మోడీ… ఓటమిని ఒప్పుకున్నారు!

యాభై రోజుల కిందట ఇదే మాట… ఇప్పుడూ అదే పాట… పాడిందే పాడరా…అన్నట్టుగా ఉంది ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీరు. నూతన సంవత్సరం సందర్భంగా, తను చెప్పిన గడువు ముగిసిన పిమ్మట నోట్ల మార్పిడి వ్యవహారంపై స్పందించారు నరేంద్రమోడీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యథావిధిగా ఈ యాభై రోజుల్లో తను చెప్పిన మాటలనే రిపీట్ చేశారు!

తమ డబ్బును తాము వాడుకోవడానికి కూడా అవకాశం కోల్పోయిన స్థితిలో పడిపోయిన భారతీయులకు కేవలం ఆశలు పెట్టే మాటలే మాట్లాడాడు ప్రధానమంత్రి. త్వరలోనే నగదు కష్టాలు తీరుతాయని ఆయనా ఆశాభావం మాత్రమే వ్యక్తం చేశారు. నల్ల దొంగలు కష్టాల్లో పడ్డారని.. చెప్పుకొచ్చారు. కొంత వరకూ నిజాయితీ పరులు కష్టపడ్డారని మోడీ చెప్పుకురావడం విశేషం.

అయితే కొత్త సంవత్సరంలో పరిస్థితి మారుతుందని ఆయన చెప్పుకొచ్చారు. యాభై రోజుల తర్వాత పరిస్థితి మారకుంటే తనను నడిరోడ్డుపై ఊరి తీయండని బీరాలు పలికిన మోడీజీ ఇప్పుడు.. పరిస్థితి చక్కబడుతుందని ఆశాభావం మాత్రమే వ్యక్తం చేయడం విడ్డూరం. మారిపోతుందని హామీ ఇచ్చి.. గడువు ముగిసిన తర్వాత మారుతుందని ఆశాభావం వ్యక్తం చేయడం మోడీ పాలనా పటిమకు నిదర్శనం.

భక్తులు ఒప్పుకోరు కానీ.. మోడీ తన ఓటమిని ఒప్పుకున్నాడు. ఒకవేళ నిజంగానే మోడీ గెలిచి ఉంటే.. నేటి ప్రసంగంలో ఆయన ఏ రేంజ్ లో రెచ్చిపోయే వారో చెప్పడం సాధ్యం అయ్యే పని కాదు. సంచలన నిర్ణయంతో అద్భుతాన్ని సాధించానని విజయోత్సవ ప్రసంగం చేయాల్సిన మోడీ సంతాప సభలో ప్రసంగం చేసినట్టుగా మాట్లాడారు.

ఇక కరెన్సీతో అన్నీ సమస్యలే అని మోడీ చెప్పుకొచ్చారు. నగదు రహిత ట్రాన్సక్షన్లే జరగాలని పిలుపునిచ్చారు. తనపై ప్రజలు ప్రేమాభిమానాలు చూపుతున్నారని చెప్పుకొచ్చారు. మరి తన నిర్ణయంతో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ… శాపనార్థాలు పెట్టిన ప్రజల గురించి మాత్రం మోడీ మాట్లాడలేదు. ఆఖరికి పప్పుసుద్ద రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు పరోక్షంగా సమాధానం ఇచ్చే యత్నం చేయలేదు.. మోడీ. ఓటమిని ఒప్పుకున్న వ్యక్తి నుంచి వాటిని ఆశించడం కూడా తప్పేనేమో!

Show comments