ఎమ్బీయస్‌ : యూరోప్‌ గాథలు- 32

రోమన్‌ కాలండరులో నెలను మూడు భాగాలుగా విభజించి చూస్తారు. నెల మధ్య కాలాన్ని ఐడ్స్‌ అంటారు. ఇది నాలుగు నెలల్లో 15 వ తారీకుకి, 8 నెలలల్లో 13 వ తారీక్కు వస్తుంది. మార్చినెలలో 15న వస్తుంది. దాన్ని (|ఖిలిరీ ళితీ ఖబిజీబీనీ) పవిత్రదినంగా భావించి రోమ్‌ ప్రజలు జరుపుకుంటూ వుంటారు. ఒక సోదె చెప్పేవాడు సీజరుతో ''ఐడ్స్‌ ఆఫ్‌ మార్చి నాటికి నీకు ప్రమాదం కలుగుతుంది.'' అని హెచ్చరించాడట. తన హత్య జరిగిన 'థియేటర్‌ ఆఫ్‌ పాంపే' (ప్రజలను మెప్పించడానికి యీ భవనాన్ని పాంపే తన డబ్బుతో కట్టించాడు కాబట్టి అతని పేరు పెట్టారు)కు సీజరు వెళ్లబోతూ వుండగా అతను ఎదురయ్యాడు. సీజరు అతనితో నవ్వుతూ ''ఐడ్స్‌ ఆఫ్‌ మార్చ్‌ వచ్చేసిందిగా'' అన్నాట్ట. ''వచ్చింది కానీ వెళ్లిపోలేదుగా'' అని జవాబిచ్చాడట అతను. ఏదైనా రాజకీయ కుట్ర జరిగినపుడు ''ఐడ్స్‌ ఆఫ్‌..'' అని అనడం కూడా వాడుకలోకి వచ్చింది. ఎన్టీయార్‌ను నాదెండ్ల పదవీచ్యుతుణ్ని చేసినపుడు ఇంగ్లీషు పేపర్లు 'ఐడ్స్‌ ఆఫ్‌ ఆగస్ట్‌' అని కాప్షన్‌ పెట్టాయి. 

కుట్రదారులందరూ కత్తులతో పొడుస్తూ వుంటే సీజరు పోర్టికో మెట్లపై జారిపడ్డాడు. అతను రక్తపు మడుగులో పడి వుండగానే అందరూ నిర్దాక్షిణ్యంగా అతన్ని పొడవసాగారు. సుమారు 60 మంది కుట్రలో పాలు పంచుకున్నారు. అతను 23 కత్తిపోట్లకు గురై అతను రక్తస్రావంతో మరణించాడు. తమకు తాము లిబరేటర్స్‌ (విముక్తిదారులు) అని పేరు పెట్టుకున్న యీ సెనేటర్లు సీజరుని చంపడంతో ఆగకుండా అతని అనుయాయులను కూడా చంపుతారని ఆంటోనీ భయపడ్డాడు. ఒక బానిసలా వేషం మార్చుకుని రోము విడిచి పారిపోయాడు. కానీ అలా జరగలేదు. రోములోని మధ్యతరగతి, పేద ప్రజలకు సీజరు అంటే ఆరాధన. అతని నియంతృత్వభావాలతో వారికి పని లేదు. డబ్బున్న కొందరు కలిసి సీజరును చంపారని వారికి కోపం వచ్చింది. ఆ సంగతి తెలిసి సీజరు హంతకులు  రాజధాని ప్రాంతంలోనే సైనికుల రక్షణలో దాగున్నారు. 

ఇది గ్రహించాక ఆంటోనీ తిరిగి వచ్చాడు. కాన్సల్‌గా వున్న తన హోదా వుపయోగించి ప్రభుత్వ ఖజానాను అజమాయిషీలోకి తీసుకున్నాడు. సీజరు భార్యను కలిస్తే ఆమె సీజరు ఆస్తిపాస్తుల కాగితాలు, అతని వీలునామా యిచ్చింది. హత్య జరిగిన మర్నాడే సీజరు ఆశ్వికదళాధిపతి లెపిడస్‌ 6 వేల మంది సైనికులను వెంటపెట్టుకుని రోముకి వచ్చి సీజరు అనుయాయులకు ఏ హానీ జరగకుండా చూస్తానన్నాడు. సైన్యంతో రాజధాని ప్రాంతంపై దాడి చేసి హంతకులను వధిస్తానన్నాడు. కానీ ఆంటోనీ లౌక్యంగా వ్యవహరించాలన్నాడు. అంతర్యుద్ధం తలెత్తకుండా ప్రస్తుతానికి వాళ్లతో రాజీ పడితే మంచిదని నచ్చచెప్పి బ్రూటసు తదితర సెనేటర్లకు కబురు పంపాడు. సీజరు సైన్యం దూకుడు గమనించి వాళ్లు కూడా రాజీమార్గం మంచిదనుకున్నారు. రాజీ షరతులలో భాగంగా సెనేటు సమావేశమై సీజరు హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించాలని, ఆ తీర్మానాన్ని ఆంటోనీయే ప్రవేశపెట్టాలని అడిగారు. బ్రూటసు, కేషియస్‌ పదవులు పదిలంగా వుండాలని కోరారు. సీజరు తీసుకున్న నిర్ణయాలను తిరగతోడరాదని ఆంటోనీ పట్టుబట్టాడు. సీజరు స్థానంలో డోలబెల్లాను కాన్సల్‌గా పెడతామని సెనేటర్లు అన్నపుడు ఆంటోనీ ఒప్పుకోవలసి వచ్చింది. ఇవన్నీ చూసి గత్యంతరం లేక ఆంటోనీ తమతో రాజీపడ్డాడని బ్రూటసు, కేషియస్‌ సంతోషపడ్డారు. సీజరు అంత్యక్రియల నాడు తనకు ఉపన్యాసం యిచ్చే అవకాశం యిమ్మనమని ఆంటోనీ కోరితే సరేనన్నారు. 

మార్చి 19 న సీజరు విల్లు తెరిచి చదివారు. సీజరు తన వారసుడిగా 19 ఏళ్ల తన మేనల్లుడు గియాస్‌ ఆక్టేవియన్‌ను (తర్వాతి రోజుల్లో యితను చక్రవర్తి అయ్యాక తన పేరును అగస్టస్‌గా మార్చుకున్నాడు) నియమించాడు, క్లియోపాత్రా కొడుకును కాదు! మార్చి 20 న సీజరు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. బ్రూటసు ముందుగా మాట్లాడాడు - 'నేను సీజరును తక్కువగా ప్రేమించలేదు, రోమును ఎక్కువగా ప్రేమించానంతే. సీజరుకు అధికారకాంక్ష పెరిగింది, అందుకనే నేను చంపాను. రోమ్‌ కోసం నా ప్రియమిత్రుణ్ని చంపడమే కాదు, నా ప్రాణమైనా యిస్తాను. బానిసత్వాన్ని ప్రేమించే, రోమన్‌ ప్రేమించలేని మనిషి యిక్కడుంటే వారే నాతో వ్యతిరేకిస్తారు' అంటూ. జనాలు హర్షధ్వానాలు చేశారు.  Readmore!

అప్పుడు ఆంటోనీ తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు - 'రోమ్‌ పౌరులారా, మిత్రులారా, కాస్త చెవి ఒగ్గి వినండి. సీజరును సమాధి చేయడానికే వచ్చాను, పొగడడానికి కాదు. సీజరు అత్యాశాపరుడని గౌరవనీయుడైన బ్రూటసు చెప్పాడు. అత్యాశ తప్పు, అందుకే సీజరు మూల్యం చెల్లించాడు. ఎందరినో బానిసలుగా చేసి రోమ్‌కు తెచ్చాడు, ధనరాసులతో రోమ్‌ను నింపివేశాడు, యుద్ధాలలో గెలుస్తున్నా, రోమ్‌కు కీర్తి కలుగుతున్నా అంతటితో ఆగకుండా ఒకదాని తర్వాత మరొక యుద్ధం చేస్తూ రోమ్‌ను విస్తరిస్తూ పోయాడు. అది అత్యాశ కాక మరేమిటి? అందుకే బ్రూటస్‌ గౌరవనీయుడంటున్నాను. సీజరుకు నేను మూడు సార్లు కిరీటాన్ని బహూకరించాను, ఆయన తిరస్కరించాడు. దానికి కారణం అత్యాశట. మీరంతా అతన్ని ప్రేమించారు, ఆరాధించారు. దానికి ఏదో కారణం వుండి వుండాలి. అది సీజరు అత్యాశే అంటున్నాడు బ్రూటసు. ఆయన గౌరవనీయుడు కాబట్టి అది నిజమే అయి వుండాలి. నిన్నటి వరకు మేరు పర్వతంలా నిలబడిన సీజరు యీనాడు కట్టెలా పడివున్నాడు. బ్రూటసుకున్న వాక్చాతుర్యం నాకు వుండి వుంటే అతని గాయాల చేత మాట్లాడగలిగించి వుండేవాణ్ని. ఇదిగో కేషియస్‌ పొడిచిన యిక్కడే, బ్రూటసు పొడిచినది యిక్కడే అని వాటంతట అవే చెప్పగలిగేవి. కానీ నేను బ్రూటసు వంటి వక్తను కాను..

''.... సీజరు విల్లు మాత్రం చదువుతాను, దానిలో అతను ప్రజాసంక్షేమం కోసం ధర్మనిధులు ఏర్పాటు చేసిన విషయం గమనించండి. దీన్ని అత్యాశ అని మర్యాదస్తుడైన బ్రూటసు అంటున్నాడు, నిజమే కాబోలు...' అంటూ యీ ధోరణిలో హంతకుల ఎదుటే, వారిని మెచ్చుకుంటున్నట్లే మాట్లాడుతూ లౌక్యంగా వారి వాదనలో లోపాల్ని ఎత్తి చూపిస్తూ, ప్రజలను రెచ్చగొడుతూ రక్తసిక్తమైన సీజరు దుస్తులు ప్రదర్శించడంతో, రోమన్‌ ప్రజలందరిలో ఒక్కసారిగా హతుడిపై సానుభూతి కురిసింది. అతను ప్రాణాలొడ్డి పోరాడినది సామ్రాజ్యవిస్తరణకే కదా, రోమ్‌ కోసమే కదా అనే భావం కలిగి, హంతకులపై కోపం రగిలి వారిని చంపబోయారు. వారు ప్రాణభీతితో ఇటలీ పారిపోయారు. రోమన్‌ ప్రజలు ఫోరమ్‌లోని సెనేటర్ల యిళ్లు తగలబెట్టారు. అప్పుడు ఆంటోనీ బ్రూటస్‌, కేషియస్‌లతో ''మీరిక్కడుంటే మీ ప్రాణాలకు రక్షణ కల్పించలేను. మీ ఉద్యోగాల నుంచి తప్పిస్తాను, సిసిలీ, ఆసియా వెళ్లి గోధుమలు సేకరించండి.'' అన్నాడు. గోధుమలు సేకరించే పరువుతక్కువ పని చెయ్యం అంటూ యిద్దరూ గ్రీసుకి వెళ్లిపోయారు. పరిస్థితంతా గమనించిన క్లియోపాత్రా యిక్కడ వుంటే తనకు, తన బిడ్డకు ప్రాణాలకు ముప్పని భయపడి  దాదాపు ఏడాదిన్నర మకాం ఎత్తేసి వెంటనే ఈజిప్టుకు ప్రయాణమైంది.  (ఫోటోలు - సీజరు హత్య చిత్రం, హత్య జరిగిన థియేటర్‌ ఆఫ్‌ పాంపే భవంతి - ప్రస్తుతం రోమ్‌లో కనబడే స్థితి)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్ 2016)

mbsprasad@gmail.com

Click Here For Archives

Show comments

Related Stories :