పెద్దనోటూ.. ఎక్కడికెళ్ళావ్‌.?

పెద్ద పాత నోట్ల రద్దుతో అవినీతి తగ్గుతుందని ప్రధాని నరేంద్రమోడీ సెలవిచ్చారు. అసలు పెద్ద నోట్లను రద్దు చేయాలన్న ప్రతిపాదన తనదేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పుకున్నారు. కానీ, ఏమయ్యింది.? వెయ్యి రూపాయల నోటు రద్దయి, అంతకన్నా పెద్దది 2000 రూపాయల నోటు వచ్చింది. పెద్ద నోట్ల రద్దుతో దేశం వెలిగిపోతుందనే మోడీ మాటలు ఉత్త మాటలుగా మిగిలిపోయాయి. పాత వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్ల రద్దుతో తాత్కాలికంగా ఏర్పడ్డ కరెన్సీ సంక్షోభానికి 2 వేలరూపాయల నోటుతో కొంతవరకు చెక్‌ పెట్టవచ్చనీ, తద్వారా వేగంగా జనానికి సొమ్ము చేరవేస్తామనీ అటు రిజర్వు బ్యాంకు, ఇటు కేంద్ర ప్రభుత్వం సెలవిచ్చాయి. 

నిజానికి పెద్ద పాత నోట్ల రద్దుతో అవినీతి తగ్గలేదు. నల్లధనం బయటకు రాలేదు. తీవ్రవాదమూ అంతమవలేదు సరికదా, సరికొత్తగా ఐసిస్‌ టెర్రరిజం దేశంపై పంజా విసిరింది. మరి, పెద్ద పాత నోట్ల రద్దుతో ప్రజలకెలా ప్రయోజనం కలిగిందట.? ఏమో మరి, ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సి వుంటుంది. 

తాజా ఖబర్‌ ఏంటంటే.. పెద్ద కొత్త నోటు.. అదేనండీ 2 వేల రూపాయల నోటు, ఆచూకీ గల్లంతయ్యేలా వుంది. బ్యాంకులు గతంలో 2 వేల రూపాయల నోటు తప్ప, వంద రూపాయల నోటుగానీ, ఆఖరికి 500 రూపాయల నోటుగానీ ఇచ్చేవి కాదు. 2 వేల రూపాయల నోటుకి చిల్లర ఎలా వస్తుందంటే, మీ ఖర్మ.. అనేసి ఊరుకున్నాయి బ్యాంకులు. పెద్దయెత్తున మార్కెట్‌లోకి 2 వేల రూపాయల నోట్లు వచ్చి చేరాయి ఎలాగైతేనేం. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. ఆ 2 వేల రూపాయల నోటు ఇప్పుడు అంతగా కన్పించడంలేదు. బ్యాంకుల నుంచి బయటకెళ్తున్న 2 వేల రూపాయల నోటు తిరిగి బ్యాంకులకు చేరడంలేదు. సాక్షాత్తూ బ్యాంకు అధికారులే ఈ మాట చెబుతున్నారు. 

ఇంతకీ, మార్కెట్‌లోకి వస్తున్న 2 వేల రూపాయల నోటు ఏమవుతోందట.? బ్లాక్‌ మనీగా మారి, పెద్దల గోదాముల్లో మగ్గుతున్నాయనుకోవాలేమో. అందుకే, దేశంలో మళ్ళీ కరెన్సీ సంక్షోభం కన్పిస్తోంది. గడచిన వారం పది రోజులుగా ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 'నో క్యాష్‌' బోర్డులే అందుక్కారణం. చెక్‌ బుక్‌లు పట్టుకుని, జనం బ్యాంకులకు పరిగెడుతున్నారు. అక్కడా నగదు ఆశించిన స్థాయిలో లభ్యం కావడంలేదు. బ్యాంకుల యెదుట, ఏటీఎంల యెదట జనాన్ని బిచ్చగాళ్ళలా నిలబెట్టిన ఘనత మాత్రం నరేంద్రమోడీకే దక్కుతుంది. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయినా, కనీస మానవత్వాన్ని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రదర్శించలేకపోయింది. 

వారెవ్వా నరేంద్రమోడీ.. డిసెంబర్‌ తర్వాత కరెన్సీ కష్టాలు తగ్గిపోతాయని చెప్పి, కొద్ది రోజులు మాయ చేసి, మళ్ళీ.. దేశాన్ని కరెన్సీ సంక్షోభంలోకి నెట్టేశారంటే.. జనాన్ని పీల్చి పిప్పి చేసెయ్యాలన్న మీ రాజకీయ వ్యూహాలు అదుర్స్‌.. అనకుండా ఎలా వుండగలం.?

Show comments