సంచలన కేసు.. పూర్తిగా అడ్డం తిరిగింది!

వామ్మో.. ఇన్ని మలుపులా! ఏ క్రైమ్ థ్రిల్లర్ లోనూ మరీ ఇన్ని మలుపులు ఉండవు. ఒక దశలో అతడిని ఒక ఉన్మాది, సైకో.. నిందించిన జనాలు, మీడియా ఇప్పుడు.. “అయ్యో  పాపం..’’ అంటున్నారు. నిజంగానే అతడు హత్య చేయలేదేమో…. అనే వాయిస్ ఇప్పుడు రైజ్ అవుతోంది. తమిళనాట సంచలనం సృష్టించి.. జాతీయ స్థాయిలో మీడియాకు ఎక్కిన ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసు ఇది. 

ఇప్పటి వరకూ ఈ అంశం ఎన్నో సంచనాలను సృష్టించింది. తమిళనాడు వ్యాప్తంగా చర్చ నీయాంశంగా నిలిచింది. తెలుగు మీడియాలో కూడా స్వాతి హత్య కేసు గురించి బోలెడన్ని కథనాలు వచ్చాయి. దీనికి అనే కారణాలున్నాయి. పట్ట పగలు ఒక రైల్వే స్టేషన్ లో స్వాతిని తల నరికి చంపి వెళ్లాడో అగంతకుడు. ఇంత ఘాతుకం జరగడం తో తమిళనాడు ఉలిక్కి పడింది. 

ఈ కేసు సంచలనంగా మారింది. ఈ దారుణంపై అక్కడి హై కోర్టు జోక్యం చేసుకోవడంతో కేసు విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు ఆదేశాలతో కొన్ని వందలమంది పోలీసులు ఈ కేసు విచారణలో భాగమయ్యారు. ఉరుకులు పరుగులు.. స్వాతి నేపథ్యం, సీసీ కెమెరాల పుటేజీలు.. వీటన్నింటిపై విచారణ చేసి, నిందితుడి ఫొటోను విడుదల చేశారు. అనేక ఆధారాలను బట్టి.. అతడే హత్య చేశాడని నిర్ధారించారు!

వందల మంది పోలీసులు.. అనేక సీసీ టీవీల పుటేజీలు, ఐదు లక్షల ఫోన్ కాల్స్ , కొన్ని వందల నంబర్లు…వీటన్నింటి మీదా జరిగిన శోధనతో స్వాతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న రామ్ కుమారే ఆమెను హత్య చేశాడని పోలీసులు నిర్ధారించి.. హత్య  చేసి అతడు పారిపోయాడని నిర్ధారించి, సొంతూరికి వెళ్లి మరీ అతడిని పట్టుకున్నారు!

అక్కడితో ఓ పనైపోయిందని పోలీసులు భావించారు. జనసామాన్యం కూడా  కొంత ఊరట చెందింది. అంత దుర్మార్గంగా చంపి వెళ్లిపోయిన వాడు దొరికాడు.. చట్టం శిక్షిస్తుందనుకున్నారు. మీడియా ఈ ఉదంతంపై  అనునిత్యం అప్ డేట్స్ ఇచ్చింది. హత్య జరగడానికి నేపథ్యం ఏమిటి? హత్య చేయడానికి రామ్ కుమార్ మానసిక స్థితి ఏమిటి? హత్య చేసి అతడు చాలా సింపుల్ గా ఊరికి వెళ్లిపోయి.. పొలం పనులు చేసుకున్నాడు, ఎప్పటికప్పుడు టీవీ ద్వారా అప్ డేట్స్ తెలుసుకునే వాడు.. అంటూ రకరకాల కథనాలు వచ్చాయి.

రామ్ కుమార్ ను దోషిగా నిర్ధారించడానికి పోలీసులు పలు పరీక్షలు నిర్వహించారు. అనేక మంది ప్రత్యక్ష సాక్షులను విచారించారు.. ఆ విచారణలో అతడే దోషి అని నిర్ధారణకు వచ్చారు. అయితే.. తను నిర్దోషిని, తను ఈ హత్య చేయలేదని రామ్ కుమార్ వాదించసాగాడు. ఇక అతడి తల్లిదండ్రులు కూడా ఇదే మాటే వినిపించారు. అలాంటి వాదనలు మామూలే అనుకున్నారంతా!

ఇక ఆ కేసు గురించి జనాలంతా దాదాపు మరిచిపోతున్న దశలో… ఆ తర్వాత ఎంతోమంది ప్రేమోన్మాదులు రెచ్చిపోయిన వార్తలు వింటున్న దశలో.. రామ్ కుమార్ ఆత్మ హత్య మళ్లీ స్వాతి హత్యోదంతాన్ని చర్చనీయాంశంగా మార్చింది!

ఇప్పుడు స్వాతి గురించి కాదు.. రామ్ కుమార్ గురించి చర్చ నడుస్తోంది. అతడు కరెంటు వైర్లు నోట్లో పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు, అది కూడా జైల్లో! అతడు హంతకుడే కావొచ్చు గాక.. వినడానికి  చాలా అసంబద్ధంగా ఉంది ఈ వాదన. జైల్లో ఇలాంటివి సాధ్యం అవుతాయా? అనేది బేసిక్ డౌట్. అతడు ఆత్మహత్య చేసుకుంటుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమ కుమారుడు నిర్ధోషి అని ..  అతడిని పోలీసులే చంపేశారని.. రామ్ కుమార్ తల్లిదండ్రులు వాదిస్తున్నారు!

ఇక ఈ వ్యవహారంలో మళ్లీ సామాజికవర్గాలు, రాజకీయ పార్టీలు స్పందించాయి. స్వాతి హంతకుడిని పట్టుకోవడం గురించి మాట్లాడిన వాళ్లు ఇప్పుడు.. రామ్ కుమార్ ది హత్యే.. అని అంటున్నారు. ఈ విషయంలో పోలీసుల పాత్రను అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ జరగాలని అంటున్నారు.

మరి మొన్నటి వరకూ సైకో, శాడిస్టు అని అందరి చేతా నిందించబడిన వాడి గురించి ఇప్పుడు ఈ తరహా జాలి వ్యక్తం అవుతోంది. నిజంగానే.. రామ్ కుమార్ స్వాతిని హత్య చేశాడా? లేకపోతే ఒత్తిళ్లు భరించలేక పోలీసులు రామ్ కుమార్ ను అరెస్టు చేసి.. అతడే హత్య చేశాడని నిర్ధారించేశారా? ఈ కేసు విచారణ పూర్తి కాకుండానే.. రామ్ కుమార్ అనుమానాస్పద, అసహజమైన రీతిలో మరణించడం.. బోలెడన్ని అనుమానాలకు తావిస్తోంది. అయితే పోలీసులు మాత్రం తమ వాదనకు కట్టుబడి ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ తలనొప్పిని ఇంతటితో వదిలించుకుంటే మంచిదని భావించవచ్చు. కాబట్టి..ఈ కథ ఇలానే కంక్లూడ్ కావొచ్చు!

Show comments