అరెరె.. బాబు సూచనకు ఇదేనా విలువ?!

అదేంటి… తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి… ప్రపంచ పటానికి భారతదేశాన్ని పరిచయం చేసిన వ్యక్తి, ఇండియాకు సెల్ ఫోన్ ను, కంప్యూటర్ ను పరిచయం చేసిన శక్తి, దేశాన్ని ఐటీ బాట పట్టించిన మనిషి… అంబేద్కర్ కు భారతరత్నను ఇప్పించి, దేశంలో నేషనల్ హైవేలు వేయించాలనే ఆలోచనలు చేసి… సత్యా నాదెళ్లను ఐటీ చదువులు చదమని చెప్పి…. ఇలా ఎన్నెన్నో లోలోపలే చేసేసి.. ఆ విషయాలను ఇప్పుడిప్పుడు ప్రకటించుకుంటున్న చంద్రబాబు నాయుడు.. బహిరంగంగా ఒక సూచన చేస్తే, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే! ఆ సలహాను పట్టించుకోక పోగా.. అందుకు అత్యంత విరుద్ధంగా వ్యవహరించడమా!

ఎంత కండకావరం.. బహుశా ఉన్మాదం అయ్యుండొచ్చు! బాబు సూచనను పట్టించుకోని వారికి ‘ఉన్మాది’ అనేంతకు మించిన బిరుదు లేదు కదా! ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అదే మాటే అనాలి.

లేకపోతే.. వెయ్యి రూపాయలు, ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేసేయాలని బాబు ప్రధానమంత్రికి లేఖ రాస్తే… ఇంకోవైపు ఆర్బీఐ రెండువేల రూపాయల నోటును విడుదల చేయడానికి కసరత్తు చేస్తుందా? అతి త్వరలోనే రెండు వేల రూపాయల నోటు చలామణిలోకి తెస్తుందా? ఇప్పటి వరకూ చలామణిలో ఉన్న వెయ్యి రూపాయల నోటే.. పెద్దదిగా ఉంది. అయితే.. ప్రతి వెయ్యి రూపాయల నోటు తయారీకీ మూడువేల రూపాయలు ఖర్చు అవుతుందట. దీనికి ప్రతిగా రెండు వేల రూపాయల నోటు చలామణిలోకి తెస్తే.. ముద్రణ ఖర్చు తగ్గుతుంది. అలాగే రెండు వేల రూపాయల నోటు వల్ల సహజంగా ఉండే  ఆర్థిక సౌలభ్యాలు ఉండనే ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని.. ఆర్బీఐ రెండు వేల నోటును చలామణిలోకి తీసుకురానుందని తెలుస్తో్ంది. 

మరి ఇంతకీ బాబు గారి సలహా ఏమైనట్టు? ఎన్నో విప్లవాత్మక సలహాలు మూడో కంటికి తెలీకుండా లోపల్లోపల ఇచ్చానని చెప్పుకునే ఆయన.. అందరికీ తెలిసేలా, బహిరంగంగా కేంద్ర ప్రభుత్వానికి తొలి సారి ఒకే ఒక సలహా ఇస్తే.. దాన్ని పాటించడం మాట అటుంచి.. దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించడమా? ఉన్నవి రద్దు చేయమని బాబుగారు సలహా ఇస్తే.. అందుకు విరుద్ధంగా కొత్తవి తీసుకురావడమా! ఇదేనా.. బాబులాంటి ఆర్థిక వేత్త ఇచ్చిన సలహాకు విలువ? ఇదేనా.. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన మనిషి బహిరంగంగా ఇచ్చిన చెప్పిన మాటకు దక్కిన ప్రతిఫలం! దీన్నిబట్టి.. బహుశా ఇక చంద్రబాబు ఇప్పుడప్పుడే మళ్లీ ఈ కరెన్సీ నోట్ల గురించి మాట్లాడడు కాబోలు.

Show comments