చరణ్ కోసం.. సూర్య త్యాగం.. అంతా ఉత్తిదేనా!

‘సింగం-3’ సినిమా తొలి వాయిదా సమయంలో ఆ సినిమా హీరో సూర్య మాట్లాడుతూ.. రామ్ చరణ్ తేజ ‘ధ్రువ’ కోసం తమ సినిమా విడుదలను వాయిదా వస్తున్నట్టుగా ప్రకటించాడు. చిరంజీవి కుటుంబం తమకు బాగా సన్నిహితం అని, అంతా ఒకటే కుటుంబం లాంటిదని.. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన చరణ్ సినిమా కోసం తన సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాను అని ప్రకటించాడు.

ఇదంతా తను చరణ్ కోసం చేస్తున్న త్యాగం అన్నట్టుగా కలరింగ్ చేశాడు సూర్య. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా, హిట్ అత్యవసరం అయిన దశలో చరణ్… సూర్య సినిమా పోటీలో ఉంటే, సహజంగానే ‘ధ్రువ’ కలెక్షన్లపై ప్రభావం పడుతుంది. దీంతో మెగా ఫ్యామిలీ కూడా ఒకింత ఆందోళనకు గురైనట్టుగా వార్తలు వచ్చాయి. ‘సింగం-3’ విడుదలను కొంత వాయిదా వేయిస్తున్నారనే మాట వినిపించింది.

దాన్ని సూర్య ధ్రువీకరించాడు. ‘ధ్రువ’ కోసమే తన సినిమాను వాయిదా వేసుకుంటున్నట్టుగా ప్రకటించాడు. అయితే.. అది పూర్తిగా అబద్ధం అని ఇప్పుడిప్పుడు తేలిపోతోంది! ‘ధ్రువ’ కోసమే సూర్య సినిమా వాయిదా పడలేదు, వాయిదాలకు అంతర్గత కారణాలు కూడా ఉన్నాయని స్పష్టం అవుతోంది. కేవలం ధ్రువ విడుదల అవుతున్న వారం మాత్రమే కాకుండా.. ఆ తర్వాతి విడుదల తేదీన కూడా సూర్య సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. దీన్ని బట్టి.. చరణ్ కోసం త్యాగం చేశామనడం అబద్ధం అని స్పష్టం అయిపోతోంది.

ఒకవేళ ‘ధ్రువ’ కోసం వాయిదా వేస్తున్నామంటూ, ఆ రోజు ప్రకటించిన విడుదల తేదీన ‘సింగం-3’ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉంటే, అది కచ్చితంగా సూర్య త్యాగమే అయ్యేది. కానీ, అలా జరగడం లేదు కాబట్టి.. చరణ్ కోసం త్యాగం చేసిట్టుగా సూర్య చెప్పుకున్నాడంతే అనుకోవాల్సి వస్తోంది.  

Show comments