మోడీ కాళ్ళు పట్టుకోవాల్సిందేనేమో.!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖర్‌రావులకు కేంద్రం దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యే ఝలక్‌ ఇచ్చింది. '2019 ఎన్నికలనాటికి నియోజకవర్గాలు పెరుగుతాయి.. ఈలోగా పార్టీలోకి వచ్చేవాళ్ళు వచ్చెయ్యండి..' అంటూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రత్యర్థి పార్టీలకు గాలం వేసిన విషయం విదితమే. ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి ఈ రెండు పార్టీలూ నియోజకవర్గాల పునర్‌విభజనపై. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ అడుగు ముందుకేసి, తెలంగాణలో జిల్లాల విభజన ప్రక్రియనీ చేపట్టేశారు.. నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణపై అంచనాలతోనే. ఆంధ్రప్రదేశ్‌లో అయితే, అలాంటి పనులేవీ జరగకపోయినా, 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు ఖచ్చితంగా వుంటుందనీ, అది తన హామీ అనీ చంద్రబాబు, టీడీపీలోకి వచ్చే ఇతర పార్టీలకు చెందిన నేతలకు భరోసా ఇచ్చేశారు. 

అయితే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌, ఏపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంతో అటు టీఆర్‌ఎస్‌, ఇటు టీడీపీ షాక్‌కి గురయ్యాయి. నియోజకవర్గాల పెంపుపై విభజన చట్టంలోనే స్పష్టత వుంది. కానీ, నియోజకవర్గాల పెంపు కోసం ఆర్టికల్‌ 170 అడ్డంకిగా మారిందనే విషయాన్ని కేంద్ర మంత్రి హన్సరాజ్‌ పేర్కొన్నారు. దాంతో వ్యవహారం మొదటికొచ్చింది. 

ఇదిలా వుంటే, నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ విషయంలో, కేంద్ర హోంమంత్రితో ఇప్పటికే చర్చించామనీ, అటార్నీ జనరల్‌కు పరిస్థితిని కేంద్ర హోంమంత్రి వివరించారనీ, త్వరలోనే ఈ విషయమై స్పష్టత వస్తుందని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పక్షం ఈ వ్యవహారంపై మింగలేక కక్కలేక అన్నట్లుగా వ్యవహరిస్తోంది. 

నియోజకవర్గాల పెంపుపై ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీలూ గంపెడాశలు పెట్టేసుకున్నాయి. ముఖ్యమంత్రులిద్దరూ పోటీ పడి మరీ, నైతిక విలువల్ని తుంగలో తొక్కేశారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండాకులు ఎక్కువే చదివేశారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ని, టీఆర్‌ఎస్‌లోకి లాగేసి, మంత్రిని కూడా చూసేశారు. మరిప్పుడు, నియోజకవర్గాల పెంపు జరగకపోతే పరిస్థితి ఏంట.? 

ఏదిఏమైనా, కొత్త నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకుని, టీడీపీ - టీఆర్‌ఎస్‌లోకి జంపింగ్‌ చేసేసిన నేతలు, 2019 ఎన్నికల నాటికి 'అకామడేషన్‌' కుదరకపోతే, తద్వారా ఆయా పార్టీల్లో తలెత్తే సునామీ అలా ఇలా వుండదు. మరి, ఈ పరిస్థితుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులూ ఏం చేస్తారు.? తమ పార్టీల్లో సంక్షోభానికి చేతులెత్తేస్తారా.? లేదంటే, ప్రధాని కాళ్ళు పట్టుకుని అయినా (తప్పదు మరి, మోడీని బతిమాలుకోవడం తప్ప వేరే దారి లేదు) నియోజకవర్గాల పెంపు సాధిస్తారా.? వేచి చూడాల్సిందే.

Show comments