యోగికి పట్టం.. షాక్‌ ఎందుకంటే..

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బంపర్‌ మెజార్టీ సాధించింది. ముందూ వెనుకా ఆలోచించకుండా, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేయొచ్చు. కానీ, బీజేపీ ఆచి తూచి ముందడుగు వేసింది. మెజార్టీ లేకపోయినా మణిపూర్‌, గోవాల్లో కాన్ఫిడెంట్‌గా, చాలా తేలిగ్గా (ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ‘ఇతరుల మద్దతు’ తీసుకుని) ముఖ్యమంత్రిని ఎంపిక చేసేసింది బీజేపీ అధిష్టానం. ఉత్తరాఖండ్‌ సంగతి సరే సరి. మరి, ఉత్తరప్రదేశ్‌ విషయంలో ఎందుకింత హైడ్రామా నడిచింది.? ముందు ప్రచారంలోకి వచ్చిన పేర్లు అటకెక్కిపోయాయి. అందరికీ షాకిచ్చే డెసిషన్ వచ్చింది.

ఎవరూ ఊహించని విధంగా యోగి ఆదిత్యనాథ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆయన పేరుని తెరపైకి తెచ్చింది బీజేపీ అధిష్టానం. ఆసక్తికరమైన విషయమేంటంటే, కేంద్రమంత్రిగా పనిచేస్తున్న మనోహర్‌ పారికర్‌తో రాజీనామా చేయించి, గోవాకి ముఖ్యమంత్రిగా చేసిన బీజేపీ అధిష్టానం, ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిత్యనాథ్‌తో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తోంది.

యోగి ఆదిత్యనాథ్‌.. దేశ ప్రజలందరికీ సుపరిచితుడే.. ఎలాగంటే, వివాదాల కారణంగా. హిందూ యువ వాహిని పేరుతో తనకంటూ వ్యక్తిగతంగా క్యాడర్ కలిగి వున్న నాయకుడాయన. దాదాపు 90 నియోజకవర్గాల్లో ఆయన పవర్ ఫుల్ నాయకుడు కూడా. వీళ్ళంతా కరడుగట్టిన హిందుత్వ వాదులే. 'హిందూ అతివాది' అనే ముద్ర ఆయనపై బలంగా వుంది. ఆయన మీద లెక్కలేనన్ని క్రిమినల్‌ కేసులుండడం మరో విశేషమిక్కడ. అన్నిటికీ మించి, ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడు. ఎంపీగా వరుస విజయాలు ఆయన సొంతం. ఇలా అనేక క్వాలిఫికేషన్స్‌ని పరిగణనలోకి తీసుకుని యోగి ఆదిత్యనాథ్‌ని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రకటించారు. 

అన్నట్టు, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ బంపర్‌ మెజార్టీతో విజయం సాధించాక, రామజన్మభూమిలో రామమందిర నిర్మాణమంటూ 'అయోధ్య రామమందిర' నిర్మాణంపై బీజేపీ శ్రేణులు చేసిన వ్యాఖ్యల్ని ఎలా మర్చిపోగలం.? ఇప్పుడక్కడ కరడుగట్టిన హిందూవాదిని ముఖ్యమంత్రిగా నిలబెట్టడమంటే, అయోధ్య రామమందిర నిర్మాణాన్ని చేపట్టడానికా.? ఆ అంశాన్ని తెలివిగా డైల్యూట్‌ చేసెయ్యడానికా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.

Show comments