కేసీఆర్‌ బీజేపీ గాలి తీసేశారా?

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ పర్యటన అట్టహాసంగా చేద్దామని అనుకున్న బీజేపీ నేతలకు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన మూడురోజుల పర్యటనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసిపారేసిన తీరుతో బీజేపీకి గాలి పోయినట్లయింది. సెంటిమెంటుతో ఎలా దెబ్బకొట్టాలో కేసీఆర్‌కు తెలిసినట్లుగా మరెవరికి తెలియ దేమో! భారతీయ జనతా పార్టీతో పెద్దగా తగాదా లేకపో యినా, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్‌ స్పందించిన తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంది. తనపై విమర్శలు చేస్తే ఫర్వాలేదు కాని తెలంగాణ ప్రజలకు నష్టం కలిగేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదంటూ ఆయన గళం విప్పిన తీరు ప్రజలను ఆకట్టుకునే రీతిలో ఉండడమే కాకుండా, బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టింది.

మూడురోజుల పాటు అమిత్‌ షా నల్లగొండ జిల్లాలో పర్యటించి, బీజేపీని బలోపేతం చేయడానికి తంటాలు పడితే కేసీఆర్‌ ఒక గంటసేపు మీడియాతో మాట్లాడి అమిత్‌ షా పైన పైచేయి సాధించారు. కేసీఆర్‌ నేరుగా అమిత్‌ షాకే సవాల్‌ విసిరి ఆయన చెప్పినవి అసత్యాలని, తను చెప్పేవాటిలో ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామాకు సిద్ధం అనడం ద్వారా తన ఆత్మ విశ్వాసాన్ని కేసీఆర్‌ కనబరచుకోగలిగారు. కేసీఆర్‌ హైద రాబాద్‌లో ఉండగానే తాను జవాబు ఇస్తున్నానని అంటూ అమిత్‌ షా చేసిన ప్రచారానికి విరుగుడుగా అంకెల వారీగా శాఖల వారీగా కేంద్రం నుంచి వచ్చిన డబ్బు గురించి అత్యంత సమర్దంగా కేసీఆర్‌ చెప్పారు.

అంతేకాక దళి తవాడలలో అమిత్‌ షా భోజనం చేసిన తీరు గుట్టువిప్పి అమిత్‌ షాకు, బీజేపీకి చాలా ఇరకాటమైన పరిస్థితిని కేసీఆర్‌ సృష్టించారు. ఎక్కడా ప్రధాని మోడీని విమర్శించ కుండా అమిత్‌ షా జాతీయ పార్టీ అధ్యక్షుడు కనుక ఆయనకు జవాబు ఇస్తున్నట్లుగా కేసీఆర్‌ చెబుతూ సెటైర్లు, పంచ్‌ డైలాగులు వాడి బీజేపీ మూడురోజుల కార్యక్రమాలకు ఆయన సమాధానం చెప్పారు. తాను ప్రధాని అవుతాననుకుంటే ఎలా ఉంటుందో, బీజేపీ తెలంగాణలో వస్తుందంటే అంత పెద్దజోక్‌ అని చెప్పడం ద్వారా బీజేపీకి ఇక్కడ సీన్‌లేదని కేసీఆర్‌ విస్పష్టంగా చెప్పగలిగారు.

తాను జరిపించిన సర్వేలో బీజేపీకి ఒక్కసీటు కూడా రాదని తేలిందని బాంబు పేల్చారు. అమిత్‌ షా ఒకపక్క వచ్చే ఎన్నికలలో తమదే అధికారం అని ప్రచారం చేసి హైదరాబాద్‌కు వస్తే కేసీఆర్‌ ఈ విధంగా ఆ పార్టీ గాలి తీసేశారు. ప్రధానంగా తెలంగాణకు లక్షకోట్ల సాయం చేశామని, యూనివర్సిటీలకు నలభై వేలకోట్లు ఇస్తున్నా మని షా చెప్పడంపై కేసీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. నోట్లరద్దు కాని, ఇతరత్రా బీజేపీకి మద్దతు ఇస్తున్నా, ఆ పార్టీ అధ్యక్షుడు వచ్చి హడావుడి చేయడానికి ప్రయత్నించిన తీరు కేసీఆర్‌కు నచ్చినట్లు లేదు.

తెలంగాణలో ఎవరైనా బీజేపీ ఏమైనా బలపడే అవకాశం ఉంటుందనుకునే వారికి కేసీఆర్‌ వ్యాఖ్యలు విన్న తర్వాత నిరుత్సాహానికి గురి కావాల్సిందే. హైకోర్టు విభజన గురించి అడిగితే షా తెలంగాణ ప్రజలను ఎద్దేవా చేసేవిధంగా మాట్లాడారని మరోసారి సెంటిమెంటును ప్రయోగించారు. వీటన్నిటికి హైదరాబాద్‌ కార్యకర్తల సభలో అమిత్‌ షా సమాధానం చెబుతారని అనుకుంటే, ఆయన అలా చేయలేకపోయారు. కేసీఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నానని చెప్పే సాహసం చేయలేకపోయారు. కాకపోతే తమ ప్రత్యర్థలకు బీజేపీ అంటే బీపీ వస్తోందని వ్యాఖ్య చేసి సరిపెట్టుకున్నారు.

కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణకు తొమ్మిదివేల కోట్లే వచ్చాయని, కాని ఎన్‌డీఏ హయాంలో పదింతలు పెరిగిందని షా చెప్పడం విడ్డూరంగానే ఉంటుంది. కాంగ్రెస్‌ హయాంలో ఉన్నది ఉమ్మడి ఏపీ రాష్ట్రం. అప్పుడు వచ్చిన డబ్బుతో ఇప్పుడు ఎలా పోల్చుతారో అర్థంకాదు. పైగా నిర్దిష్ట పార్ములా ప్రకారం కాకుండా, అందరికి ఇచ్చినట్లు కాకుండా అధనంగా ఇచ్చినట్లు రుజువు చేయాలన్న కేసీఆర్‌ సవాల్‌కు సమాధానం రాలేదు. నిజానికి అమిత్‌ షా ఏదో అంకెలు చెబుతూ కేంద్ర పథకాలపై ప్రచారం చేస్తూ మూడురోజుల పర్యటన చేశారు. కేసీఆర్‌పై మరీ ఘాటుగా విమర్శలు చేయలేదు.

అయినా కేసీఆర్‌ మాత్రం లక్ష కోట్ల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని బదులు ఇవ్వడం విశేషం. ఇక అమిత్‌ షా పర్యటన విజయవంతం అయిందని చెప్పుకునే పరిస్థితి కనిపించలేదు. అసలు ప్రజలనాడి పసికట్టడానికి, తెలంగాణలో ఉన్న నాయ కత్వ పటిమను అంచనా వేయడానికి షా పర్యటించి నట్లుగా ఉంది. ఇలాగే పార్టీ ఉంటే అధికారంలోకి రావడం కష్టమని ఆయన అంతరంగికంగా అన్నారని సమాచారం. అలాగే కేసీఆర్‌కు వ్యతిరేకంగా నాగం జనార్దనరెడ్డి వంటివారు ఫిర్యాదు చేసినా రాష్ట్రపతి ఎన్నిక తర్వాత చూద్దామని చెప్పేశారట. అమిత్‌ షా, కేసీఆర్‌ల మధ్య విమర్శలు సాగినా, అవి మోడీ, కేసీఆర్‌ల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయా అన్నది చర్చనీయాంశమే. మొత్తం మీద చూస్తే అమిత్‌ షా ఆశించిన రీతిలో ఫలితాలు ఇవ్వ కపోగా, కేసీఆర్‌ వ్యాఖ్యలతో ఎదురు దెబ్బతిన్నట్లయిందన్న అభిప్రాయం కలుగుతుంది.

Show comments