ఇంతకీ ఆ బాహుబలి ఎవరు.?

'మాకూ ఓ బాహుబలి వస్తాడు..' అంటూ తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గట్టెక్కించడానికి ఖచ్చితంగా ఓ బాహుబలి వచ్చి తీరతాడన్నది జానారెడ్డి గట్టి నమ్మకం. ఎంతైనా ఇప్పుడు 'బాహుబలి' మేనియా నడుస్తోంది కదా.. ఆ మేనియా, జానారెడ్డిని కూడా ఊపేస్తున్నట్టుంది.! అన్నట్టు, జానారెడ్డి తనకు తాను 'విలువల విత్తనం'గా అభివర్ణించేసుకున్నారు. 

ఇంతకీ, ఆ బాహుబలి ఎవరు.? తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని గట్టెక్కించే ఆ మహానుభావుడు ఎవరు.? ఇప్పుడీ ప్రశ్న కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ప్రస్తుతానికైతే తెలంగాణలో, 'గ్లామర్‌' వున్న నాయకుడు కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించినంతవరకు లేరన్నది నిర్వివాదాంశం. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి గడ్డు పరిస్థితులే వున్నాయి. 

పోనీ, రాహుల్‌ గాంధీనే ఆ 'బాహుబలి' అనుకుందామా.? అంటే, అంత సీన్‌ ఆయనకు లేదాయె. ఇదే ప్రశ్న, మీడియా - జానారెడ్డి ముందుంచితే, 'రాహుల్‌ గాంధీ ఛరిష్మా ఏంటో ముందు ముందు తెలుస్తుంది..' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంటే, జానారెడ్డికి ఇంకా రాహుల్‌ గాంధీ మీద బోల్డంత నమ్మకం వుందన్నమాట. బహుశా రాహుల్‌గాంధీనే జానారెడ్డి దృష్టిలో బాహుబలి అయి వుండాలి.! రాహుల్‌ని బాహుబలిగా జానారెడ్డి ఊహించుకుంటే.. అది ఆయనిష్టం. మనమెలా కాదనగలం.?

Show comments