రజనీకి తెలుస్తోంది.. పవన్ కు?

పబ్లిక్ లైఫ్ అంత వీజీ కాదు. సినిమా జనాలు ఒక విధంగా నాలుగు గోడల మధ్య వుంటారు. సినిమా ఆడితే ఓకె. ఆడకపోయినా మొహం మీద ఎవరూ ఏమీ అనేది వుండదు. మహా అయితే మరో సినిమా దొరకదంతే. కానీ పొలిటికల్ లైఫ్ అలాంటిది కాదు. ఓటు హక్కు వున్నా, లేకున్నా, ప్రతీ వోడూ మాట్లడేసేవాడే. ఓ మాట విసిరేసేవాడే.

అందుకే సినిమా వాళ్లు పాలిటిక్స్ లోకి వచ్చినా, అక్కడే, దాన్నే పట్టుకుని వేలాడేవాళ్లు సంఖ్య చాలా తక్కువ. హీరో కృష్ణ, నిర్మాత రామానాయడు, నటుడు కోటా శ్రీనివాసరావు ఇలా చాలా మంది రాజకీయాల్లోకి వెళ్లి, అక్కడి వైనాలు చూసి, బ్యాక్ టు పెవిలియన్ అని వెనక్కు వచ్చిన వారే.అంతెందుకు బాలీవుడ్ బాద్ షా అమితాబ్ కు కూడా ఈ తత్వం వంట బట్టింది.

చిరంజీవి అంటే జనాలకు ఎంత అభిమానమో, కానీ అలాంటి వ్యక్తి సమైక్యాంధ్ర విషయంలో విఫలమైతే జనాలు తమ చిత్తానికి మాట్లాడారు. కానీ సినిమా చేస్తే నెత్తిన పెట్టుకున్నారు. తమిళనాట రజనీకాంత్ కు కూడా ఆరంభంలోనే ఇది తెలిసివస్తోంది. అసలే తమిళులు స్థానికత అంటే కిందా మీదా అయిపోతారు. సో, రజనీ వ్యతిరేకులు దాన్నే రెచ్చగొడుతున్నారు. భారతీరాజా లాంటి మంచి దర్శకులు కూడా నోటికి వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇఫ్పుడు మన దగ్గరకు వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జంకుతున్నది అందుకే అనిపిస్తుంది. పార్టీ పనులు నీళ్లు నమిలినట్లు, నత్త నడక నడుస్తున్నాయి. అన్న చిరంజీవి అనుభవమే పవన్ కళ్యాణ్ ను నేరుగా రాజకీయాల్లోకి దిగకుండా, తెలుగుదేశం చాటునే వుండేలా చేస్తోంది. అన్న అనుభవం తనను కాస్త ఆలోచింపచేస్తోందని గతంలో పవన్ కళ్యాణ్ నే చాలా సార్లు అన్నారు.

ఆ మద్య ఒక్కసారి కాస్త మాటలు విసిరితేనే తెలుగుదేశం జనాలు విజయవాడ సాక్షిగా పవన్ పై మాటల తూటాలు విసిరారు. ఆ తరువాత మళ్లీ పవన్ గట్టిగా మాట్లాడితే ఒట్టు. కేవలం భాజపాను మాత్రమే అది కూడ కేంద్రాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు.

ఇప్పుడు ఎన్నికలు వస్తే, పవన్ తెలుగుదేశంతోనే వుంటే ఓకె, లేదూ, తెగించి ఒంటరి పోరు అంటే వుంటుంది అసలు సంగతి. ఇప్పుడు తెలుగుదేశాన్ని చూసి, అండగా వుంటున్న మీడియా కాస్తా ప్లేటు మారుస్తుంది. ఇప్పుడు సైలెంట్ గా వున్న జనాలు అప్పుడు మొదలుపెడతారు. ఆ విషయం పవన్ కు బాగా తెలుసు. అందుకే ఆచి తూచి కదులుతున్నారు. ఒంటరి పోరాటం అనే మాట జోలికి పోకుండా అలా పార్టీని బతికీ బతకనట్లు నడుపుతున్నారు.

Show comments