అమరావతిలో రోజా.. ఏం చేస్తారు.?

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా, అమరావతిలో అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'హైద్రాబాద్‌ కావొచ్చు, అమరావతి కావొచ్చు.. ఇంకెక్కడైనా కావొచ్చు.. అధికార పక్షం, ప్రతిపక్షం సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. అందర్నీ కలుపుకుపోవాలి.. అప్పుడే ప్రజలెదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.. అసలు చట్టసభల ఉద్దేశ్యం కూడా అదే కదా.. అధికార పక్షం ఎత్తుగడలెలా వున్నా, నా బాధ్యతలు నాకుంటాయి కదా..' అంటున్నారు రోజా. 

అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు, అమరావతి నుంచి జరగనున్న విషయం విదితమే. ఈరోజే లాంఛనంగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, శాసన మండలి భవనాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. అంటే, నేటినుంచే అసెంబ్లీ, శాసనమండలికి సంబంధించిన అన్ని వ్యవహారాలూ ప్రారంభమవుతాయన్నమాట. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న దరిమిలా, కొత్త రాష్ట్రం.. కొత్త అసెంబ్లీలో పాలక, ప్రతిపక్షాల తీరు ఎలా వుండబోతోందన్న విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 

మరీ ముఖ్యంగా, అమరావతి అసెంబ్లీ సమావేశాల్లోనూ రోజా సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ కానున్నారు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ వివాదం నేపథ్యంలో, అసెంబ్లీ నుంచి రోజాని సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. సస్పెన్షన్‌ ముగిసి, రోజా అసెంబ్లీకి హాజరవుతుండడం.. సస్పెన్షన్‌ తర్వాత, నేరుగా అమరావతి అసెంబ్లీ సమావేశాల్లోనే రోజా కన్పించనుండడంతో సహజంగానే ఆమెపైనే అందరి దృష్టీ నెలకొంటుంది. 

'కొత్త అసెంబ్లీ అయినాసరే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వుండలేను.. ప్రశ్నిస్తూనే వుంటాను.. ప్రధానంగా మహిళా సమస్యలపై నా పోరాటం కొనసాగుతుంది.. మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సులో నాకు జరిగిన అన్యాయంపై ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను..' అంటున్నారు రోజా. 

రోజా ప్రశ్నించడం సంగతెలా వున్నా, అమరావతి అసెంబ్లీ సమావేశాలనుంచీ ఆమెను సస్పెండ్‌ చేయడానికి అధికార పార్టీ ఈపాటికే రంగం సిద్ధం చేసేసుకుని వుండాలి. ఎందుకంటే, మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సుకి పిలిచి అవమానించింది చంద్రబాబు సర్కార్‌. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. ఈ వ్యవహారంలో రోజా ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేనే లేదాయె. పైగా, రోజా కోడెల శివప్రసాద్‌ ఇంట్లో బాంబులు పేలిన వైనాన్ని ప్రధానంగా మీడియా ముందు ఎండగడ్తున్నారు. 

సో.. అమరావతిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో 'రోజా వ్యవహారమే' హాట్‌ టాపిక్‌ కానుందన్నమాట. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతిలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించిన చంద్రబాబు సర్కార్‌, సమర్థవంతంగా అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహిస్తుందో, లేదంటే అసమర్థతని కప్పిపుచ్చుకోడానికి వాయిదాలు, సస్పెన్షన్స్‌తో సరిపెడ్తుందో వేచి చూడాల్సిందే.

Show comments