మోదీ జూదం ఆడారా?

 

ప్రధాని నరేంద్ర మోదీ జూదం ఆడటమేమిటి? ఆ పనిచేసేది పనీపాటా లేని జులాయిగాళ్లు, కోటీశ్వరులు, డబ్బు ఎక్కువగా ఉన్న సరదారాయుళ్లు వగైరా. జూదం చట్టం దృష్టిలో నేరం కదా. పట్టుబడితే వెంటనే అరెస్టు చేస్తారు. ప్రధాని పదవిలో ఉన్న మోదీ ఇంత పెద్ద నేరం చేస్తారా? చేయరు. కాని ఆయన జూదం ఆడారని చైనా అధికారిక పత్రిక 'గ్లోబల్‌ టైమ్స్‌' వ్యాఖ్యానించింది. అయితే మోదీ ఆడింది జూదగాళ్లు ఆడే జూదం కాదు. నల్ల డబ్బును నిర్మూలించడానికి ఆర్థిక వ్యవస్థతో ఆడిన జూదం. అంటే పెద్ద నోట్లను రద్దు చేయడమన్నమాట. 

పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత చైనా మీడియా ఒకసారో రెండుసార్లో తన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. తమ పాలకులు నల్లదనం నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ మోదీ చర్యలపై, పర్యవసానాలపై విశ్లేషణలు వెలువరించింది. ఇప్పుడు మరోసారి వ్యాఖ్యానాలు చేసింది. కొన్ని రోజుల కిందట చైనా మీడియా మోదీ నిర్ణయాన్ని మెచ్చుకుంటూనే అమలు తీరును విమర్శించింది. ఇప్పుడు మరికొద్ది ఘాటుగా స్పందించింది. మోదీ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇది జూదం ఆడటం మాదిరిగా ఉందని పేర్కొంది. నల్లధనం రూపుమాపాలన్న లక్ష్యానికి సంబంధించి నోట్ల రద్దు నిర్ణయం విజయం సాధిస్తుందా? వైఫల్యానికి దారితీస్తుందా? చెప్పలేమని, ఏదైనా జరగొచ్చని తెలిపింది. 

ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుందనేది కొంతకాలం తరువాత తెలుస్తుంది. ఒకవేళ తమ దేశంలో 50, 100 యువాన్‌లు రద్దు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించడం కష్టమని గ్లోబల్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది. 'ఆర్థిక సంస్కరణల కోసం మోదీ జూదం ఆడారు' అని ఈ పత్రిక మొహమాటం లేకుండా చెప్పేసింది. చైనాలో వంద యువాన్‌ కరెన్సీ అత్యధిక డినామినేషన్‌. తన నిర్ణయం సఫలమవుతుందా? విఫలమవుతుందా? అనే సందిగ్ధంలో మోదీ కొట్టుమిట్టాడుతున్నారని ఈ పత్రిక అభిప్రాయపడింది. ఈ పత్రిక వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం...భారత్‌లో 90 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతాయి.  Readmore!

ఈ పరిస్థితిలో చెలామణిలో 85 శాతం వరకు ఉన్న నోట్లను ఒక్కసారిగా రద్దు చేయడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. 'ఇది వ్యవస్థాగత దోపిడీ' అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ఘాటు వ్యాఖ్యను చైనా పత్రిక ప్రత్యేకంగా నొక్కి వక్కాణించింది. నోట్ల రద్దు నల్లధనాన్ని, అవినీతిని కొంతవరకు అరికట్టవచ్చేమోగాని లోతైన సామాజిక, రాజకీయ సమస్యలకే ఇదే పరిష్కారం కాదని చెప్పింది. చైనా పత్రిక అభిప్రాయంలో...సంస్కరణ అనేది క్లిష్టమైంది. దానికి చాలా ధైర్యం కావాలి. మోదీ లక్ష్యం మంచిది. అయితే సమర్థమైన వ్యవస్థ, సమాజం నుంచి పూర్తి సహకారం ఉంటేనే ఇది సఫమవుతుంది. 

కాని మోదీ ప్రభుత్వ సమర్థత పట్ల ఎక్కువమంది నిరాశ చెందుతున్నారు. భారత్‌ పాశ్చాత్యశైలి ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇక్కడ ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేందుకు కొంతవరకు అవకాశముంది. మోదీ నిర్ణయానికి విస్తృతంగా ప్రజామద్దతు లభిస్తే తప్ప ఇది విజయవంతం కాదు. ఇండియాలో అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల నుంచి తమ దేశం పాఠాలు నేర్చుకుంటోందని గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. నోట్ల రద్దుపై కొద్ది రోజుల కిందట చైనా మీడియా  మొదటిసారి స్పందించింది.  నల్లధనాన్ని అంతం చేయడానికి మోదీ చేసిన ప్రయత్నాన్ని హర్షిస్తూనే ఇది 'రిస్క్‌తో కూడిన వ్యవహారం' అని పేర్కొంది. 

పెద్ద నోట్లు రద్దు చేసినంత మాత్రాన నల్లధనం నాశనం కాదని, అవినీతి హరించుకుపోదని చైనా మీడియా తేల్చిచెప్పింది. అయితే ఒక ప్రయత్నమంటూ చేసినందుకు మోదీని అభినందించింది. ఈ సందర్భంగానే ఓ సలహా ఇచ్చింది. ఏమిటది? అవినీతిని అరికట్టడానికి చైనా అనుసరిస్తున్న, అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని పేర్కొంది. అంటే ఆ దేశ విధానాలను అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకుంటే బాగుండేదని చైనా మీడియా అభిప్రాయం కాబోలు. చైనా ఎంత కమ్యూనిస్టు దేశమైనా అక్కడా అవినీతి ఉంది. అక్కడ అవినీతికి పాల్పడినవారు, తప్పుడు పనులు చేస్తున్నవారు దొరికిపోతే కఠిన శిక్షలు విధిస్తారు. 

దాదాపుగా మరణ శిక్షే అమలు చేస్తారు. ఈ విషయంలో ఎంత ఉన్నతస్థానంలో ఉన్నవారినైనా వదలిపెట్టరు. అవినీతిపరులను శిక్షించినంత మాత్రాన వెంటనే అవినీతి అంతం కాదు. అవినీతి జరుగుతున్న, నల్లధనం పోగుపడుతున్న మార్గాలను మూసేయాలి. అందుకే అవినీతి జరగకుండా తాము ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నామో అధ్యయనం చేయాలని చైనా మీడియా సలహా ఇచ్చింది. 

దశాబ్దాలుగా చైనా అవినీతి అరికట్టే చట్టాలను అమలు చేస్తోందని, పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చి దాన్ని బలోపేతం చేసిందని, పాలనలో పారదర్శక విధానాలు అమలు చేస్తోందని ఆ దేశం మీడియా తెలిపింది. నోట్ల రద్దుపై ప్రముఖ విదేశీ పత్రికలన్నీ అభిప్రాయాలు చెప్పాయి. విశ్లేషణలు చేశాయి. ప్రజల కష్టాలను ఏకరువు పెట్టాయి. 

Show comments

Related Stories :