మహేష్ కొత్త సినిమా టైటిల్ ఏంటి..? ప్రభాస్ అప్ కమింగ్ మూవీకి ఏం పేరు పెట్టారు..? అఖిల్ రెండో సినిమా టైటిల్ గా జున్నును ఫిక్స్ చేశారా..? మొన్నటివరకు చక్కర్లుకొట్టిన ఈ ప్రశ్నలకు సమాధానాలు దాదాపు దొరికేసినట్టే. ఈ క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించి తాజాగా టైటిల్స్ రిజిస్టర్ చేయించారు. అఫీషియల్ గా ఇంకా ఎనౌన్స్ చేయనప్పటికి ఫిలింఛాంబర్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ టైటిల్స్ మాత్రం నమోదయ్యాయి.
ఎన్వీఆర్ సినిమా బ్యానర్ పై స్పైడర్ అనే టైటిల్ రిజిస్టర్ అయింది. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు కలిసిపెట్టిన బ్యానర్ ఇది. ప్రస్తుతం ఈ బ్యానర్ పై మహేష్ కొత్త సినిమా తెరకెక్కుతోంది. మహేష్ సినిమాకు స్పైడర్ అనే టైటిల్ పెట్టినట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు అదే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.
అటు అక్కినేని అఖిల్ రెండో సినిమా టైటిల్ పై కూడా దాదాపు క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు అఖిల్. ఈ సినిమాకు జున్ను అనే పేరు పెట్టినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు అదే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. సుమంత సొంత బ్యానర్ ఎస్ ఎస్ క్రియేషన్స్ పై ఈ పేరు రిజిస్టర్ అయింది. ఇదే బ్యానర్ పై "ఎక్కడ ఎక్కడ ఉందో తారక" అనే మరో టైటిల్ కూడా రిజిస్టర్ అయింది. ఈ రెండింటిలో ఒక పేరును అఖిల్ సినిమాకు పరిశీలించే అవకాశముంది.
బాహుబలి-2 తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా టైటిల్ పై కూడా క్లారిటీ వచ్చింది. సాహో అనే టైటిల్ ను ఈ బ్యానర్ రిజిస్టర్ చేయించింది. బాహుబలి రిలీజైన తర్వాత సాహో అనే పదం బాగా పాపులర్ అయింది. దీంతో ప్రభాస్ నెక్ట్స్ సినిమాకు అదే పేరు ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు అదే పేరును రిజిస్టర్ చేయించారు.