మెగాస్టార్, దర్శకరత్న కాదు...‘కుల’ నేతలు..!

‘వైష్ణవ మతం పుచ్చుకున్నాక శంఖు చక్రాలు వేయించుకోవడం తప్పనిసరి’ అని పూర్వకాలంలో అనేవారు. ఆ కాలంలో శైవ, వైష్ణవ మతాల మధ్య పోరాటం సాగుతున్నప్పుడు మతపరమైన సామెతలు, నానుడులు అనేకం పుట్టాయి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ఎంతటి గొప్పవాడైనా, ‘అందరివాడు’ అనిపించుకొని కులమతాలకు అతీతంగా ఉన్నవాడైనా రాజకీయాల్లో చేరాక ‘కుల ముద్ర’ నుంచి తప్పించుకోవడం కష్టమనిపిస్తోంది. 

ప్రస్తుతం ఒకప్పటి మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు దాసరి నారాయణరావును చూస్తుంటే ‘ఎంతటివారైనా కులం దాసులే’ అనిపిస్తోంది. ఉమ్మడి రాష్ర్టంలో వారిద్దరూ సినిమా రంగంలో దిగ్గజాలు. కులాలకు అతీతంగా అందరూ వారిని ప్రేమించారు. అభిమానించారు. కాని ఇప్పుడు ఒక రాష్ట్రానికి చెందిన కాపు నాయకులుగా మిగిలిపోయారు. 

వారు సినిమా రంగంలోనే ఉండి దాని కోసమే జీవితాన్ని అంకితం చేసినట్లయితే ఎప్పటికీ మెగాస్టార్, దర్శకరత్నగానే ఉండేవారు. కాని రాజకీయాల్లోకి ప్రవేశించాకనే వారి కులమేమిటో ప్రజలకు తెలిసింది. సినిమా రంగంలో ఉండేవారి కులాల గురించి తెలిసినా ప్రజలు కులపరంగా చూడరు. కళాకారులుగానే ఆదరిస్తారు. కాని ఎప్పుడైతే రాజకీయాల్లో చేరతారో వారు కులానికి అతీతంగా వ్యవహరించలేరు. ఇందుకు కారణం... రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతుండటమే. కులం గురించి మాట్లాడకుండా, కుల భావనలు రెచ్చగొట్టకుండా రాజకీయాలు చేయడం ఇప్పటి రాజకీయ నాయకులకు చేతకాదు. 

కుల ప్రయోజనాలతోనే రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి అందుకు అతీతంగా ఉంటే తెరమరుగు కావల్సివస్తుందనే భయం ఉంది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో కులంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తే ఉనికిని కాపాడుకోవడం కష్టం. చిరంజీవి, దాసరిది కూడా ఇదే సమస్య. అందుకే వారు ముద్రగడ పద్మనాభం కొనసాగిస్తున్న కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ప్రభుత్వానికి ఘాటైన హెచ్చరికలు చేశారు. కాపుజాతి పరిరక్షకుల జాబితాలో వీరూ చేరారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పించినట్లయితే అందుకు తాము కూడా కారకులమని వీరు చెప్పుకోవచ్చు. తద్వారా రాజకీయ ప్రయోజనం పొందొచ్చు. మెగాస్టార్, దర్శకరత్న సినిమా జీవితం దాదాపు అంతమైంది. సినిమా రంగంలో వారి గత వైభవం ఒక జ్ఞాపకం మాత్రమే. అంతమాత్రాన వారి సినిమా చరిత్రను విస్మరించలేం. వారు గొప్ప నటుడుగా, దర్శకుడిగా ఎప్పుడూ గుర్తుంటారు. అయితే రాజకీయాలు వారి జీవితాల్లో చివరి అధ్యాయం కాబట్టి కాపు కుల నాయకులుగా శాశ్వతంగా గుర్తుండిపోతారు. జీవిత చరమాంకంలో కొందరివారుగా మిగిలిపోతారు. చిరంజీవి, దాసరి కుటుంబాలకు రిజర్వేషన్లతో పనిలేదు. 

కాని ముద్రగడ చేస్తున్న ఉద్యమంపై స్పందించకపోతే కాపులు వారికి రాజకీయంగా మద్దతు ఇవ్వకపోవచ్చు. కాంగ్రెసులో దాసరికి భవిష్యత్తు లేదు. ఆయనకు ‘బొగ్గు మసి’ అంటుకుంది. ఆ కేసు ఏ మలుపు తీసుకుంటుందో చెప్పలేం. వచ్చే ఎన్నికల వరకు చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఉంది. ఆ తరువాత రాజకీయ పరిణామాలనుబట్టి ఆయన రాజకీయ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేం. వచ్చే ఎన్నికల్లోగా చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వగలరా అనేది అనుమానమే. ఇది హామీ ఇచ్చినంత సులభం కాదు. సుదీర్ఘ ప్రక్రియ. అందులోనూ కేంద్రం సహకారం లేనిదే సాధ్యం కాదు.

ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్న నేపథ్యంలో ఆంధ్రాలో బాబు సర్కారుకు సహకరిస్తుందనే నమ్మకం లేదు. అలా జరిగితే టీడీపీని ఓడగొట్టేందుకు కాపులంతా ఏకమై రాజకీయ పార్టీ పెట్టే అవకాశముందని కొందరు అంచనా వేస్తున్నారు. అలాంటి పరిస్థితి వస్తే చిరంజీవి, దాసరి కీలక పాత్ర పోషించవచ్చేమో....! ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ తన బలం పెంచుకోవడానికి ప్రధానంగా కాపులపై ఆధారపడింది. పార్టీకి కాపు నాయకుడిని అధ్యక్షుడిని చేసే ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. 

కాపు నాయకుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య గోదావరి జిల్లాల్లో ‘ఆరంభం’ పేరుతో పత్రిక పెట్టారట. అందులో వచ్చే ఎన్నికల్లో బీజేపీ చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు రాసింది. జర్నలిజంలో కురువృద్ధుడైన ఓ టీవీ ఛానెల్ ఎడిటర్ ఈ సంగతి చెప్పారు. ఇది కేవలం ఊహాగానమా? అలాంటి ఆలోచనలు చేస్తున్నారా? తెలియదు. కాంగ్రెసుకు భవిష్యత్తు లేదనుకుంటే చిరంజీవి ఫిరాయించడని గ్యారంటీ ఏమిటి? ఇక కాపు ఉద్యమ నేతలు పవన్ కళ్యాణ్ స్పందన కోసం ఒత్తిడి చేస్తున్నారు. అన్నయ్య బయటపడినా తమ్ముడు ఏమీ మాట్లాడటంలేదు. ఆయన అభిప్రాయం ఏదైనా రాష్ర్ట రాజకీయాలపై ప్రభావం చూపుతుంది. 

మేనా

Show comments