అవును, జూనియర్ ఎన్టీఆర్ మనసున్నోడు. ఇదిగో ఇదో నిదర్శనం. అఫ్‌కోర్స్, ఇంతకుముందు కూడా ఇలాంటి మంచి, మనసున్న పనులు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో చేశాడనుకోండి.. అది వేరే విషయం. తాజా 'మంచి' పని విషయానికొస్తే, తన అభిమాని క్యాన్సర్‌తో బాధపడ్తున్నాడని తెలుసుకున్న ఎన్టీఆర్, అభిమానితో కాస్సేపు గడిపాడు. అతని కుటుంబానికి అండగా వుంటానని హామీ ఇచ్చాడు.
బెంగళూరుకి చెందిన నాగార్జున అనే ఎన్టీఆర్ అభిమాని గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడ్తున్నాడు. హైద్రాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో వైద్య చికిత్స పొందుతున్న నాగార్జున గురించి తెలుసుకుని, అతన్ని ఎన్టీఆర్ తన వద్దకు రప్పించుకున్నాడు. అతని యోగ క్షేమాల్ని అడిగి తెలుసుకున్నాడు. తన అభిమాన హీరో తనను రప్పించుకోవడం, తనతో మాట్లాడటం, తన కుటుంబ సభ్యుల్ని ఆదుకుంటానని అభయం ఇవ్వడం.. ఇవన్నీ చూశాక, తాను క్యాన్సర్‌ని జయిస్తాననే నమ్మకం కలిగిందని నాగార్జున ఆనందంతో ఉప్పొంగిపోయాడు.
క్యాన్సర్ బాధితుడైనా సరే, ఆత్మస్థయిర్యంతో వుంటే క్యాన్సర్‌ని జయించవచ్చని వైద్యులు చెబుతుంటారు. నాగార్జున కళ్ళలోని ఆనందం, జూనియర్ ఎన్టీఆర్ భరోసా.. ఇవన్నీ నాగార్జునని కోలుకునేలా చేస్తే అంతకన్నా కావాల్సిందేముంది.? పవన్‌కళ్యాణ్, రామ్‌చరన్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, బాలకృష్ణ.. ఇలా స్టార్ హీరోలు మాత్రమే కాదు, యంగ్ హీరోలు, హీరోయిన్లు కూడా కాస్త తీరిక చూసుకుని, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు.. క్యాన్సర్ బాధితుల్ని, ఇతరత్రా తీవ్ర అనారోగ్య కారణాలతో బతుకు వెల్లదీస్తున్నవారికి తమ ప్రెజెన్స్‌తో వారిలో ఆనందాన్ని నింపుతున్నారు. ఏదిఏమైనా, మన తెలుగు హీరోలు, హీరోయిన్లు మనసున్నోళ్ళు.