వేడి తగ్గింది.. పవన్ రంగంలోకి దిగాల్సిందే

పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే టాక్ తో సంబంధం లేకుండా థియేటర్లు నిండాల్సిందే. కోట్ల రూపాయల వసూళ్లు రావాల్సిందే. కాని ఇది ఎంత వరకు..? విడుదలైన మొదటి వారాంతం వరకు మాత్రమే. మహా అయితే మరో వీకెండ్ వరకు మాత్రమే. ఆ తర్వాత కచ్చితంగా కంటెంటే సినిమాను నడిపించాలి. కాటమరాయుడు విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. 

మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు విడుదలైన వారం ఎదురులేకుండా పోయింది. కానీ నెక్ట్స్ వీకెండ్ లో గురు రూపంలో పోటీ ఎదురైంది. అలా శనివారం ఈ సినిమా వసూళ్లలో తగ్గుదల కనిపించింది. ఆదివారం కూడా కాటమరాయుడు సినిమా కలెక్షన్లలో డౌన్ ఫాల్ కనిపించింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో వారం రోజుల పాటు కాటమరాయుడు సినిమా కచ్చితంగా థియేటర్లలో కొనసాగాలి. 

సెకెండ్ వీకెండ్ నాటికి కాటమరాయుడు సినిమాకు 60 నుంచి 62 కోట్ల రూపాయల మధ్య వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. కానీ సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకోవాలంటే కచ్చితంగా 90కోట్ల రూపాయలు వసూలు చేయాలి. మరి ఇప్పటికే డల్ అయిన కాటమరాయుడు ఇంకా 30కోట్లు సంపాదించగలడా అనేది పెద్ద ప్రశ్న. 

విడుదల సమయంలో ప్రచారానికి దూరంగా ఉన్న పవన్ కల్యాణ్, కీలకమైన ఈ టైమ్ లో రంగంలోకి దిగితే కాటమరాయుడు పుంజుకునే అవకాశాలున్నాయి. అయితే ఓవైపు త్రివిక్రమ్ తో కలిసి కొత్త సినిమాను ప్రారంభించబోతున్న పవన్.. కాటమరాయుడుపై మళ్లీ దృష్టిపెట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

Show comments