేయాలని మరోవైపున వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో నానా స్పందిస్తూ.. సినిమా వాళ్లకు జాతిని ఉద్దేశించి మాట్లాడేంత అర్హత లేదులెండి.. అని నిఖార్సైన మాట చెప్పాడు.

నానా చెప్పింది.. కేవలం ఒక అంశంలో సినిమా వాళ్ల మాటలను ఉద్దేశించే అయినా కూడా.. తెరపై హీరోల చేష్టలను చూసి, వాళ్లను ప్రాణప్రదంగా చూసే వీళ్లు, వాళ్లను ప్రత్యక్ష దైవాలుగా భావించే వాళ్లు, వాళ్లు చేసే “రాజకీయాల్లో’’ భాగమైపోయి.. ఒకరకంగా ఉన్మత్తులుగా మారిపోయిన వాళ్లు.. అందరికీ గీత బోధనే చేశాడు నానా.

నానా మాటలు.. కొంతమంది తెలుగు హీరోలకు కూడా సూటిగా తగులుతున్నాయని వేరే చెప్పనక్కర్లేదు. ఒకవైపు తమ తళుకుబెళుకుల లోకంలో బతుకుతూ, తమ ఎంజాయ్ మెంట్లను తాము చేసుకొంటూ.. తమ సినీ ఛరిష్మాను పెట్టుబడిగా పెట్టుకొంటున్న ప్యాకేజీ స్టార్లు.. ఇక్కడ ట్రెండింగ్ లో ఉండగా.. సినిమా ద్వారా సంపాదించుకున్న అభిమానులను అడ్డం పెట్టుకుని, అదొక్కటే అర్హతగా రాజకీయాల్లో ఒక ట్రైల్ వేసి, కుదరకపోవడంతో వెనక్కు తగ్గిన వాళ్లూ చాలా మందే ఉన్నారు.

తీరిక ఉన్నప్పుడు.. వచ్చి ఏ అంశం మీద కనీస స్పష్టత లేకుండా, అర్థం పర్థంలేని ప్రసంగాలు చేసి పోయే వాళ్లను ఆరాధ్యనీయులుగా చూసే వారికి.. నానా ఒక హితబోధ చేశాడు. “వాళ్లకు సీరియస్ నెస్ ఉండదు.. వాళ్లు నకిలీ హీరోలు.. వాళ్ల మాటలకు విలువనియ్యకండీ..’’ అంటూ సూటిగా చెప్పాడాయన. ఇంత కన్నా ఏం కావాలి? సినీ తారల డొల్ల బతుకుల గురించి, వారి అవకాశవాదపు రాజకీయాల గురించి చెప్పడానికి.

ఏపీలోని ప్యాకేజీ స్టార్లకే కాదు.. ఎక్కడో ఐదు నక్షత్రాల హోటళ్లలో కూర్చొని.. దేశంలో అసహనం పెరిగిపోతోంది, ఈ దేశం వీడివెళ్లి పోవాలనిపిస్తోంది.. అంటూ కారుకూతలు కూసే ఖాన్లకు కూడా ఇది చాలినంత చెప్పుదెబ్బే. వీళ్లంతా పురుగులు మాత్రమే. మీ బతుకులకు దేశం మీద, జాతిని ఉద్దేశించి అభిప్రాయాలను వెల్లడించేంత సీన్ లేదు.. అని నానా వాళ్లకూ పరోక్షంగా చెప్పాడు.

పీఎస్: మరి సినీ తారల అభిప్రాయాలకు ప్రాధాన్యతను ఇవ్వొద్దు అంటున్నాడు.. నానా కూడా సినీ నటుడే కదా.. అనే వెర్రిమాలోకాలు చాలానే ఉంటాయి. నానా సినీ నటులు మాత్రమే కాదు, దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు  సైన్యంలో పని చేసిన నేపథ్యం ఉంది. ఆ అర్హతతోనే ఆయన మాట్లాడాడు. దేశం కోసం వీరావేశంతో ఊగిపోయే.. ప్యాకేజీ స్టార్లు , ఇజాలు చెప్పే వాళ్లు.. సరిహద్దుల్లోకి వెళ్లి కొన్నాళ్లు కష్టపడొచ్చు కదా దేశం కోసం. కుదర్దా? కబుర్లు మాత్రమే చెబుతారా?

Show comments