అతి త్వరలో.. 'దొంగ'గారొస్తున్నారు

దొంగని పట్టుకుని దొంగా.. అంటే కోపం వస్తుంది కదా.! విజయ్‌మాల్యా విషయంలోనూ అదే జరుగుతోంది. వేల కోట్ల రూపాయల్ని బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని, బ్యాంకుల్ని నిండా ముంచేసిన ఘనుడు 'లిక్కర్‌ కింగ్‌' విజయ్‌ మాల్యా. 'కింగ్‌ఫిషర్‌' సామ్రాజ్యానికి మహారాజులా ఓ వెలుగు వెలిగిన మాల్యా, విలాసవంతమైన జీవితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 

ఇప్పుడీ 'దొంగ'గారొస్తున్నారు.. ఆ రాక కూడా 'అతి త్వరలో'.! అవును, ఈసారి తప్పించుకోవడానికి అవకాశాలే లేవు. ఇండియా నుంచి పారిపోతే, తన మీద ఎన్ని 'క్రైమ్‌ రికార్డ్స్‌' వున్నాసరే, తనకేమీ కాదన్న ధీమాతో వున్న విజయ్‌మాల్యాని బ్రిటన్‌ నుంచి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయి. తాజాగా సీబీఐ, ఈడీ బృందాలు బ్రిటన్‌కి వెళ్ళాయి. అక్కడే, భారత అధికారులు - బ్రిటన్‌ అధికారుల మధ్య ఒప్పందాలు జరిగాయి. అదీ, 'దొంగ'ని భారత్‌కి అప్పగించేందుకోసం.! 

'నేను దొంగని కానే కాను.. వ్యాపారం అన్నాక లాభ నష్టాలు మామూలే.. నాకు చాలా చాలా ఆస్తులున్నాయి.. వాటిని విక్రయించి బకాయిలు చెల్లించేస్తాను..' అంటూ బ్రిటన్‌లో వుండి కథలు చెబుతున్న విజయ్‌ మాల్యా, మీడియాని ఏకి పారేస్తున్నాడు సోషల్‌ మీడియా ద్వారా. వ్యాపారవేత్తగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో మీడియాని సైతం శాసించిన మాల్యా, ఇప్పుడు అదే మీడియాపై నోరు పారేసుకుంటుండడం ఆశ్చర్యకరమే. మరోపక్క, తనకున్న ధనబలంతో రాజ్యసభ సభ్యుడిగానూ అవకాశం పొందాడు. అఫ్‌కోర్స్‌, 'దొంగ' అని తేలాక, ఆ పదవిలోంచి అతన్ని పీకేశారనుకోండి.. అది వేరే విషయం. 

'దొంగ'గారొస్తున్నారు సరే.. ఆ రాక ఎప్పుడు.? వచ్చాక, అతన్ని జైలుకి పంపిస్తారా.? దోచేసిన వేల కోట్లను కక్కిస్తారా.? లేదంటే, సింపుల్‌గా బెయిల్‌ దక్కించేసుకుని.. మళ్ళీ 'కూతలు' మొదలుపెడతాడా.? ఏమో, ఇండియాలో ఏమైనా జరగొచ్చు. ఓ దొంగకి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టిన ఘనత మన రాజకీయ వ్యవస్థకే చెల్లింది. ఆ దొంగ, దేశం విడిచి పారిపోవడానికీ ఇదే రాజకీయం సహకరించింది. కాబట్టి, విజయ్‌ మాల్యా దొరికినా శిక్ష పడుతుందన్న గ్యారంటీ అయితే లేదు.

Show comments