నమక చమకాలపై మాట తప్పిన 'డిజె'.?

'డిజె - దువ్వాడ జగన్నాథమ్‌' సినిమాకి సంబంధించి బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. సినిమాలోని 'ఒడిలో.. ఒడిలో..' అంటూ సాగే పాటలోని 'నమకం, చమకం, అగ్రహారం - తమలపాకు' వంటి పదాల ప్రస్తావనపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, చిత్ర నిర్మాత దిల్‌ రాజు దిగొచ్చాడు.

దర్శకుడు హరీష్‌ శంకర్‌ తొలుత, 'మేం తప్పేమీ చేయలేదు..' అని బుకాయించే ప్రయత్నం చేసినా, బ్రాహ్మణ సంఘాల ఒత్తిడితో 'ఆ పదాల్ని' మార్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన విషయం విదితమే.

అయితే, ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ తర్వాత మార్కెట్‌లోకి వచ్చిన పాటల్లో 'ఆ పదాలు' అలాగే వుండటంతో మరోమారు బ్రాహ్మణ సంఘాలు భగ్గుమన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే 'డిజె' సినిమాపై ఫిర్యాదులు చేశాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని విడుదల కానివ్వబోమంటూ తెగేసి చెబుతున్నాయి. 'మాట ఇచ్చి తప్పుతారా.?' అంటూ 'డిజె' యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బ్రాహ్మణ సంఘాల ప్రతినిథులు. 

ఈ వివాదంపై 'డిజె' యూనిట్‌ వెర్షన్‌ ఇంకోలా వుంది. సినిమాలో అభ్యంతరకర పదాల్ని తొలగించామని, ఆడియోలో ఆ పదాల్ని తొలగించడం వీలు కాలేదని చిత్ర యూనిట్‌ తరఫున కొందరు వాదిస్తున్నారు.

సమసిపోయిందనుకున్న వివాదం మళ్ళీ రాజుకోవడంతో, 'డిజె' యూనిట్‌ కూడా ఒకింత కంగారు పడ్తోంది. ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం, ఆ తర్వాత కోర్టు మెట్లెక్కడం.. ఇలా బ్రాహ్మణ సంఘాలు పక్కా వ్యూహంతోనే ముందడుగు వేస్తుండడం గమనార్హమిక్కడ.

కాగా, బ్రాహ్మణ సంఘాలకు హామీ ఇచ్చినట్లుగానే, అభ్యంతరకర పదాల్ని తొలగించి, ’బడిలో ఒడిలో..‘ పాటలోని ’నమకం, చమకం‘ తదితర పదాల్ని తొలగించి, సెకెండ్ బంచ్ సీడీల్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో తాజాగా ప్రకటించాడు.

మరి, ఈ వివాదం ఇక్కడితో సద్దుమణిగేనా.? వేచి చూడాల్సిందే.

Show comments