బీజేపీకి నచ్చడం లేదు.. అయినా మోడీ ఓకే అంటాడా?

‘’ తెరాస అధినేతను నమ్మవద్దు.. సోనియాకు ఎలాంటి ఝలక్ ఇచ్చాడో చూస్తున్నాం.. మనకూ అలానే చేయడని నమ్మకం ఏమిటి? అతడు 2019లో మద్దతు ఇస్తాను అన్నంత మాత్రాన.. అసెంబ్లీ సీట్ల పునర్విభజన చేయవద్దు, ఆయన కోరినట్టుగా అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేయవద్దు దీని వల్ల చాలా సమస్యలే ఉంటాయి. ఇంకోవైపు ఎమ్ఐమ్ విస్తరిస్తుంది. ఆ పార్టీ సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇక ఏపీలో కూడా బీజేపీకి ఒరిగేదేమీ ఉండదు. తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపుదారులకు ఉపయోగపడవచ్చు కానీ.. మనకేం లాభం ఉండదు.. కాబట్టి ఈ పునర్విభజన చేపట్టకపోవడమే మంచిది.. ‘’ అంటున్నారు కమలం పార్టీ నేతలు.

అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు విషయంలో వారు ఈ మాట మాట్లాడుతున్నారు. అయితే..  సీట్ల  పెంపుకు విపరీతమైన స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నది కూడా కమలం నేతలే! వెంకయ్య నాయుడు అయితే మరో పనేం పెట్టుకోకుండా.. సీట్ల సంఖ్య పెంపు గురించి ఢిల్లీలో తెగ ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. చంద్రబాబు కోరికను తీర్చడమే తన పనిగా పెట్టుకున్నాడు మరి ఆయన!

అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు సీట్ల పెంపు కుదరదని పార్లమెంటులో ప్రకటన వచ్చింది. కానీ చంద్రబాబు “ప్యాకేజీ’’ కి రాజీపడ్డ తర్వాత మాత్రం సీట్ల పెంపుపై తెలుగుదేశంలో విశ్వాసం పెరిగింది. రాష్ట్ర ప్రయోజనాలను ఆ విధంగా తాకట్టు పెట్టినందుకు గానూ.. సీట్ల సంఖ్య పెంపుపై కేంద్రం బాబుకు భరోసా ఇచ్చిందనే  మాట వినిపిస్తోంది. 

ఎవరేమనుకున్నా.. తమ రాజకీయం తమది అన్నట్టుగా, బీజేపీ- తెలుగుదేశంలో ఇంత దారుణమైన గేమ్ నే ఆడుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతూ.. రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నాయి. ప్రస్తుతానికి అయితే, ఈ వ్యవహారం పూర్తిగా మోడీ కోర్టులో ఉందని తెలుస్తోంది. ఆయన ఆదేశిస్తే.. నిమిషాల మీద ఇందుకు సంబంధించిన పనులు మొదలవుతాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. Readmore!

అయితే.. సీట్ల పెంపు డిమాండ్లు ఈ రెండు రాష్ట్రాల నుంచే కాదు, చాలా రాష్ట్రాల నుంచి ఉన్నాయి. మరి ఈ రాష్ట్రాలకే మోడీ ఓకే చెప్పగలడా? అలాగైతే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంటుంది? అనేవి శేషప్రశ్నలు. తెలుగుదేశం వర్గాలైతే మాత్రం.. ప్రత్యేక ప్యాకేజీకి రాజీ పడిపోయినందుకు, సీట్ల పెంపు కచ్చితంగా జరుగుతుందనే విశ్వాసంతోనే ఉన్నాయి. 

Show comments