అనుబంధం లేకపోయినా ఆరాటం ఎందుకో...?

'అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం... ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం'...'తాతా-మనుమడు' సినిమాలోని ఈ పాట తిరుగులేని వాస్తవం. తమిళనాడులో దివంగత జయలలిత విషయంలో ఈ విషయం అక్షరాల నిజమనిపిస్తోంది. మనుషుల మధ్య లేని అనుబంధాలను, ఆత్మీయతలను సృష్టించేది ఒకటుంది. అదే ఆస్తి లేదా సంపద. ఆస్తి ఉచితంగా వస్తోందంటే మనుషులు ఎంతకాలమైనా పోరాటం చేస్తారు.

కష్టపడకుండా ఆస్తి సంపాదించుకోవాలంటే అందుకు ఉన్న ఒక మార్గం 'వారసత్వం'. దండిగా  ఆస్తులుండి, కుటుంబం, పిల్లాజెల్లా లేకుండా చనిపోయినవారికి వారసులు రాత్రికి రాత్రి పుట్టుకొస్తారు. తాము ఫలానా విధంగా వారసులమవుతామని, కాబట్టి ఆస్తి తమకే దక్కాలని పోరాటం చేస్తారు. ప్రస్తుతం జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ అలాగే పోరాటం చేస్తోంది. అత్త ఆస్తికే కాదు, పార్టీకీ తానే వారసురాలినని అంటోంది. నిజానికి ఆమెకు ఆస్తి దక్కదు, తలకిందులు తపస్సు చేసినా పార్టీ ఆమె చేతిలోకి రాదు.

 ఈ విషయం ఆమెకు తెలియకుండా ఉండదు. కాని ఆస్తి దక్కించుకోవాలనే తాపత్రయం విపరీతంగా ఉంది. ఎక్కడెక్కడో ఉన్న జయకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులూ ఎలాగూ ఆమెకు దక్కవు. కాబట్టి జయ నివాసమైన పోయస్‌గార్డెన్స్‌లోని వేద నిలయం దక్కించుకోవాలని దీప ఆరాటపడుతోంది. నిజానికి జయలలిత ఆస్తులు యథాతథంగా ఉన్నాయా? శశికళకు, ఆమె కుటుంబ సభ్యుల చేతికి చిక్కాయా? అనే విషయం ఇప్పటివరకు తెలియదు.

దీనిపై రకరకాల వార్తలు వస్తున్నాయిగాని నిజానిజాలు బయటకు రావడంలేదు. ఇలాంటి పరస్థితిలో దీప జయ ఆస్తుల కోసం తాపత్రయపడటం ఎందుకో అర్థం కావడంలేదు. దీపకు జయలలిత మేనత్త అయినప్పటికీ వారిద్దరి మధ్య అనుబంధం, ఆత్మీయత, రాకపోకలు లేవు. దీప తండ్రి (జయలలిత అన్న) ఇంట్లో జరిగిన ఏ కార్యక్రమానికీ జయ హాజరు కాలేదు. జయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మొదటిసారిగా జయలలితను చూసేందుకు దీపా జయకుమార్‌ ఆస్పత్రికి వచ్చింది. కాని జయను చూసేందుకు కాదు కదా ఆస్పత్రిలోకి వెళ్లేందుకు కూడా అనుమతించలేదు.

తనకు జయలలిత అత్తంటే చాలా ఇష్టమని, తాను ఆమెకు క్లోజని, అయినా లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని ఆమె చెప్పింది. 1995లో తన తండ్రి (జయ సోదరుడు జయకుమార్‌) చనిపోయినప్పుడు జయలలిత వచ్చి పరామర్శించారని తెలిపింది.తన తల్లి విజయలక్ష్మి (జయ వదిన) 2012 నవంబరులో చనిపోయినప్పుడు తాను అత్తకు తెలియచేయలేదని దీప చెప్పింది.

దీప వివాహానికి కూడా జయ వెళ్లలేదు. జయకు బంధువులతో పెద్దగా సంబంధాలు లేవు.  ఎంతటివారినైనా ఆమె లెక్కచేయదు కదా. అందులోనూ రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగిపోయింది కాబట్టి బంధువులను దూరంగా పెట్టాలని ఆమె భావించి ఉండొచ్చు. వారు కూడా భయపడి దూరంగా ఉండొచ్చు. ఇక జయకు వివాహం కాకపోవడంతో ఆమెకంటూ కుటుంబం ఏర్పడలేదు. ఉన్న ఒక్క సోదరుడు, ఆయన భార్య చనిపోయారు. కాబట్టి రక్త సంబంధీకులెవరూ లేరనే అనుకోవాలి. 

దీపను, ఆమె సోదరుడు జయకుమార్‌ను జయ ఎన్నడూ వారసులుగా ప్రకటించలేదు. జయ ఆరోగ్యం క్షీణించాక జయ ఆస్తులకు, పార్టీకి తానే వారసురాలినని దీప తనకు తానే ప్రకటించకుంది. కొంతకాలం క్రితం ఆమె తమ్ముడు మీడియాతో మాట్లాడుతూ జయ ఆస్తులు తనకు, దీపకు చెందుతాయని, ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని చెప్పాడు.

నిన్న పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయం వద్ద దీపకు, ఆమె సోదరుడికి గొడవ జరిగినప్పుడు దీప కూడా తన వద్ద అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పింది. తనకు ఆస్తిలోనే కాదు, పార్టీలోనూ వాటా ఉందన్నది. తనకు చట్టపరంగా, నైతికంగా అన్ని హక్కులు ఉన్నాయని వాదించింది.

మరి వారసత్వం గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్న ఈమె కోర్టుకు వెళ్లిన దాఖలాలు లేవు. కోర్టులో వ్యాజ్యం వేసి పోరాడవచ్చు కదా...! ఇక జయ నివాసం వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే జయ ఆస్తులన్నాంటినీ కోర్టు ఆదేశాల మేరకు జప్తు చేయాలని కూడా సర్కారు నిర్ణయ తీసుకుందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆస్తులు తనకే దక్కాలని దీప ఎలా వాదిస్తోందో....!

Show comments