ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఈ కేంద్రమంత్రి..?

చాలా సంవత్సరాల తర్వాత హిందుత్వ వాద శక్తులకు రాష్ట్రపతిని ఎంపికచేసే అవకాశం వచ్చింది. పేరుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అయినా పెత్తనం అంతా నాగ్ పూర్ నుంచే సాగుతోంది, సంఘ్ పరివార్ కనుసన్నల్లోనే నడుస్తోందనేది ప్రత్యేకంగా వివరించాల్సిన అంశం ఏమీ కాదు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిగా సంఘ్ ఎంపిక ఎవరవుతారనే అంశం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే ఈ విషయంలో చాలా పేర్లు వినిపించాయి. వీహెచ్ పీ అధ్యక్ష స్థానంలోని వ్యక్తి నుంచి అనేక మంది కమలనాథుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే కొంతమందికి ఆ అవకాశాలు లేకుండా పోయాయి. అద్వానీకి మోడీ అవకాశం ఇచ్చేలా లేడు, ఆర్ఎస్ఎస్ కూడా పట్టుబట్టేలా లేదు. ఇక మురళీ మనోహర్ జోషీ అనుకున్నా.. ఆర్ఎస్ఎస్ ఆయన విషయంలో ఆసక్తితోనే ఉన్నా.. బాబ్రీ కేసు అడ్డం పడుతోంది, వీరు గాక.. మరికొందరు బీజేపీ నేతల పేర్లు రాష్ట్రపతి రేసులో వినిపించాయి.

అయితే ఈ విషయంలో మోడీ, షా లు గుంభనంగా ఉన్నారు. సంఘ్ పరివార్ కూడా ఫలానా వ్యక్తిని రాష్ట్రపతిగా చేయాలనే డిమాండ్ ను బహిరంగంగా చెప్పలేదు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది, ఈ క్రమంలో ఎన్డీయే అభ్యర్థిగా కొత్త పేరు షికారు చేస్తోంది. కేంద్రమంత్రి సుష్మా స్వరాజే కమలం పార్టీ ఎంపికగా అనే మాట వినిపిస్తోంది.

వివిధ సమీకరణాలను బట్టి ఈ ప్రచారం జరుగుతోంది. మూడు సార్లు ఎమ్మెల్యే, ఏడు సార్లు ఎంపీ, సంఘ్ పరివార్ నేపథ్యం.. రాజకీయ అనుభవం, విదేశాంగ మంత్రిగా చేసిన నేపథ్యం.. ఇవీ సుష్మా స్వరాజ్ రాజకీయ అర్హతలు. బహుశా ఇవి సరిపోతాయి కూడా. అంతేకాదు.. సుష్మా స్వరాజ్ ను నిలబెడితే ప్రతిపక్షాలు కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయి! మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి వాళ్లు సుష్మ అయితే మద్దతును ఇచ్చే అవకాశాలున్నాయి.

బహిరంగ రహస్యం ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీకి కూడా సుష్మతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. సోనియా, రాహుల్ లు వ్యక్తిగతంగా సుష్మతో సన్నిహితంగానే ఉంటారు. కాబట్టి.. సుష్మను అభ్యర్థిగా ప్రకటించాకా, ఆమె గనుక అందరి మద్దతునూ కోరితే కాంగ్రెస్ కూడా కాదనలేకపోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నిక ఏకగ్రీవంగా ముగియడానికి కూడా అవకాశం ఉంది.

అందులోనూ బీజేపీ అభ్యర్థిని ప్రకటించాకా తమ అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ఏ రకంగా చూసిన సుష్మ కమలం పార్టీకి బెస్ట్ ఆప్షన్ గానే కనిపిస్తోంది. ఒకవేళ మోడీ స్థాయిలో మరీ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయితే తప్ప.. ఎన్డీయే తరపున సుష్మనే అభ్యర్థిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show comments