పాలక పార్టీ, ప్రతిపక్షాలు ఎప్పుడూ ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చెలాయించాలని, ఒకదాన్ని మరొకటి దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. అలా దెబ్బ తీసేందుకు ఉపయోగపడే ఆయుధాలే ఎన్నికలు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు ఎన్నికలు మొదలుకొని పంచాయతీ ఎన్నికల వరకు అనేక రకాల ఎన్నికలున్నాయి.
ప్రతి ఎన్నికనూ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాటం చేస్తుంటాయి. అధికార పార్టీ కొన్ని ఎన్నికల్లో (స్థానిక సంస్థలు, ఉప ఎన్నికలు వగైరా) ఓడిపోయినా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి రాదు. కాని పరువు పోయిన భావన కలుగుతుంది. ప్రతిపక్షాలకు బలం పెరిగిన ఫీలింగ్ కలుగుతుంది. వాస్తవానికి అధికారం ఏ పార్టీకి దక్కుతుందో నిర్ణయించేది సాధారణ ఎన్నికలే.
ఉమ్మడి ఏపీ విభజన జరిగిన తరువాత తెలంగాణలో పలు ఎన్నికలు జరిగాయి. అన్నింటిలోనూ పాలక టీఆర్‌ఎస్ విజయం సాధించి ప్రతిపక్షాలను దారుణంగా దెబ్బతీసింది. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్సే గెలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి అభిప్రాయం ఏపీలో లేదు. గత సాధారణ ఎన్నికల తరువాత అక్కడ ఇప్పటివరకు ఎలాంటి ఎన్నికలూ జరగలేదు. దీంతో అధికార, ప్రతిపక్షాల సత్తా ఏమిటో తెలియలేదు.
ఫిరాయింపుదారులతో అధికార పార్టీ రాజీనామా చేయించలేదు. తెలంగాణలోనూ ఆ పని చేయలేదనుకోండి. అక్కడ జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు జరిగాయి. కాని ఏపీలో కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు, మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సివున్నా ప్రభుత్వం వాయిదావేస్తూ పోతోంది. సాధారణ పరిస్థితుల్లోనైతే 'స్థానిక' ఎన్నికలకు ప్రభుత్వం భయపడనక్కర్లేదు.
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సమస్యలే కీలకపాత్ర పోషిస్తాయి. అధికార పార్టీ కొన్నింటిని గెలుచుకోకపోయినా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కాని ఏపీ సర్కారు ఈ మున్సిపోల్స్‌లో ప్రతికూల ఫలితాలు వస్తాయేమోనని, ఆ ప్రతికూలత 2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందేమోనని భయపడుతోంది.
ఈ భయానికి కారణం ప్రత్యేక హోదాను, ప్రత్యేక ప్యాకేజీని వదులుకొని కేంద్రం ఆఫర్ చేసిన ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అంగీకరించడం. వైకాపా అధినేత జగన్ ప్రత్యేక హోదా సమస్యపై తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో సత్తా చాటుతానన్నారు. అదీ జరగలేదు. ఇక ఎవరి సత్తా ఏమిటో తేలిది నంద్యాల ఉప ఎన్నికలోనే.
ఈ ఎన్నిక నిర్వహణ ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి స్థానిక ఎన్నికల్లా వాయిదా వేసేందుకు కుదరదు. అన్ని పార్టీలు దాని కోసం ఎదురుచూస్తున్నాయి. గతంలో తెలంగాణలో వరంగల్ ఉప ఎన్నిక ఎంత ఉత్కంఠ కలిగించిందో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికా అలాగే ఉంది. టీడీపీ నుంచి రాజీనామా చేసిన శిల్పా మోహన్ రెడ్డిని వైసీపీ బరిలోకి దింపుతోంది.
టీడీపీని ఓడించి తీరుతానని ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేశారు. వైసీపీ గెలిస్తే టీడీపీకి భవిష్యత్తు ఉండదంటున్నారు. వైసీపీ గెలుపు వచ్చే ఎన్నికల్లో దాని విజయానికి సంకేతమంటున్నారు. సరే...జగన్ పార్టీయే గెలుస్తుందనుకుందాం. ఈ ఒక్క గెలుపుతో దాని భవిష్యత్తు నిర్ణయమవుతుందా?
ఈ గెలుపు వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైకాపా ఘన విజయం సాధిస్తే కొంతవరకు భవిష్యత్తును అంచనా వేయొచ్చు. ఆ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. నంద్యాల్లో టీడీపీ ఓడిపోతే చంద్రబాబు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవల్సివస్తుంది. ప్రతి విషయంలో గొప్పలు చెప్పుకునే, హైప్ క్రియేట్ చేసే ముఖ్యమంత్రి టీడీపీ ఓటింగ్ షేర్ పెరిగిందని కొంతకాలం క్రితం చెప్పుకున్నారు.
'పచ్చ' పార్టీ ఓటింగ్ షేర్ గత ఎన్నికలతో పోలిస్తే 16.13 శాతం పెరిగిందన్నారు. వైఎస్సార్‌సీపీ ఓట్ల శాతం 13.45 శాతం పడిపోయిందట. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ టీడీపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఈ పెరుగుదలకు, తరుగుదలకు ఆధారాలేమిటో చెప్పలేదు. చంద్రబాబు చెప్పింది ఎంతవరకు నిజమో నంద్యాల ఉప ఎన్నిక తేలుస్తుందా?