తెలుగువారి రాజధానిలా ఉంటుందా?

'రాజుగారిని చేయబోతే కోతి అయింది' అని తెలుగులో ఓ సామెత ఉంది. అంటే ఒక పని చేయబోతే మరోలా అయిందని అర్థం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధోరణి చూస్తుంటే ఈవిధంగానే ఉంది. రాజధాని అమరావతిని  ఏవిధంగా నిర్మించాలనుకుంటున్నారో, ఎలాంటి రూపం సంతరించుకుంటుందో అర్థం కాకుండా ఉంది. ఆయన ఏ దేశానికి వెళితే ఆ దేశపు రాజధానిలా అమరావతిని నిర్మిస్తామని చెబుతున్నారు. చెప్పడమే కాకుండా తాను ఆ దేశాన్ని అమరావతి నిర్మాణంలో భాగస్వామిగా చేస్తున్నారు. ఇందుకోసం అక్కడికక్కడే, అప్పటికప్పుడే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. 

తాజాగా కజకిస్తాన్‌ వెళ్లిన చంద్రబాబు దాని రాజధాని ఆస్తానా నగరం చూసి ముగ్ధుడైపోయి 'అమరావతిని ఆస్తానా మాదిరిగా నిర్మిస్తాం' అని ప్రకటించారు. రాజధాని నిర్మాణంలో ఆ దేశాన్ని భాగస్వామిగా చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు.  ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ నుంచి విడిపోయిన కజకిస్తాన్‌ స్వాతంత్య్రం పొందిన తరువాత వేగంగా అభివృద్ధి చెందింది. పాత రాజధాని నగరం ఉన్నప్పటికీ అన్ని సౌకర్యాలతో, హంగులతో కొత్త రాజధాని నగరం నిర్మించుకున్నారు. గతంలో ఈ రాజధానిని సందర్శించిన ప్రధాని మోదీ ఈ నగరం సౌందర్యానికి, భవనాల నిర్మాణ శైలికి, అభివృద్ధికి ఆశ్చర్యపోయారు. శభాష్‌ అని మెచ్చుకున్నారు. 

రాజధాని నిర్మాణం ఆలోచన చేస్తున్న చంద్రబాబుకు 'ఓసారి కజకిస్తాన్‌ వెళ్లి ఆస్తానా నగరం చూడండి' అని సలహా ఇచ్చారు. కాని సింగపూర్‌ మత్తులో ఉన్న చంద్రబాబు అమరావతిని సింగపూర్‌లా నిర్మిస్తామని ప్రకటించి ఆ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నిర్మాణ బాధ్యత ఆ దేశానికి అప్పగించామన్నారు. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ను రాజధాని శంకుస్థాపనకు రప్పించారు. ఆ తరువాత చైనా వెళ్లి అక్కడి అభివృద్ధిని చూసి డంగైపోయి రాజధాని నిర్మాణంలో ఆ దేశాన్ని భాగస్వామిని చేశారు. జపాన్‌ వెళ్లినప్పుడు టోక్యో నగరం అందచందాలకు మూర్ఛిల్లిన బాబు అమరావతిని టోక్యో మాదిరిగా నిర్మిస్తానన్నారు. 

జపాన్‌ను కూడా అమరావతి నిర్మాణంలో భాగస్వామిని చేశారు.  రాజధానిలో ప్రభుత్వ భవనాలను జపాన్‌కు చెందిన మాకీ సంస్థ డిజైన్‌ చేసింది. ఈ డిజైన్‌లు మెచ్చుకున్న ముఖ్యమంత్రి నిర్మాణ బాధ్యతనూ జపాన్‌ కంపెనీకే అప్పగించారు. 'అమరావతిని మీ రెండో రాజధాని అనుకొని నగరాన్ని నిర్మించండి' అని బాబు జపాన్‌ బృందాన్ని కోరారు. జపాన్‌ బృందంతో బాబు  బౌద్ధమత గొప్పదనం గురించి వివరించారు. బౌద్ధం కారణంగా ఏపీకి, జపాన్‌కు ఆధ్యాత్మిక సంబంధం ఉంది కాబట్టి అమరావతిని మీరే నిర్మిస్తే సముచితంగా ఉంటుందని ఆ బృందానికి చెప్పారు.  మధ్యలో చైనావాళ్లు వచ్చారు. వారికీ కొన్ని నిర్మాణాలు అప్పగించారు. 

విజయవాడలోని స్వరాజ్‌ మైదాన్‌లో సిటీ స్వ్కేర్‌ చైనావాళ్లే  నిర్మించబోతున్నారని చెప్పారు. డెన్మార్క్‌వాళ్లో మరో దేశం వాళ్లో కూడా వచ్చారు. వారు నగరానికి నీటి పంపిణీ, డ్రైనేజీ పనులేవో చేస్తామన్నారు.  ఒకసారి ఒక చైనా కంపెనీవారు చంద్రబాబను కలిసి తాము తమ దేశంలోని ఒక రాష్ట్ర రాజధాని నగరాన్ని ఏడాదిలో నిర్మించామని, అమరావతి బాధ్యత తమకు అప్పగిస్తే ఏడాదిలో పూర్తి చేసిపారేస్తామని చెప్పారు. వీరి ప్రతిపాదన వర్కవుట్‌ కానట్లుంది. ఇప్పుడు కజికిస్తాన్‌ను చేర్చుకున్నారు. మరి ఈ దేశానికి ఏం నిర్మాణాలు అప్పగిస్తారో....! మొన్నీమధ్య బాబు చైనాకు వెళ్లినప్పుడు అక్కడి బుల్లెట్‌ ట్రైన్‌ చూసి డంగైపోయి ఏపీలో బుల్లెట్‌ ట్రైన్‌ నడిపేందుకు అప్పటికప్పుడే ప్లాన్‌ చేసేశారు. 

కజకిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో రోప్‌వే పరిశీలించిన బాబు వెంటనే దాన్ని ఏపీలో అమలు చేస్తామని చెప్పేశారు. ఓ పక్క అమరావతిని ఏదో విదేశీ నగరంలా కట్టాలని ఆరాటపడుతున్నారు. మరో పక్క అమరావతికి పూర్వవైభవం తీసుకొస్తామంటారు. ఇంకోపక్క అమరావతిని బౌద్ధ మతానికి కేంద్రం చేస్తానంటారు. చివరకు రాజధాని స్వరూపస్వభావాలు ఎలా ఉంటాయో ఊహకు అందడంలేదు. ఇది తెలుగువారి రాజధానిగా అనిపిస్తుందా?

Show comments