చంద్రబాబు అలియాస్‌ మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌...!

టైటిల్‌ చూడగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పిచ్చోడని విమర్శిస్తున్నారని అభిమానులు ఆగ్రహించాల్సిన అవసరం లేదు. ప్రజలను ఆయన పిచ్చోళ్లను చేస్తారుగాని ఆయన పిచ్చోడు కాదు. చరిత్ర పాఠాల్లో మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ అనే రాజు గురించి అందరూ చదువుకున్నవారే. నిజానికి ఆయన చంద్రబాబు మాదిరిగానే చాలా తెలివైనవాడు. మంచి పరిపాలకుడు. కాని తెలివితక్కువ పనులు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడంతో జనం ఆయన్ని పిచ్చోడిగా ట్రీట్‌ చేశారు.  రాజధాని మార్చి ప్రజలను కూడా ఊరు ఖాళీ చేసి రావాలని ఆదేశించడంతో వారు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇది తెలివితక్కువ పనే కదా. 

దీంతో ఆయన పేరు 'తుగ్లక్‌' అనేది పిచ్చోడికి పర్యాయపదంగా మారింది. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఇలాగే ఉంది. హైదరాబాదులోని ఏపీ సచివాలయం ఉద్యోగులను రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయానికి హడావుడిగా తరలించి ఆయన సాధించింది ఏమిటి? 'మన రాష్ట్రం...మన పాలన' అంటూ 'పచ్చ' మీడియాలో ప్రచారం చేయించుకున్న బాబు తుగ్లక్‌లా వ్యవహరించారు తప్ప తన తెలివితేటలతో (ఉద్యోగులను తరలించి) ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. 

బాబు అనుకూల పత్రికలో వచ్చిన వార్తే బాబు తెలవితక్కువ వ్యవహారాన్ని తెలియచేసింది. ఇంతకూ ఆయన ఏం చేశారు? ఈరోజుల్లో చాలామంది తమ ఇళ్లలో ఇన్వెర్టర్లు, చిన్నపాటి షాపుల్లో సైతం జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కరెంటు పోతే పనులకు అంతరాయం కలగకుండా ఇవి ఏర్పాటు చేసుకుంటారనే విషయం తెలిసిందే. సాధారణ ప్రజలే ఇన్వెర్టర్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన సచివాలయంలో జనరేటర్లు, ఇన్వెర్టర్లు ఉండాలి కదా. ముఖ్యమంత్రి, మంత్రులతో సహా వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్న సెక్రటేరియట్‌లో కరెంటు పోతే పని ఆగిపోకుండా ఏర్పాట్లు చేసుకోవాలి కదా. 

అయితే 'తాళము వేసితిని..గొళ్లెము మరచితిని' అనే కామెడీ చిత్రగుప్తుడి డైలాగ్‌ మాదిరిగా 'కోట్లు పోసి సచివాలయం కట్టితిని...జనరేటర్లు, ఇన్వెర్టర్లు ఏర్పాటు చేయుట మరిచితిని' అంటున్నారు చంద్రబాబు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో కరెంటు సరఫరా ఆగిపోతే ఇంతే సంగతులని 'పచ్చ' పార్టీ పాట పాడే పత్రికే రాసింది. తీవ్రమైన విద్యుత్‌ అంతరాయాల కారణంగా కంప్యూటర్లు పాడైపోతున్నాయట. వాటిల్లోని డేటా ఎగిరిపోతోందట. కరెప్ట్‌ అయిపోతోందట. కంప్యూటర్లలోని విలువైన సమాచారం కనబడకుండాపోతే ఉద్యోగులకు కుక్కచావే. విద్యుత్‌ అంతరాయాల కారణంగా కొన్ని మిషన్లు కాలిపోతున్నాయట. 

కరెంటు పోయాక ఆ తరువాత ఒక్కసారిగా హైవోల్టేజీ వస్తే కొన్ని యంత్రాలు పాడైపోవడమో లేదా కాలిపోవడమో జరుగుతుంది. విద్యుత్‌ అంతరాయాల కారణంగా తాము పనిచేయలేకపోతున్నామని, అంతా గందరగోళంగా ఉందని ఉద్యోగులు, అధికారులు గొల్లుమంటున్నారు. టెక్నాలజీ అంటే పడిచచ్చే చంద్రబాబుకు, పేపర్‌లెస్‌ ఆఫీసుల జపం చేసే సీఎంకు, ఇ-పాలన అంటూ ఊదరగొట్టే ముఖ్యమంత్రికి జనరేటర్లు, ఇన్వెర్టర్లు ఏర్పాటు చేయాలనే కనీస ఆలోచన రాకపోవడం విచిత్రంగా ఉంది. ఆయనకు రాలేదు సరే మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు ఏం చేస్తున్నారు? ఏపీలో నిరంతర విద్యుత్‌ సరఫరా ఉందని, క్షణం కూడా కరెంటు పోదని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. 

క్షణం  కూడా విద్యుత్‌ సరఫరా ఆగిపోదనే ఉద్దేశంతోనే జనరేటర్లు, ఇన్వెర్టర్లు ఏర్పాటు చేయలేదమో....! 'వాన రాకడ...ప్రాణం పోకడ' ఎవరికీ తెలియదన్నట్లే కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి ముందు జాగ్రత్తగా జనరేటర్లు, ఇన్వెర్టర్లు అత్యవసరం. సచివాలయం ఉద్యోగులను హైదరాబాద్‌ నుంచి తరలివచ్చేంతవరకు చంద్రబాబు నాయుడు వారి వెంట పడ్డారు. డెడ్‌లైన్ల మీద డెడ్‌లైన్లు పెట్టి వారికి నిద్ర పట్టకుండా చేశారు. కుటుంబం హైదరాబాదులో ఉండి, ఆయన ఆంధ్రాలో ఉంటున్నారు కాబట్టి ఆయనకు ఎలాగూ నిద్ర పట్టదు. దాంతో వెలగపూడికి తరలివచేంతవరకు ఊరుకోలేదు. 

అమరావతికి తరలివెళ్లాలనే ఆదేశాలు వచ్చినప్పటినుంచే హైదరాబాద్‌ సచివాలయంలో పనులు కుంటుపడ్డాయి. డెడ్‌లైన్లు, షిఫ్టింగు, కుటుంబ సమస్యల కారణంగా ఉద్యోగులు దాదాపు పని చేయడం మానేశారు. తీరా వెలగపూడికి వచ్చాక కూడా కరెంటు సమస్యల కారణంగా పనులు జరగడంలేదు. అందులోనూ ఉద్యోగులు ఇంకా హైదరాబాద్‌ మూడ్‌ నుంచి బయటకు రాలేదు. మెజారిటీ ఉద్యోగుల కుటుంబాలు ఇంకా హైదరాబాదులోనే ఉన్నాయి. వారానికి ఐదు రోజుల పనే కాబట్టి అక్కడికి ..ఇక్కడికి తిరగడంతోనే సరిపోతోంది. సమస్త సౌకర్యాలు సమకూర్చుకొని ఉద్యోగులను తరలిస్తే ఇన్ని ఇబ్బందులు ఉండవు కదా. 

Show comments