ప్చ్‌.. భూమన అరెస్ట్‌ కాలేదు

'భూమన కరుణాకర్‌రెడ్డిని అరెస్ట్‌ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి.. అసెంబ్లీ సమావేశాల వేళ ప్రభుత్వం, అసలు సమస్యల నుంచి తప్పించుకోవడానికి భూమన రుణాకర్‌రెడ్డిని తుని రైలు దహనం కేసులో నేరస్తుడిగా చూపే ప్రయత్నం చేస్తోంది.. తద్వారా ప్రతిపక్షంపై ప్రభుత్వం కుట్రపూరిత దుష్ప్రచారం చేస్తోంది..' అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నానా హంగామా చేసింది. భూమన అరెస్ట్‌ ఖాయమని వైఎస్సార్సీపీ మానసికంగా సిద్ధమైపోయింది. 

ఓ దశలో భూమన కరుణాకర్‌రెడ్డి కూడా తాను అరెస్టవుతాననే అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, భూమన కరుణాకర్‌రెడ్డిని రెండ్రోజులపాటు విచారించిన సీఐడీ, అరెస్టు విషయంలో మాత్రం 'ఇంట్రెస్ట్‌' చూపలేదు. ఇక్కడ మేటర్‌ క్లియర్‌. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంది. 'భూమన హస్తం వుంది తుని రైలు దహనం కేసులో..' అంటూ అధికార పార్టీ చేసిన ఆరోపణల నేపథ్యంలోనే, ఆయన్ను సీఐడీ విచారించింది. 

'మా దగ్గర ఆధారాలున్నాయి..' అని చెప్పిన అధికార పార్టీ, ఆ ఆధారాల్ని సీఐడీకి అందించడంతోనే ఈ విచారణ జరిగిందేమో.! అయితే, భూమన కరుణాకర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడం ద్వారా రాష్ట్రంలో అలజడి చెలరేగితే, అసెంబ్లీ సమావేశాల వేళ ఇరకాటంలో పడాల్సి వస్తుందనే, ఇక్కడ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్నది నిర్వివాదాంశం. 

ఇంకోపక్క, అసలు విచారణ అనేదే జరగలేదనీ, కూర్చోబెట్టి, కాఫీ స్నాక్స్‌ మాత్రమే ఇచ్చారనీ, అంతకు మించి అక్కడేమీ జరగలేదని వైఎస్సార్సీపీ నేతలు తొందరపడి భూమన విచారణపై ప్రకటనలు చేసేశారు. కానీ, విచారణ అనంతరం మీడియా ముందుకొచ్చిన భూమన కరుణాకర్‌రెడ్డి, తనపై సీఐడీ అధికారులు కొన్ని ప్రశ్నలు సంధించారనీ, వాటికి తాను సమాధానమిచ్చానని చెప్పారు. ఎక్కడా విచారణ సందర్భంగా అధికారులు తనను ఇబ్బంది పెట్టలేదనీ, చాలా గౌరవంగా చూసుకున్నారనీ, ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతున్నానని భూమన వ్యాఖ్యానించడం గమనార్హం. 

మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో అధికారులు వేధించారని ఆరోపణలు వచ్చేస్తుంటాయి రాజకీయ నాయకుల నుంచి. అధికార పార్టీ కుట్ర.. అనేందుకు ఇదో నిదర్శనం. కానీ, భూమన నుంచి అలాంటి ప్రకటన రాకపోవడం వైఎస్సార్సీపీ శ్రేణుల్ని సైతం షాక్‌కి గురిచేసిందనే చెప్పాలి. ప్రభుత్వం వేధిస్తున్న మాటే నిజమైతే, అధికారులకు భూమన థ్యాంక్స్‌ చెప్పేంత సాఫ్ట్‌గా అక్కడి పరిస్థితులు ఎందుకుంటాయి.? అన్న చర్చకు ఆస్కారం ఏర్పడిందిప్పుడు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ వ్యూహం వర్కవుట్‌ అయ్యిందనే చెప్పాలి. విచారణకు పిలిపించడం ద్వారా అనధికారికంగా భూమనను నిందితుడ్ని చేసేశారు.. అరెస్ట్‌ చేయకుండా, విచారణకు పిలిచి, గౌరవంగా చూడటం ద్వారా ప్రతిపక్షానికీ ఝలక్‌ ఇచ్చారు. చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఇలానే వుంటాయ్‌ మరి.!

Show comments