ట్రంప్ తో తల గోక్కోవాలిక.. ప్రపంచం కాచుకో ఇక!

అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు పట్టుకునే రోజులు ఇవి! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం..  ప్రపంచంలోని పెద్ద ఆర్థిక శక్తి గల దేశాల మార్కెట్లు అతలాకులం కావడం దగ్గర నుంచి అనామక దేశాల్లో కరెన్సీ విలువ పతనం వరకూ ఎన్నో  పోట్లకు కారణం అయ్యింది ఇప్పటికే! ట్రంప్ టొర్నోడో ధాటికి భారత స్టాక్ మార్కెట్లలో లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది! ఈ తుఫాన్ జపాన్ ను కూడా వణికించింది. అనేక దేశాల కరెన్సీ మారకం విలువ ఎన్నడూ లేనంత స్థాయిలో పతనం అయ్యింది!

మరి ఈ విధంగా ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసిన ట్రంప్ ముందు ముందు ఇంకేం చేస్తాడు? అనేది ఒక ఊహకు అంతుబట్టని అంశం. ప్రపంచం అతడిని విచ్ఛిన్నకారి అనుకుంటే.. అమెరికన్లు జాతీయ వాది అనుకున్నారు. అంతే.. ఒకరి దృష్టిలో జాతీయ వాద మరొకరి దృష్టిలో విచ్ఛిన్నవాదం! ఇస్లామిక్ టెర్రరిజం దగ్గర నుంచి ప్రతి రాజకీయ, తీవ్రవాద అంశంలోనూ ఇదే నియమమే వర్తిస్తుంది.

ఏదేమైనా.. ఐదుకోట్ల 94 లక్షల మంది అమెరికన్లు ఎన్నుకున్న వ్యక్తి ఇక ఆరువందల కోట్ల మందిని ప్రభావితం చేయబోతున్నాడు. ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన  అంశాలు ఏమనగా.. ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ అమెరికాకు ఇచ్చిన హామీలు. వీటిని అమలు చేయడానికి అతడు పూనుకుంటే.. అసలు కథ ఆరంభం అవుతుంది. మరి ట్రంప్ ను ప్రపంచం ఎలా కాచుకుంటుందో చూడాలి.

-మెక్సికో సరిహద్దులో గోడ.. తను గోడలు నిర్మించడంలో చాలా నేర్పరిని అని ప్రకటించుకున్న ట్రంప్.. అమెరికాపై భారం పడకుండా మెక్సికో సరిహద్దుల్లో అవతల నుంచి ఎవరూ దాటకుండా గోడ నిర్మిస్తానని ప్రకటించాడు. ఇటువైపు వస్తున్న మెక్సికన్లలో ఎక్కువమంది రేపిస్టులు, నేరగాళ్లు.. వారిని అడ్డుకోవడానికి ఈ గోడ నిర్మిస్తానని ట్రంప్ ప్రకటించాడు. 

-ముస్లింలను అడుగు పెట్టనివ్వను..ఇప్పటికే ముస్లింల విషయంలో అమెరికా అనుచిత వైఖరి ప్రస్ఫుటం అయ్యింది. అమెరికాలో అడుగు పెట్టే వాళ్లలో ముస్లిం పేర్లు ఉంటే.. విమానాశ్రయాల్లో వారిని ప్రత్యేకంగా తనిఖీ చేయడం రొటీనే. భారతీయ సెలబ్రిటీల్లోని ముస్లింలు కూడా ఇబ్బంది పడ్డారు. అదే అనుకుంటే.. ట్రంప్ ఏకంగా ముస్లింలపై నిషేధం అని ప్రకటించేశాడు. వారు జిహాద్ నే అమ్ముకుంటారు.. వారిని అమెరికాలో అడుగు పెట్టనివ్వను అని ప్రకటించాడు. ఈ విషయంలో ఇకపై ఎలాంటి పరిణామాలుంటాయో చూడాల్సి ఉంది.

-హిల్లరీ క్లింటన్ పై విచారణ.. తీవ్రమైన విధ్వేషంతో జరిగిన అమెరికా ఎన్నికల ప్రచార సందర్భంలో తను అధికారంలోకి వస్తే హిల్లరీ క్లింటన్ పై క్రిమినల్ చార్జెస్ ఉంటాయని ప్రకటించాడు. సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ గా ఉన్న రోజుల్లో హిల్లరీ మెయిల్స్ పై అధ్యయనం చేస్తామని.. ఎఫ్ బీఐ విచారణ ఉంటుందని ట్రంప్ అన్నాడు. ఎన్నికల ముందే.. ఎఫ్ బీఐ హిల్లరీ మెయిల్స్ పై పరిశోధించి క్లీన్ చిట్ ఇచ్చినా.. ట్రంప్ దాన్ని అంగీకరించలేదు.

- వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు..  అమెరికన్ల ఉద్యోగాలను, వ్యాపార అవకాశాలను చైనా, భారత్  తోపాటు ఇతర దేశాలు దోచుకుపోతున్నాయని.. ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశాడు. వాటిని వెనక్కు తెస్తానని అన్నాడు. ఈ వ్యవహారాల్లో ఇది వరకటి నేతలు మూర్ఖంగా వ్యవహరించారని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పుడు అధికారం అంతా ట్రంప్ చేతికి వచ్చింది.. ఏం జరగబోతోందనేది మిస్టరీ, ప్రత్యేకించి భారత్ కు ఒక విధంగా ఆందోళన కలిగించే అంశం.
-స్థూలంగా అమెరికాను పునర్నిర్మిస్తాను.. అని ప్రకటించాడు ట్రంప్. నిన్నటి వరకూ వివాదాస్పదుడు.. ఇప్పుడు అందరూ తప్పక ఆమోదించాల్సిన శక్తి. మరి ట్రంప్ తో తలగోక్కోబోతున్న ప్రపంచం.. ఎలా తయారవుతుందో!

Show comments