వాడకంలో బాబును మించిన మోడీ

అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు వుంది ప్రధాని మోడీ వ్యవహారం. జనాల్ని వాడుకోవడం, అవసరం తీరాక వదిలేయడంలో ఘనుడు చంద్రబాబు అని ఆంధ్ర రాజకీయాలు తెలిసిన వారిని ఎవరిని అడిగినా చెబుతారు. ఏ టైమ్ లో ఏ కాయిన్ ను రాజకీయ చదరంగంలో ముందుకు నడపాలో బాబుకు తెలిసినట్లు మరెవరికీ తెలియదు. ప్రత్యర్థులను విమర్శించాలన్నా కూడా ఆయన అవతలివాళ్లను బట్టి ఇవతలి వాళ్లను ముందుకు నడిపిస్తారు. రెడ్డి అయితే రెడ్డి, కాపు అయితే కాపును ముందున పెట్టి విమర్శలు చేయిస్తారు. ఇలా ఏ పనికి ఎవర్ని వాడాలో అలా వాడతారు చంద్రబాబు.

అలాంటి చంద్రబాబునే ఇప్పుడు మోడీ వాడేద్దామని చూస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా దారిలోకి తెచ్చుకుంటున్నారు. జగన్ దారిలోకి వచ్చేసారు. కేసిఆర్ ఓకె. చంద్రబాబు లాంటి మిత్రపక్షాలు ఎలాగూ రెడీ. కానీ కొరుకుడు పడని మమత బెనర్జీ లాంటి వాళ్ల మాటేమిటి? అందుకే 'బాబు గారూ మీరే మాట్లాడండి' అంటూ చంద్రబాబు కు కిరీటం తగిలించారు. అదేదో తనకు సైన్యాధ్యక్ష పదవి కట్టబెట్టేసినట్లు పొంగిపోతున్నారు చంద్రబాబు.

నిజానికి మోడీ స్టెప్ చాలా కరెక్ట్. ఎందుకంటే ఇంకెవరిని ఈ పనికి ఎంచుకున్నా, అసలు ఇంచి కూడా ముందుకు కదలదు. కానీ చంద్రబాబు తరహా వేరు. మామూలుగానే పని పట్టుకుంటే వదలరు. అందునా మోడీని ఎలా ప్రసన్నం చేసుకోవాలా అని చూస్తున్న టైమ్ లో ఇలాంటి పని అప్పగిస్తే ఇక తన చాణక్యం అంతా చూపిస్తారు. ఇదంతా మోడీకి తెలియంది కాదు. అందుకే కాగల కార్యం చంద్రబాబు తీర్చాలని ఇలా పురమాయించారు.

సరే మమత మొండి తనం తెలిసిందే. కానీ ఆ మొండితనాన్ని చంద్రబాబు ఏవిధంగా సానుకూలం చేస్తారో చూడాలి. అసలే మోడీని జగన్ వెళ్లి కలిసారు. భాజపా జనాలు ఏమో, 2019 పొత్తు సంగతి అప్పుడు చూద్దాం అంటున్నారు. ఇలాంటి టైమ్ లో ఈలోగా మోడీ-బాబు బంధం ఫెవికాల్ కన్నా గట్టిది అని ఆయన అనుకూల మీడియా అచ్చేసుకోవడానికి మాత్రం ఈ వైనం బాగా పనికి వస్తుంది.

Show comments