పవన్‌కళ్యాణ్‌కి ఇంకో మెగా నిర్మాత

మెగా నిర్మాత అంటే అలా ఇలా కాదు, వంద కోట్ల పైన ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. ఆయనెవరో కాదు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. ప్రస్తుతానికి తన కుమారుడ్ని హీరోగా పరిచయం చేస్తున్న కుమారస్వామి, త్వరలో తెలుగులో ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. అది కూడా పవన్‌కళ్యాణ్‌తో కావడం విశేషం. 

ఈ రోజు కుమారస్వామి, హైద్రాబాద్‌కి వచ్చింది తన కొడుకు సినిమా ప్రమోషన్‌ కోసం మాత్రమే కాదట, పవన్‌కళ్యాణ్‌తో నిర్మించబోయే సినిమా గురించి చర్చించడానికి కూడానట. ఇంతకీ, పవన్‌కళ్యాణ్‌ - కుమారస్వామి మధ్య ఇంతటి స్నేహం ఎప్పుడు కుదిరిందట.? ఏమో మరి, ఎవరికీ తెలియదు. కానీ, పవన్‌కళ్యాణ్‌ తనకు అత్యంత ఆప్తుడని కుమారస్వామి చెప్పుకొచ్చారు. ఇది కాస్తంత ఆశ్చర్యకరమే. 

తన కుమారుడు నిఖిల్‌ని హీరోగా పెట్టి, 70 కోట్ల ఖర్చుతో 'జాగ్వార్‌' సినిమాని కుమారస్వామి నిర్మించిన విషయం విదితమే. ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. తెలుగులో ఈ సినిమా ప్రమోషన్‌ కోసం పవన్‌ సాయాన్ని కోరిన కుమారస్వామి, పనిలో పనిగా పవన్‌తో చేసే సినిమాపైనా చర్చించారట. అన్నీ కుదిరితే, దసరా పండక్కే కుమారస్వామి నిర్మాతగా, పవన్‌కళ్యాణ్‌ హీరోగా సినిమా అనౌన్స్‌ అయ్యే అవకాశాలున్నాయి. 

అంతా బాగానే వుందిగానీ, కర్నాటక మాజీ సీఎం.. కర్నాటక రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కుమారస్వామి.. తెలుగు రాజకీయాల్లో జనసేన పేరుతో పార్టీ పెట్టి హల్‌చల్‌ చేయాలనుకుంటున్న పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయడం.. ఏమిటట.? ఇదంతా సినిమా స్నేహమేనా.? అంతకు మించి ఏమన్నా వుందా.? ఏమో మరి, కాలమే సమాధానం చెప్పాలి.

Show comments