జ‌గ‌న్ పార్టీలో శిల్పా చేరిక ఖ‌రారు

క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయాలు మ‌రింత‌ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. రోజురోజుకూ మారుతున్న ప‌రిణామాలు ఆస‌క్తి పెంచుతున్నాయి. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన శిల్పామోహన్‌రెడ్డి చంద్ర‌బాబును వీడి జ‌గ‌న్ పార్టీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ వారంలోనే వైసీపీ జెండా క‌ప్పుకునేందుకు ముహూర్తం కూడా ఖ‌రారు చేసిన‌ట్టు ఆయ‌న స‌న్నిహితులు చెప్తున్నారు.

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో నంద్యాల అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నిక‌లు అనివార్య‌మైన విష‌యం తెలిసిందే. భూమా కుటుంబం గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి అనంత‌రం తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంది. దీంతో నంద్యాల ఉపఎన్నిక‌ల్లో పార్టీ టికెట్ ఎవ‌రికి ద‌క్కుతుందా అన్న దానిపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో తీవ్ర ఆస‌క్తి నెల‌కొంది. 

గ‌తంలో పార్టీ త‌ర‌ఫున పోటీ చేసింది త‌నే కాబ‌ట్టి ఇప్ప‌డు కూడా త‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని శిల్పామోహన్‌రెడ్డి పార్టీ అధినేత చంద్ర‌బాబును కోరుతున్నారు. మ‌రోవైపు భూమా కుమార్తె, మంత్రి అఖిల ప్రియ కూడా త‌న తండ్రి గెలిచిన సీటు త‌మ‌కే ద‌క్కాల‌ని గ‌ట్టిగానే అడుగుతున్నారు.

దీంతో నంద్యాల వ్య‌వ‌హారం చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారింది. భూమా, శిల్పా వ‌ర్గాల్లో ఎవ‌రికి టికెట్ ఇచ్చినా అవ‌త‌ల వ‌ర్గం వ్య‌తిరేకిస్తోంది. ఎటు మొగ్గాలో తెలియ‌క బాబు ఈ విష‌యాన్ని ఇన్ని రోజులూ నాన్చుతూ వ‌చ్చారు. కానీ ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో నంద్యాలపై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌.

తాజాగా భూమా కుటుంబానికి టికెట్ కేటాయించాల‌ని నిర్ణ‌యించార‌ట‌. దీనికి ప్ర‌తిగా శిల్పా మోహ‌న్‌రెడ్డి సోద‌రుడు, ఎమ్మెల్సీ చ‌క్ర‌పాణిరెడ్డికి మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చార‌ట‌. అదీ ఎన్నిక‌ల త‌ర‌వాత‌, తెలుగుదేశం అభ్య‌ర్థి గెలిస్తేనేన‌ని కండీష‌న్ పెట్టార‌ట‌.

ఈ ఆఫ‌ర్ న‌చ్చ‌ని శిల్పా జ‌గ‌న్ పార్టీలో చేరేందుకు స‌మాయ‌త్త‌మ‌మ‌య్యారు. దీనిపై పార్టీ కార్య‌క‌ర్త‌లు, అనుయాయ‌యుల‌తో చ‌ర్చించారు కూడా. వారి నుంచి కూడా సానుకూల స్పంద‌న రావ‌డంతో జ‌గ‌న్ పార్టీలో శిల్పా చేరిక ఖాయంగా కనిపిస్తోంది. మ‌రోవైపు జ‌గ‌న్ కూడా శిల్పా చేరిక కోసం ఎదురుచూస్తున్నాడు.

అందుకే ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌తిప‌క్ష నేత కూడా నంద్యాల‌లో త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. శిల్పా పార్టీలో చేరితే టికెట్ ఆయ‌నికే ఇస్తామ‌నే విష‌యాన్ని జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ట‌.

అన్నీ కుదిరితే ఈ వారంలోనే చేరిక ముహూర్తం ఉంటుంద‌ని శిల్పా వ‌ర్గం చెబుతోంది. 14 తేవి 16 తేదీల్లో హైద‌రాబాద్‌లో జ‌గ‌న్‌ను క‌లిసి పార్టీలో చేరిన అనంత‌రం నంద్యాల‌లో భారీ ఊరేగింపు నిర్వ‌హించ‌నున్న‌ట్టు చెప్తున్నారు.

అయితే బాబు నుంచి టికెట్ ఖరారు ఖావ‌డంతో భూమా కుమార్తె, మంత్రి అఖిల ప్రియ అప్పుడే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. నంద్యాల ప‌ట్ట‌ణాన్ని కొత్త పెళ్లికూతురులా త‌యారు చేస్తాన‌ని ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. దీంతో శిల్పా చేరిక రోజు నుంచే వైసీపీ కూడా ప్ర‌చారం మొద‌లెట్ట‌నుంది. మ‌రి ఎన్నిక‌ల్లో ఎవ‌రి ఎత్తుగ‌డ‌లు పలిస్తాయో చూడాలి.

Show comments