మీడియాధినేతది.. పవన్ తో స్వయంతృప్తా..?

ఆయన తీర్పులు భలే ఉంటాయిలే! ఆయన రాసేదాంట్లో విషయం ఏముంటుందనేది పక్కన పెడితే.. కామెడీగా ఉంటాయి కాబట్టి అనేక మంది చదువుకొంటారు. పచ్చ పార్టీకి అనుకూలంగా కట్టె, కొట్టె, తెచ్చే.. అన్నట్టుగా రాయడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య. ఇదంతా ఓపెన్ హార్ట్ సర్జన్ గురించి! అణువణునా ఏ మాత్రం మొహమాటం లేకుండా పచ్చపాతం చూపించే ఆయన భవిష్యత్తు రాజకీయ సమీకరణాల గురించి తన మార్కు విశ్లేషణ చేశారు. ఆ కామెంటరీ సారాంశాల్లో ఒకటి ఏమిటంటే.. వచ్చే ఎన్నికల్లో “జనసేన’’ ఒంటరిగా పోటీ చేస్తే.. జగన్ కు దెబ్బ.. తెలుగుదేశం పార్టీ సులభంగా అధికారంలోకి వచ్చేస్తుంది! అనేది.

తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు.. చంద్రబాబు సూపరో..సూపరు.. జగన్ వేస్ట్.. అని ప్రతి వారాంతంలో చెప్పడమే ఆయన పని. ఆవు కథ చెప్పినట్టుగా.. ప్రతి వారం ఏదో ఒక టాపిక్ తీసుకురావడం అంతిమంగా తమ అజెండాను చెబుతుంటారంతే. 

ఇక ఆయన విశ్లేషణల్లో లాజిక్ అనేది నేతి బీరకాయలో నెయ్యి చందమే! అలాంటి పచ్చపాత విశ్లేషణల్లో ఇదీ ఒకటి. పవన్ కల్యాణ్ జనసేన తరపున అభ్యర్థులను నిలిపితే.. తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనేది ఈ నడమంత్రపు మోతుబరి మాట.

మరి లాజికల్ గా ఇది ఎంత వరకూ నిజం అవుతుంది? అనే విషయం గురించి ఆరా తీస్తే.. క్షేత్ర స్థాయి పరిశీలన అనేదేమీ లేకుండా ఈయన చెప్పిన పోచికోలు కబురు ఎంత సిల్లీగా ఉందో అర్థం అవుతుంది. 

అయినా ఈ పచ్చమీడియా పెద్దమనుషులు చిరంజీవితో వేసిన ఒక రాంగ్ క్యాలికులేషన్ ఇంకా మరిచిపోయినట్టుగా లేరు. ఆంధ్రాలో ఇంద్ర పార్టీ వస్తే.. కాంగ్రెస్ చిత్తు చిత్తే అని అప్పట్లో లెక్కలేశారు. అవే రాతలు పతాక శీర్షికలకు ఎక్కించి రాశారు. తీరా 2009 ఎన్నికల్లో వీళ్ల లెక్కలన్నీ తారు మారు అయ్యాయి. అంతిమంగా.. చిరంజీవి వల్ల చంద్రబాబుకు నష్టం జరిగిందని పిండప్రదాన వార్తల్లో పేర్కొన్నారు.

ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ పేరు చెబుతున్నారు. పవన్ వల్ల జగన్ చిత్తు చిత్తే అంటున్నారు! మరి చిరంజీవి లాగే పవన్ కూడా బూమరాంగ్ అవుతాడేమో పచ్చమీడియా పెద్దలు ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో! 

తెలుగుదేశం పార్టీ పట్ల ప్రబలిన వ్యతిరేక ఓటు … జనసేనకు ట్రాన్స్ ఫర్ అవుతుంది, కాబట్టి  తెలుగుదేశం వ్యతిరేకత అనేది జగన్ కు ఏ మాత్రం ఉపయోగపడదు.. దీంతో జగన్ పార్టీ అధికారంలోకి రావడం కల్ల అనేది ఈ పచ్చమీడియా యాజమాని కోరిక. ఆ కోరిక ను కోరుకోవడమే కాదు, రాసుకోవడానికి కూడా ఈయనకు అవకాశం ఉంది కదా. అదే రాశాడు. పవన్ ను ఊహించుకుని “స్వయంతృప్తి’’ పొందాడు!

అయితే.. ఈయన గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి.. రాష్ట్రం ఇప్పుడు ముందంత విశాలం అయినది కాదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏమీ వెనవేల ఓట్ల మెజారిటీలతో నెగ్గలేదు. వైకాపా నెగ్గిన చోట ఆ పార్టీకి వచ్చిన మెజారిటీతో పోలిస్తే.. తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో చాలా మంది తృటిలో విజయాన్ని సాధించుకున్నారనేది స్పష్టం అవుతుంది. 

జనసేన గనుక రాయలసీమ ప్రాంతంలో తన అభ్యర్థులను నిలిపితే.. అది కూడా చంద్రబాబు వ్యూహం ప్రకారం, పచ్చమీడియా మంత్రాంగం ప్రకారం జరిగితే.. వీళ్లంతా కలిసి నిస్సందేహంగా తమకు తామే కొరివి పెట్టుకున్నట్టే. రాయలసీమ నాలుగు జిల్లాల్లో పవన్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడమే జగన్ కు కావాల్సింది కూడా. పవన్ తెలుగుదేశం తరపున వీధి వీధీ తిరిగి ప్రచారం చేసినా… సీమలోని మూడు జిల్లాల్లో జగన్ పార్టీ గత ఎన్నికల్లోనే స్వీప్ చేసింది. అప్పుడే సీమపై పవన్ ప్రభావం ఎంతో అర్థం అయ్యింది. అలాంటిది ఆయన సొంతంగా అభ్యర్థులను నిలిపితే.. జగన్ ఓట్లు జగన్ కు పోగా, మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశానికి పడ్డ (టీడీపీ + పవన్) ఓట్లలో చీలిక సహజంగా వస్తుంది.

ఇక టీడీపీకి అండగా నిలిచిన అనంతపురంలో ప్రస్తుతం చంద్రబాబుపై జనాల వ్యూ ఎలా ఉందో అక్కడకు వెళితేనే అర్థం అవుతుంది. రుణమాఫీ మీద ఆశలు మాత్రమే ఇక్కడ టీడీపీకి ప్రాణం పోశాయి. ఇక్కడ నిర్ణయాత్మక శక్తి అయిన బీసీలు మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా నిలిచారు. గతంలోని కాంగ్రెస్ తో పోలిస్తే జగన్ బీసీలను చాలా వరకూ ఆకర్షించినా.. ప్రతి నియోజకవర్గంలోనూ నాలుగైదు వేల ఓట్లు ఫలితాన్ని తారుమారు చేశాయి. ఒకవేళ పవన్ గనుక పార్టీ పెడితే.. టీడీపీకి అనుకూలంగా పడే ఓట్లకే ప్రమాదం. ఆ ప్రమాదం ఎలా ఉంటుందో.. 2009లో అనంత జిల్లాలో టీడీపీ తరపున పోటీ చేసిన వారికి అనుభవపూర్వకం. నాడు చిరుపై అభిమానంతో ఓట్లేసిన వాళ్లు 2014లో సాలిడ్ గా తెలుగుదేశానికి వేశారు.  వాటితోనే పచ్చపార్టీ పరువు నిలిచింది. మరి రేపు ఈ ఓట్లు పవన్ వైపు మళ్లితే అనంతలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి 2009 నాటి కన్నా అద్వాన స్థితికి చేరవచ్చు.

సీమ పరిస్థితి ఇలా ఉండవచ్చు. ఇక కోస్తాంధ్రలో పవన్ పార్టీ “ప్రజారాజ్యం’’ స్థాయి ప్రభావం చూపిస్తుంది అనుకున్నా.. నాటి ఎన్నికల్లో త్రిముఖ పోరులో అక్కడ కాంగ్రెస్ పార్టీనే చాంఫియన్ అయ్యిందన్న విషయాన్ని మరవలేం. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి.. మహాకూటమి తరపున వెళ్లినప్పుడే.. మూడో పార్టీ వస్తే చంద్రబాబు గెలిచి నిలవలేకపోయాడు. ఇక యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటున్న తరుణంలో మూడో పార్టీ వస్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో .. ఊహించుకుంటే చంద్రబాబు వీరాభిమానులకు వణుకుపడుతుంది. అయితే పచ్చమీడియాధినేతలు మాత్రం పచ్చపాతంతోనే విశ్లేషిస్తున్నారు. దాంతోనే ‘స్వయంతృప్తి’ పొందుతున్నారు! 

ఇలా కాదు.. ఇవన్నీ మాకూ తెలుసు, “ప్రజారాజ్యం’’ తో జరిగిన నష్టమే  “జనసేన’’ తో కూడా జరుగుతుందని మాకేం తెలియనిది కాదు… అందుకే పవన్ తన పార్టీ అభ్యర్థులను సెలెక్టివ్ గా, జగన్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే పెడతాడు.. తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలుస్తుందనే చోట పవన్ పార్టీ బరిలో ఉండదు…  ఈ రాజకీయ వ్యూహంతో ముందుకు పోతాం.. తద్వారా తెలుగుదేశాన్ని గెలిపిస్తాడు.. అంటారా! మరి పవన్ తన స్థాయిని చివరకు అక్కడకు దిగజార్చుకుంటే.. చంద్రబాబు, పవన్ లు అలాంటి వ్యూహాన్నే అమలు చేయగలిగితే, చేస్తే..నిజంగా ఆ వ్యూహం ఫలించి అప్పుడు జగన్ ఓడినా.. గెలిచినట్టే!

Show comments