తాను ఏ పనిచేసినా కూడా, దానికి సంబంధించిన పరిశ్రమలు అన్నీ ఏపీ కి వచ్చి ఇక్కడే స్థిరపడిపోబోతున్నాయని టముకు వేసుకోవడం ఏపీ సర్కారుకు చాలా అలవాటుగా మారిపోయింది. ఇలాంటి క్రమంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమను కూడా హైదరాబాదునుంచి ఏపీకి తీసుకువెళ్లిపోతాం అని చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నారు.
ఇప్పటికే ఏపీలోని కొన్ని చోట్ల కొందరు అగ్ర నిర్మాతలకు కొన్ని స్టుడియోలు ఇతర నిర్మాణ వనరులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో మొత్తం పరిశ్రమను తరలించడానికి, తెలుగు సినీ పరిశ్రమకు రెండో కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం అని చంద్రబాబు చెబుతూ ఉంటారు.
అయితే ఏదో స్టుడియోలకు, పోస్ట్ ప్రొడక్షన్ సంస్థలకు స్థలాలు ఇవ్వడం, రాయితీలు ప్రకటించడం కాకుండా, చంద్రబాబు ఫిలిం క్లబ్ కు విశాఖపట్టణంలో తొట్లకొండను కేటాయించేశారు. ఇది చాలా పెద్ద వివాదంగా మారిపోయింది. అయితే సినీ నిర్మాతలకు ఎంతో విలువైన తొట్లకొండను ఫిలింక్లబ్ కోసం కేటాయించడం అనే పర్వం వెనుక గంటా శ్రీనివాసరావు ఉండి కీలకంగా చక్రం తిప్పినట్టు గుసగుసలు ఉన్నాయి.
అయితే తొట్లకొండను ఫిలింక్లబ్ కు కేటాయించడంపై చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. స్థానిక ఎమ్మెల్యేలంతా జట్టుగా దీనిని వ్యతిరేకించారు. చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఏతావతా.. తొట్లకొండను ఫిలింక్లబ్ కు కేటాయిస్తూ చేసిన జీవో రద్దయిపోతున్నదంటూ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రకటించేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానికుల సెంటిమెంటును అర్థం చేసుకున్నారని, ఈ జీవో రద్దుకు అంగీకరించారని అయ్యన్న ప్రకటించారు.
అయితే ఒకసారి కేటాయింపులు చేసిన తర్వాత తన పనిని తానే తప్పుపట్టుకున్నట్టుగా రద్దు చేయడానికి చంద్రబాబునాయుడు ఒప్పుకున్నాడో లేదో తెలియదు గానీ.. అయ్యన్నపాత్రుడు మాత్రం ఆ రకంగా ఫిటింగ్ పెట్టేశారు. మంత్ర గంటా చక్రం తిప్పి ఈ కేటాయింపులు చేయిస్తే.. ఆయనతో ఆజన్మ వైరం ఉన్న అయ్యన్నపాత్రుడు దానికి ఇలాంటి క్లయిమాక్స్ ఇచ్చారు.
అయితే ఈ పర్వం మొత్తం గంటా దేశంలో లేకుండా, అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే జరిగిపోవడం విశేషం. సెంటిమెంటును సీఎం గౌరవించారంటూ.. చంద్రబాబు ముందరికాళ్లకు కూడా అయ్యన్న బంధం వేశారు. మరి దానినుంచి ఆయన ఎలా బయటపడతారో.. తొట్లకొండను ఫిలింక్లబ్ చేస్తారో.. స్థానికుల అభిప్రాయాలకు విలువ ఇస్తారో చూడాలి.