బాబుగారి ‘వందకోట్లు’ కు శాస్త్రవేత్తల పంచ్!

దేన్నైనా డబ్బుతో కొనేయడం ఆయనకు అలవాటు లాగుంది. ఆల్రెడీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వివాదంలో బాబు ఉండనే ఉన్నారు.. ఇదే పరంపరలో ఏదో వీధి చివర కుస్తీ పోటీల్లో పాల్గొనే వారికి ప్రోత్సాహకం ప్రకటించినట్టుగా, నోబెల్ బహుమతి నెగ్గితే తను ప్రత్యేక బహుమతిని ఇస్తానని, వంద కోట్లు ఇస్తానని బాబుగారు చెప్పుకొచ్చారు. బాబుగారు ఇస్తానన్నది ప్రభుత్వ ఖాతా నుంచి తీసే. ఈ నేపథ్యంలో బాబుగారి ప్రకటనపై సైన్స్ కాంగ్రెస్ నుంచే సమాధానం వచ్చింది!

నోబెల్ సాధిస్తే.. ఇస్తానంటున్న ఆ వంద కోట్ల రూపాయలను ముందు రాష్ట్రంలో పరిశోధనాలయాల, ప్రయోగశాలల అభివృద్ధికి కేటాయించాలని వారు సూచించారు. ముందు వాటిల్లో సదుపాయాలను మెరుగు పరచండి, నోబెల్ బహుమతులు అవే వస్తాయని వారు బాబుకు నొక్కి చెప్పారు. ఎవరికీ వ్యక్తిగతంగా ఇవ్వనక్కర్లేదు.. సదుపాయలు కల్పించండి చాలు.. అని యువ శాస్త్రవేత్తల బృందం చెప్పింది.

వీళ్లు కచ్చితంగా తగిన మాటనే చెప్పారు. ప్రభుత్వ పరిశోధన కేంద్రాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ, కాలేజీల స్థాయిల నుంచి పరిశోధనల, ప్రయోగశాలల పరిస్థితి ఎలా ఉందో మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. స్కూల్, కాలేజీ లెవల్లో ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసమైనా ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయా? అసలు ప్రాక్టికల్స్ లో మార్కులంటే.. అవి ఫ్రీగా వచ్చేవి అన్నట్టుగా తయారైంది మన విద్యావిధానం. ప్రభుత్వ కాలేజీ కావొచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావొచ్చు.. కేవలం బట్టీ చదువులే కానీ, ప్రయోగశాల వరకూ ఎదగలేదు మన విద్యావిధానం. ఇలాంటి పరిస్థితిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. యువ శాస్త్రవేత్తలు కోరుతున్నట్టుగా తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఏదైనా సాధ్యం అవుతుంది.

అయితే.. అలా కాదు, మీరు సాధించుకురండి, నేను వంద కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతా నుంచి తీసి ఇస్తా.. అని చంద్రబాబు గారు ప్రకటించారు! ఆ వందకోట్లను ఎలా వినియోగించాలో.. శాస్త్రవేత్తలే ఇప్పుడు సలహా ఇచ్చారు. మరి ఆ మేరకు వారి సూచనలు స్వీకరించడానికి బాబుగారు సిద్ధమేనా? లేక ఇంతటితో ఆ వంద కోట్ల వ్యవహారాన్ని మరిచిపోవడమేనా!

Show comments