గద్దర్‌ ధీమా: ఏదో ఒకటి అవుతాడట...!

ఒకప్పటి ప్రజాయుద్ధ నౌక ప్రజాస్వామ్య యుద్ధ నౌకగా మారుతున్న క్రమంలో ఆత్మవిశ్వాసం ఆకాశం అంచులు తాకుతోంది. ఇంతకాలం ప్రజా గీతాలను ఆలపించిన నోరు 'పవర్‌ పాట' పాడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒకటి అవుతానంటోంది. ప్రజాయుద్ధ నౌక అనగానే అందరికీ తెలుసు అతను ఎవరో. గద్దర్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకాలం తీవ్రవాద ఎర్రబాటలో నడిచిన ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా దక్కే రాజకీయ అధికారం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది మనం చెబుతున్నమాట కాదు. ఆయనే చెప్పుకున్నారు. 'వచ్చే ఎన్నికల్లో నేను కింగ్‌ మేకర్‌ను అవుతా. అవసరమైతే కింగ్‌ను అవుతా' అని గద్దర్‌ మీడియా ప్రతినిధులతోనే చెప్పారు. ఆయన ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు. పూర్తిగా రాజకీయాల్లోకి రాలేదు. కాని అప్పుడే పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయాల్లోకి రావాలని ప్లాన్‌ చేసుకోగానే కింగ్‌, కింగ్‌ మేకర్‌ ఆలోచనలు చేస్తున్నారు. ఆయన ధీమా ఏమిటో అర్థం కావడంలేదు. ప్రజల్లో తనకున్న ఇమేజ్‌ కారణంగా తాను ఏదో ఒకటి గ్యారంటీగా అవుతానని అనుకుంటున్నారేమో...! 

అప్పుడే పొత్తుల గురించి కూడా మాట్లాడారు. 'ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తులు పెట్టుకుంటాం' అని చెప్పారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కదా అప్పటివరకు ఏం చేస్తారు? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలంగాణకు, విడిపోయిన తరువాత ఉన్న తెలంగాణకు తేడా లేదనేది గద్దర్‌ అభిప్రాయం. కాబట్టి తెలంగాణ అంటే ఎలా ఉండాలనేది గ్రామగ్రామాన తిరిగి తెలియచేస్తారట. ఎన్నికలనాటికి పార్టీ నిర్మాణం పూర్తి చేస్తారట. ఈ ఏడాది అక్టోబరులో భువనగిరిలో పది లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తానంటున్నారు.  ఆయన ఎవరితో ఎలాంటి పొత్తులు పెట్టుకుంటాడో, ఏ పార్టీతో ఎలాంటి అవగాహనకు వస్తాడో, ఎవరితో కలిసి నడుస్తాడో కాలక్రమంలో స్పష్టత వస్తుండొచ్చు. గద్దర్‌ గొప్పవాడే. పాటలతో ప్రజలను ఉర్రూతలూపగల శక్తి ఉన్నవాడే. కేసీఆర్‌ను ఎండగట్టగలిగే సామర్థ్యం ఉన్నవాడే. కాదనం. కాని ఒక పార్టీ పెట్టి రాజకీయ నాయకుడిగా విజయం సాధించగలడా? అనేది కీలకమైన ప్రశ్న. గద్దర్‌ను కళాకారుడిగా అందరూ ఆదరించారు. పార్టీలకు, రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా అందరూ అభిమానించారు.

 ఏ కళాకారుడైన సరే రాజకీయ నాయకుడిగా మారితే ఆ అభిమానం, ఆదరణ పాక్షికమైపోతాయి. అందరివాడు కొందరివాడైపోతాడు. చిరంజీవి విషయంలో ఇదే జరిగింది కదా. అయినప్పటికీ గద్దర్‌ రిస్కు తీసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు కేసీఆర్‌తో కలిసి పనిచేయడం ఇష్టంలేనివారు, ఆయన వ్యవహారశైలి నచ్చనివారు గద్దర్‌ను తెర మీదికి తీసుకొచ్చి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఫోకస్‌ చేయాలనుకున్నారు. కాని వర్కవుట్‌ కాలేదు. కాలక్రమంలో కేసీఆర్‌ తెలంగాణ పోరాట యోధుడిగా, రాష్ట్రం సాధించిన విజేతగా చరిత్రలో నిలిచిపోగా గద్దర్‌ తెరమరుగైపోయారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆయన రాజకీయ అరంగేట్రం ఎపిసోడ్‌ జనం ముందుకొచ్చింది.  తెలంగాణ ఉద్యమ  సమయంలో గద్దర్‌ 'తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ' పేరుతో రంగంలోకి వచ్చాడు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వడానికి మరో రెండున్నర నెలల సమయం ఉన్న పరిస్థితిలో 'పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలి' అనే నినాదంతో గద్దర్‌ రకరకాల సంఘాలను కలుపుకొని సమాయత్తమయ్యాడు. 

కేసీఆర్‌ ఒంటెత్తు పోకడలతో, ఏకపక్ష ప్రకటనలు, చర్యలతో ఓయూ జేఏసీ, ఇతర తెలంగాణ సంఘాలు ఆగ్రహిస్తున్న నేపథ్యంలో  కేసీఆర్‌కు చెక్‌ పెట్టడానికే ఆయనంటే పడనివారంతా చేరి గద్దర్‌ను తీసుకువచ్చారనే ప్రచారం జరిగింది. గద్దర్‌  ఏర్పాటుచేసిన  ఫ్రంట్‌కు ఎన్నికల రాజకీయాలతో సంబంధంలేకపోయినా 'మాది రాజకీయ శక్తే' అని  ప్రకటించాడు. కేసీఆర్‌ను ఢీకొనే సత్తా గద్దర్‌కే ఉందనుకున్నారు. తెలంగాణ సాధనే కేసీఆర్‌ లక్ష్యం. గద్దర్‌దీ అదే లక్ష్యం. దీంతో ఆయన శాంతి యాత్రల పేరిట గ్రామాల్లో పర్యటించాడు. తెలంగాణ ధూంధాం పేరిట కళా ప్రదర్శనలిచ్చాడు. ఆట-పాట పేరుతో కార్యక్రమాలు చేశాడు.  2009 ఎన్నికల్లో  కొందరు గద్దర్‌ను ఎంపి లేదా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఆనాడు కేసీఆర్‌ వ్యతిరేకులు గద్దర్‌ను ఎంత ముందుకు తోసినా ఆయన ఊగిసలాడాడు తప్ప ఎటువంటి నిర్ణయాలూ తీసుకోలేకపోయారు. కింగ్‌ లేదా కింగ్‌ మేకర్ని అవుతానని చెబుతున్న గద్దర్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. 

Readmore!

Show comments