వర్మకి సహాయ నిరాకరణ

మహిళా దినోత్సవం రోజున వివాదాస్పద ట్వీట్లు చేసిన రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదవడం తెల్సిన విషయమే. అయినా, వర్మకి ఇలాంటివన్నీ మామూలే. వివాదాస్పద వ్యాఖ్యల కోసమే ఆయన సోషల్‌ మీడియాని వాడుకుంటున్న తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 'నా అభిప్రాయాలు నేను చెప్పేందుకు సోషల్‌ మీడియా సరైన వేదిక..' అంటుంటారాయన. అలా ఆయన తనకు తోచింది రాసేస్తూ, వాటి ఫలితంగా తలెత్తే వివాదాలతో సావాసం చేయడం మామూలే.

వర్మ తాజాగా ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళలు సన్నీలియోన్‌తో తమను పోల్చుతారా.? అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పోర్న్‌స్టార్‌ సన్నీలియోన్‌ ఇండియాలో అడుగు పెడ్తానంటేనే అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే జరిగింది. అలాంటి సన్నీలియోన్ తో తమని పోల్చితే సహజంగానే ఒళ్ళు మండిపోతుందెవరికైనా. అఫ్‌కోర్స్‌, ఆమె ఇప్పుడు బాలీవుడ్‌లో మాంఛి ఫాలోయింగ్‌ వున్న హీరోయిన్‌ అయిపోయిందనుకోండి.. అది వేరే విషయం. ఆమెను 'ఆ టైపు' సినిమాల కోసమే వాడేస్తుండడం, ఆ సినిమాలు విజయవంతమవుతుండడం తెల్సిన విషయాలే. 

మహిళా దినోత్సవం రోజున, మహిళలంతా సన్నీలియోన్‌లా మగాళ్ళకు ఆనందం పంచాలని వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. మమ్మల్ని సన్నీలియోన్‌తో పోల్చడం హేయమంటూ, ఏకంగా సినీ పరిశ్రమకు చెందిన ఓ విభాగం వర్మని హెచ్చరిస్తూ ఆయన సినిమాలకు సహాయ నిరాకరణ చేస్తామని ప్రకటించింది. ఇది బాలీవుడ్‌ వ్యవహారం. అన్నట్టు, ఆ విభాగంలో సుమారు 50 వేల మంది కార్మికులున్నారట. అక్కడిదో వివాదం ఆగుతుందా.? టాలీవుడ్ కీ పాకుతుందా.? ఏమోగానీ, ఇంకోపక్క వర్మ క్షమాపణ చెప్పకపోతే, ఆయన్ని చెప్పులతో కొడ్తామంటూ మహిళా నేతలు మీడియా ముందుకొచ్చి నానా హంగామా చేస్తున్నారు. 

ఇంతకీ, తన తాజా చిత్రం 'సర్కార్‌-3' విడుదలకు ముందు వర్మ వ్యూహాత్మకంగానే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారా.? ఏమో మరి, ఆయనకే తెలియాలి. Readmore!

Show comments