చంద్రబాబూ.. చిటికెలు, చిటికెలోయ్‌.!

నాయకుడు మాట్లాడుతోంటే, జనం ఆనందోత్సాహాలతో పరవశించిపోవాలి. ఆ నాయకుడిలో కొత్త ఉత్సాహం నింపేలా కరతాళధ్వనులు చెయ్యాలి. అఫ్‌కోర్స్‌, నాయకుడు చెప్పేది శ్రద్ధగా వినడం అనేది కూడా తప్పనిసరి.. అనుకోండి. అది వేరే విషయం. అయినాసరే, జనం సైలెంట్‌గా వున్నారని, అడిగి మరీ 'క్లాప్స్‌' కొట్టించుకోవడమేంటట.? 

ఈ మధ్య చంద్రబాబునాయుడు ఏ బహిరంగ సభలో మాట్లాడినా, జనం నుంచి 'సైండింగ్‌' కన్పించడంలేదు. ఆ మాటకొస్తే, ఏరికోరి జనాన్ని సభలకు తెప్పించుకుంటున్నారుగానీ, చంద్రబాబు ప్రసంగం ప్రారంభమయిన కాస్సేపటికే జనం అక్కడినుంచి ఖాళీ చేసేస్తున్నారు. పరమ బోరింగ్‌ ప్రసంగాలకు చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారు. ఆ మాటకొస్తే, ఇప్పుడు రాజకీయ నాయకులు చేసే ఊకదంపుడు ప్రసంగాలకి జనం ఏమాత్రం ఎంటర్‌టైన్‌ కావడంలేదన్నది నిర్వివాదాంశం. 

అధికారం చేతిలో వుంది గనుక, బస్సుల్ని పంపించి మరీ చంద్రబాబు తన సభలకు జనాన్ని రప్పించుకుంటున్నారు. జనాన్ని అయితే రప్పించుకోగలరుగానీ, వారి నుంచి తన ప్రసంగాలకు ఆమోదం తెప్పించుకోలేరు కదా.! అందుకే, అడిగి మరీ క్లాప్స్‌ కొట్టించుకుంటున్నారు. 'మీరు క్లాప్స్‌ కొట్టి నా మాటలకు హర్షాన్ని తెలియజేయండి.. మీరు చేతులెత్తి నా మాటల్ని ఆమోదిస్తున్నట్లు తెలపండి..' అంటూ చంద్రబాబు మరీ దారుణంగా బతిమాలుకుంటున్నారు. 

ఓ పాత తెలుగు సినిమాలో, సన్మాన కార్యక్రమమొకటుంటుంది. అందులో సన్మానాల పిచ్చోడు, బోల్డంత ఖర్చు చేసి సన్మానం చేయించుకుంటుంటాడు. అన్నిట్లోనూ వెరైటీని కోరుకునే ఆ సన్మానాల పిచ్చోడికి, 'చిటికెలు చిటికెలోయ్‌' అనే వెరైటీ కాన్సెప్ట్‌తో హర్షం వ్యక్తం చేయించేలా నిర్వాహకులు ప్లాన్‌ చేస్తారు. అలా వుందిప్పుడు చంద్రబాబు పరిస్థితి.  Readmore!

ప్రత్యేక హోదాతో వచ్చేవన్నీ ప్రత్యేక ప్యాకేజీలో వున్నాయి కాబట్టి, ప్యాకేజీకి ఆమోదం తెలిపానని చంద్రబాబు చెప్పుకున్నారు. అది నిజమేననుకుందాం. ఎదీ, ప్యాకేజీ.? ఎక్కడ.! ఆ ప్యాకేజీకి కేంద్రం చట్టబద్ధత ఏమన్నా కల్పించిందా.? లేదే, మరి.. చంద్రబాబు, ప్రసంగాలకు ఎలా హర్షం తెలుపుతారు.? ఇదొక్కటే కాదు, చాలా విషయంలో చంద్రబాబు కాన్సెప్టులు భలే కామెడీగా తయారయ్యాయి. సెల్‌ఫోన్‌లోని టార్చ్‌లైట్లు వెయ్యమంటారు.. ఆ సెల్‌ఫోన్‌ని నేనే కనుగొన్నానన్నట్లుగా మాట్లాడతారు. దటీజ్‌ చంద్రబాబు.! 

చంద్రబాబుకి ఓ విషయం అర్థం కావడంలేదు.. చంద్రబాబు చేష్టల్ని జనం కామెడీగా కూడా ఎంజాయ్‌ చెయ్యడంలేదని. దటీజ్‌ నిప్పు నారా చంద్రబాబునాయుడు.

Show comments