'అయ్యా..ఎస్‌..' అనలేదని.!

ఐఏఎస్‌ అధికారులంటే రాజకీయ నాయకులకి, ముఖ్యంగా అధికారంలో వున్నవారికి ఎంత చులకన.? అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంత్రిగారో, ముఖ్యమంత్రిగారో వాహనంలో వేగంగా వెళ్ళిపోతోంటే, ఆ వాహనం వెనుక ఐఏఎస్‌ అధికారి పరుగులు పెట్టడం చూస్తున్నాం.

రాజకీయ నాయకులదేముంది.? వారి 'పవర్‌' అయిదేళ్ళకి మాత్రమే పరిమితం. ఆ తర్వాత, మళ్ళీ 'పవర్‌' రావాలంటే అదృష్టముండాలి. అధికారుల పరిస్థితి అది కాదు. కానీ, రాజకీయ నాయకులకి అధికారులంటే చులకనే.! 

ఇప్పుడిదంతా ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్‌ మాజీ చీఫ్‌ ఐవైఆర్‌ కృష్ణారావు విషయంలో చంద్రబాబు సర్కార్‌ అనుసరిస్తున్న వైఖరి, సర్వత్రా విమర్శలకు తావిస్తోంది మరి.! తన మీద జరుగుతున్న దుష్ప్రచారంపై ఐవైఆర్‌ మీడియా ముందుకొచ్చి 'క్లారిటీ' ఇచ్చారు.

బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవిని తాను అడగలేదనీ, చంద్రబాబు పిలిచి ఇచ్చారనీ.. ప్యాషన్‌తోనే ఈ పని చేస్తున్నాను తప్ప, ఈ పని కోసం తాను జీతం కూడా తీసుకోవడంలేదని చెప్పుకొచ్చారు ఐవైఆర్‌. 

బ్రాహ్మణ కార్పొరేషన్‌కి సంబంధించి లబ్దిదారుల్లో వైఎస్సార్సీపీకి చెందినవారే వుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించడాన్ని ఖండించిన ఐవైఆర్‌, లబ్దిదారులంటారు తప్ప, వైఎస్సార్సీపీ లబ్దిదారులు.. టీడీపీ లబ్దిదారులు.. అన్న ప్రస్తావనే వుండదని తేల్చి చెప్పారు. రాజీనామా చెయ్యమంటే చేసేవాడిననీ, పదవిలోంచి తీసేయడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. 

రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదనీ, చీఫ్‌ సెక్రెటరీగా పనిచేసిన తాను ఎమ్మెల్యే పదవి కోసం కక్కుర్తి పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టి పారేశారు. ఒకవేళ చంద్రబాబు పిలిచి మంత్రి పదవి ఇస్తానన్నా, తాను ఆ పదవిలో ఇమడలేనని, వద్దనేవాడినని చెప్పుకొచ్చారాయన. 

టీటీడీ ఈవోగా దక్షిణాదికి చెందిన ఐఏఎస్‌ అధికారికి ఇచ్చి వుంటే బావుండదనీ, ప్రజా ప్రతినిథులుగా వున్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదని కేశినేని నాని, జేసీ దివాకర్‌రెడ్డి విషయంలో ప్రజలే బాధపడ్తున్నారనీ, తాను సోషల్‌ మీడియాలో ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించి వాటిని షేర్‌ చేశాను తప్ప, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడూ పోస్ట్‌ పెట్టలేదని ఐవైఆర్‌ వివరణ ఇచ్చుకున్నారు. 

మొత్తమ్మీద, చీఫ్‌ సెక్రెటరీగా పనిచేసిన వ్యక్తి, ఆ పదవికి రాజీనామా చేశాక.. ఆయన పరిస్థితి ఏంటన్నది చంద్రబాబు సర్కార్‌ ఐవైఆర్‌ కృష్ణారావు ద్వారా తెలియజేసిందన్నమాట.

ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం మాజీ సీఎస్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఆరు నెలలపాటు చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చిందంటే.. అంతలా ఆయన్ని వేధింపులకు గురిచేయడాన్ని ఏమనుకోవాలి.? అన్నిటికీ 'అయ్యా... ఎస్‌..' అనేవాళ్ళే ఐఏఎస్‌ అనే అభిప్రాయం టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులో బలంగా వుందనే కదా.!

Show comments