భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల అసెంబ్లీకి జరగాల్సి ఉన్న ఉపఎన్నిక విషయంలో తెలుగుదేశం పార్టీలో అప్పుడే తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నట్టుగా తెలుస్తోంది. నంద్యాల నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశంపై తెలుగుదేశం పార్టీలో రచ్చ మొదలయినట్టు సమాచారం. ఈ సీటు విషయంలో భూమా మరణానికి ముందునుంచే తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన పోటీ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భూమా నాగిరెడ్డి మరణంతో ఈ వ్యవహారంపై మరింత రచ్చ తప్పేలాలేదు.
వచ్చే ఎన్నికల్లో నంద్యాల టికెట్ విషయంలో భూమా నాగిరెడ్డి, శిల్పామోహన్ రెడ్డిలు పోటీలో ఉండేవారు టీడీపీ నుంచి. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన శిల్పామోహన్ రెడ్డి, వైకాపా తరపున గెలిచి పార్టీ ఫిరాయించిన నాగిరెడ్డిలు అమితుమి తలపడుతూ వచ్చారు. అయితే నాగిరెడ్డి హఠాన్మరణం చెందారు. ఇంతలోనే శిల్పా ఫ్యామిలీ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది.
నంద్యాల ఉపఎన్నికల్లో టికెట్ తమదే అని వీరు అంటున్నారు. ఈ మేరకు లోకేష్‌బాబు స్థాయిలో మంత్రాంగం కూడా మొదలైనట్టు సమాచారం. పోయిన భూమా నాగిరెడ్డి ఎలాగూ పోయారు... ఇక టికెట్ తమకే ఇవ్వాలని శిల్పా ఫ్యామిలీ పట్టుబట్టిందని తెలుస్తోంది. లోకేష్‌బాబు కూడా దీని పట్ల సానుకూలంగా ఉన్నాడని తెలుస్తోంది. నంద్యాల బాధ్యతలను శిల్పా ఫ్యామిలీకి అప్పగించేస్తే.. భవిష్యత్తులో కూడా గొడవ ఉండదని లోకేష్ భావిస్తున్నట్టు సమాచారం.
అయితే.. భూమా ఫ్యామిలీ ఈ టికెట్ మీద ఆశలు పెట్టుకుని ఉంది. ఈ నియోజకవర్గం నుంచి భూమా నాగ మౌనిక పోటీ చేయనుందనే మాట భూమావర్గం నుంచి వినిపిస్తోంది. అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉండగా, నాగమౌనిక నంద్యాల అభ్యర్థి అవుతుందని వీరు అంటున్నారు. అలాగే భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు కూడా నంద్యాల సీటును ఆశిస్తున్నట్టుగా సమాచారం. అయితే.. తెలుగుదేశం అధిష్టానం కూడా నంద్యాలను భూమా ఫ్యామిలీ నుంచి విడిపించాలనే భావనతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పుడు భూమా కుటుంబానికి ఛాన్సు ఇస్తే.. వచ్చే ఎన్నికల నాటికి అయినా మళ్లీ రచ్చ తప్పదని, అప్పుడు గొడవ కన్నా ఇప్పుడు ఈ సీటును శిల్పా కుటుంబానికి అప్పగించేయడం మేలనేది లోకేష్ లెక్క అని తెలుగుదేశం నేతలు అంటున్నారు. మరి ఇదే జరిగితే భూమా పిల్లలకు చంద్రబాబు మార్కు దెబ్బ తగిలినట్టే. వీళ్లు గనుక వైకాపా ఉండి ఉంటే.. జగన్ ఈ సీటును జగన్ కచ్చితంగా భూమా ఫ్యామిలీకి అప్పగించేవాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చంద్రబాబు లెక్కలు వేరే రకంగా ఉంటాయి కదా.
అఖిలప్రియకు మంత్రిపదవి కానీ లేదా మరో పదవి కానీ ఇస్తాం.. నంద్యాలను శిల్పా కుటుంబానికి వదిలేయాలనే ప్రతిపాదన తెలుగుదేశం అధిష్టానం నుంచి వినిపిస్తున్నట్టుగా తెలుగుదేశం కర్నూలు జిల్లా వర్గాలు అంటున్నాయి. మొత్తానికి భూమా నాగిరెడ్డిని నానరకాలుగా హింస పెట్టి, హార్ట్ ట్రబుల్‌తో ఇబ్బంది పడుతున్న ఆయనపై మానసిక ఒత్తిడిని మరింతగా పెంచి.. చివరకు ఆయనను కాటికి పంపిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు భూమా పిల్లల రాజకీయ భవిష్యత్తును కూడా దారుణంగా దెబ్బతీయడానికి రంగం సిద్ధం చేసిందనే విషయం స్పష్టం అవుతోంది.