నవదీప్‌ మలుపు తిప్పేస్తాడా.?

నాలుగు రోజులు నలుగురు సినీ సెలబ్రిటీలను డ్రగ్స్‌ కేసులో ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 'సిట్‌' విచారించింది. రోజుకొకరి చొప్పున విచారణ జరిగింది. పూరి జగన్నాథ్‌ని రాత్రి 9.30 నిమిషాల వరకూ, ఆ తర్వాత శ్యామ్‌ కె నాయుడుని 5 గంటల వరకు, సుబ్బరాజుని రాత్రి 11 గంటల వరకు, తరుణ్‌ని కూడా 11 గంటల వరకూ విచారించిన 'సిట్‌' బృందం, ఏ ప్రశ్నలకు సమాధానం రాబట్టిందోగానీ, కొత్త అనుమానాలకైతే ఆస్కారమిచ్చింది. 

అరెస్టుల పర్వం ఇప్పటిదాకా లేదు సినీ సెలబ్రిటీలకు సంబంధించి. కానీ, విచారణ జరిగిన తీరు చూస్తే మాత్రం, 'హైడ్రామా'ని తలపించకమానదు. సుబ్బరాజు విషయంలో ఈ హైడ్రామా పీక్స్‌కి చేరింది. విచారణ పేరుతో సినీ సెలబ్రిటీలను టార్గెట్‌ చేయడమేంటన్న విమర్శలు గట్టిగా విన్పిస్తున్నప్పటికీ, ఆ విమర్శల్ని ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లైట్‌ తీసుకుంటోంది. తామెవర్నీ టార్గెట్‌ చేయడంలేదంటున్నారు ఎక్సయిజ్‌ శాఖ అధికారులు. 

తాజాగా ఈ రోజు, నటుడు నవదీప్‌ని విచారించనుంది ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 'సిట్‌' బృందం. నవదీప్‌కి ప్రస్తుతం ఓ పబ్‌లో భాగస్వామ్యం వుంది. గతంలో తప్పతాగి అడ్డగోలుగా డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడ్డాడు నవదీప్‌. ఈ నేపథ్యంలో నవదీప్‌పై 'ఉచ్చు' బిగుసుకున్నట్లేనన్నది టాలీవుడ్‌ వర్గాల్లో విన్పిస్తోన్న వాదన. 'అది తెలిసీ తెలియని వయసులో జరిగిన తప్పు.. డ్రగ్స్‌తో మాత్రం నాకెలాంటి సంబంధం లేదు..' అని నవదీప్‌ ఇప్పటికే వివరణ ఇచ్చుకున్నాడు. 

మరోపక్క, తరుణ్‌కీ పబ్‌ వుండేది. ఇప్పటికీ వుందనేదే చాలామంది వాదన. తరుణ్‌ మాత్రం, ఆరేళ్ళ క్రితమే ఆ పబ్‌ని వదిలించుకున్నానని చెబుతున్నాడు. ఇదే విషయాన్ని 'సిట్‌'కి కూడా చెప్పాడట. తరుణ్‌ విచారణ దాదాపు 11 గంటలపైనే సాగింది. మరి, నవదీప్‌ విచారణ కూడా అలాగే జరుగుతుందా.? అంతకన్నా ఎక్కువ సమయం జరుగుతుందా.? నవదీప్‌ విచారణతో డ్రగ్స్‌ కేసు కొత్త మలుపు తిరుగుతుందన్న ఊహాగానాల్లో నిజమెంత.? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి వుంది. 

ఇదిలా వుంటే, పూరి, శ్యామ్‌, సుబ్బరాజు, తరుణ్‌ విచారణతో సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ డొంక కదిలిందనీ, పలువురు పెద్ద తలకాయల పేర్లు 'సిట్‌' దృష్టికి వెళ్ళాయనీ ప్రచారం జరుగుతుండడం, ఆ పెద్ద తలకాయలకీ త్వరలో నోటీసులు వెళ్తాయని గుసగుసలు విన్పిస్తుండడం తెల్సిన విషయాలే.

Show comments