మహా జాతర!

భోజనాలు, భజనతో సరి

మొక్కుబడి తంతుగా సాగిన వైనం

స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు కొరవడిన దైన్యం

దాదాపు ఇరవై రెండేళ్లుగా చంద్రబాబు మార్క్‌ ఉపన్యాసాలు ఎలా ఉంటాయో కార్యకర్తలకు ఎరుకే. ఏ అంశంపైనైనా పదే పదే మాట్లాడడం, విసిగించడం ఆయన ప్రసంగాలలో కనబడుతుంది. విశాఖలో మే 27 నుంచి 29 వరకూ మూడు రోజుల పాటు జరిగిన మహానాడులోనూ అదే జరిగింది. మొత్తం 27 గంటల ప్రసంగాలలో సింహభాగం జాతీయ అధ్యక్షుడు బాబుదే అయింది. ప్రతీ తీర్మానంలోనూ ఆయన జోక్యం చేసుకోవడంతో పాటు, ప్రారంభ, ముగింపు ఉపన్యాసాలే దాదాపుగా మూడు గంటల పైగా సమయం తీసుకున్నారు.

ఫలితంగా మొక్కుబడి తంతు గానే మహానాడు ముగిసిపోయినట్లైంది. ఎన్టీఆర్‌ తరువాత ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేసే నేతలు తెలుగుదేశంలో లేరన్నది వాస్తవం. ఆ లోటును కాసిం తైనా భర్తీ చేసే జూనియర్‌ ఎన్టీఆర్‌ వంటి వారు పార్టీకి దూరంగా ఉండడం, సినీ గ్లామర్‌తోనైనా అలరించే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరి ఫైర్‌ బ్రాండ్‌ హరికృష్ణ వంటి వారు గైర్‌హాజర్‌ కావడం వల్ల ఈసారి మహానాడు కళ తప్పినట్లైంది.

ఇక, ఈ మహానాడు ద్వారా తాను చెప్పాలనుకున్న కొన్ని అంశాలను మాత్రం ఇటు ప్రజలకు, అటు పార్టీ కేడర్‌కు బాబు పంపించే ప్రయత్నం చేశారు. మారు తున్న కాలానికి తగినట్లుగా రాజకీయం చేయాల్సిం దేనంటూ తన ప్రారంభోపన్యాసంలోనే చంద్రబాబు స్పష్టం చేశారు.

ఎన్టీఆర్‌ కాలం నాటి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేశారని ఇన్నాళ్లూ విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు చేసిన విమర్శలను నిజం చేస్తూ తమకు సిద్దాంతాల కంటే వాస్తవ రాజకీయాలే ముఖ్య మని కుండ బద్దలు కొట్టారు. ఎప్పటికి ఏది అవసరమో చూసుకుని రాజకీయం చేస్తామని కూడా బాబు మనసులోని మాటను బయట పెట్టారు. కచ్చితంగా చెప్పాలంటే అధికారమే పరమావధిగా తెలుగుదేశం రాజకీయాలు ఉంటాయని, ఇందులో విలువలు, సిద్ధాంతాలు వంటి వాటికి తావేలేదని కూడా తేల్చే శారు. 

ఇటీవల కాలంలో వైసీపీ నుంచి ఫిరాయింపుల పైనా, హత్యా రాజకీయాలపైనా, అవినీతి, బంధు ప్రీతి, ఒకే కులం పట్ల అభిమానం వంటి వాటి పైనా తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో విమర్శలు వస్తున్న నేపధ్యంలో అన్నింటికీ ఒకటే సమాధానం అన్నట్లుగా బాబు మహానాడులో అసలు నిజం జనం ముందు పెట్టారు. తమ పార్టీ ఇలాగే రాజకీయాలు చేస్తుందని, ఇదే తమ రాజనీతి అంటూ ఎటువంటి శషబిషలకూ ఆస్కారం లేకుండా చెప్పుకొచ్చారు. ఇక, మిత్రపక్షమైన బీజేపీ విషయంలో బాబు ఇంకా డోలా యమానంలోనే ఉన్నారన్నది రాజకీయ తీర్మానం ద్వారా అర్దమవుతోంది.

కేంద్రంలో ఉన్న పార్టీతో స్నేహంగా ఉండడం వల్లనే అభివృద్ధి జరుగుతుందని, అందుకే తాము ఎన్నికల ముందే పొత్తు పెట్టుకున్నామని వివరించారు. పొత్తుల అంశం ఎన్నికల సమయంలోనే అంటూ బీజేపీపై విమర్శలు చేయవద్దని కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశానికి శాశ్వత అధికారం దక్కాలని బాబు అత్యాశను ప్రదర్శించారు. దానికి తగిన కారణాలను కూడా ఆయన సిద్ధం చేసి పెట్టుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి ఓ కొలిక్కి రాలేదని, తాను తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే తామే అనేక పర్యాయాలు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందంటూ అమరావతి రాజధాని, పోలవరం వంటి వాటిని ఉదహరించారు.

ఇక, తాము తప్ప ఏపీ ప్రజానీకానికి కూడా వేరే రాజకీయ ప్రత్యామ్నాయం కూడా లేదని బాబు వాదించారు. విభజన తరువాత కాంగ్రెస్‌ ఏపీలో కనుమరుగైందని, అది ఇక ఎప్పటికీ కోలుకో లేదని తేల్చేశారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేరమయమైన, అవినీతిమయమైన పార్టీగా అభివర్ణించారు ఆ పార్టీకి ఓ దశ, దిశ లేదని, నాయకత్వానికి అనుభవం కూడా లేదని, అటువంటి పార్టీని జనం ఎప్పటికీ కోరుకోరని, కోరుకోకూడదని కూడా బాబు అభిలషించారు. అందువల్ల తెలుగుదేశానికి రానున్న రోజులలో రాజకీయంగా ఎదురులేదని, జనంలోనూ తిరుగు లేదని బాబు గట్టి ధీమాను ప్రదర్శించారు.

ఇలా ఓవైపు నమ్మకం ప్రదర్శిస్తూనే మరోవైపు మూడు రోజుల మహానాడులో వైసీపీపైనా, అధినేత జగన్‌ పైనా ప్రతీ సందర్బంలోనూ విమర్శలు చేస్తూనే వచ్చారు. ఆయన తనయుడు, లోకేష్‌తో పాటు, ఇతర మంత్రులు, పార్టీ సీనియర్లు జగన్‌ను, వైసీపీని తలచుకుని తరించారు. ఈ విధంగా ఓ పార్టీ ప్రతినిధుల సభలో వైరి పక్షం నేత ప్రస్తావన అధికంగా చేయడం ఓ ప్రత్యేకత. దీనిని కనుక విశ్లేషించుకుంటే బాబు పైకి ధీమాగా ఉన్నా ఎక్కడో లోలోపల వైసీపీపైనా, జగన్‌పైన భయం ఉందన్న సంకేతాలు తనకు తాను గానే కేడర్‌కు ఇచ్చినట్లైంది.

మూడేళ్ల పాలనలో అన్ని రకాలుగా హామీలను నెరవేర్చామని చెప్పుకుంటున్న టీడీపీ అధినాయకుడు, ప్రజలకు తాము తప్ప వేరే దిక్కులేదని వాదిస్తున్న వేళ వైసీపీ గురించి ఎందు కంత ఉలికిపాటు పడుతున్నారో రాజకీయ పండి తులకు సైతం అర్ధం కాని పరిస్థితి. టీడీపీపై జనంలో వ్యతిరేకత ఉందన్న సత్యం ఎంత దాచినా దాగదన్నది బాబు ప్రసంగాల ద్వారానే తెలుస్తోంది. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే నాతో సహా అంతా మునిగిపోతామని హెచ్చరిస్తున్న వైనమే ఇందుకు సాక్ష్యం. ఇక, తెలంగాణా నాయకుల విమర్శలు పూర్తిగా కేసీఆర్‌ను ఉద్దేశించి చేసినవే అయినా వేదికపై ఉన్న టీడీపీ అధినాయకునికి కూడా బాగానే తగిలాయి.

రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, రైతుల ఆత్మహత్యలు, కుంటు పడిన అభివృద్ధి, ఫిరాయింపు రాజకీయాలపై తెలంగాణా టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, రమణ వంటి వారు మహానాడు వేదికగా ఘాటుగా విమర్శలు చేస్తున్న సమయంలో ఏపీ టీడీపీ నేతలు కూడా తమ భుజాలు తడుముకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇదే రకమైన ఆరోపణలు ఇక్కడ నిత్యం వైసీపీ నేతలు కూడా చేస్తున్నారు, వాటిని తిప్పికొడుతున్న బాబు అండ్‌ కోకు తెలంగాణా టీడీపీ నేతల విమర్శలు గుక్క తిప్పుకోనీయలేదు. చిత్రమేమిటంటే ఇంతటి మహానాడులోనూ ఒక్క రేవంత్‌రెడ్డి ఉపన్యాసానికే సభలోని జనం చప్పట్లు కొట్టి ఆనందించడం.

తెలంగాణ టైగర్‌ అంటూ నినాదాలు చేయడం ఓ విశేషమే. మూడు రోజుల మహానాడులోనూ భోజనాల హడావుడి, చంద్రబాబు, లోకేష్‌ల భజనలతోనే పుణ్యకాలం అంతా గడిచిపోయింది. మధ్యాహ్న భోజనానంతరం పార్టీ ప్రతినిధులంతా విశాఖ అందాలను తిలకించడానికి బయటకు వెళ్లిపోవడంతో ఉదయం ఫుల్‌, మధ్యాహ్నం నిల్‌ అన్నట్లుగా సభసాగింది.

పెదబాబు, చినబాబులను కీర్తించడంతో పార్టీలోని సీనియర్లు అశోక్‌గజపతి రాజు, యనమల రామకృష్ణుడు నుంచి నేటితరం నేతల వరకూ పోటీ పడ్డారు. మొత్తానికి ఓ కార్పొరేట్‌ కంపెనీ వార్షికోత్సవంలా మహానాడు జరిగింది, తప్ప కార్యకర్తల గురించి ఆలోచన చేసే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు, తమకు నామినేటెడ్‌ పదవులు ప్రకటి స్తారని ఎంతో ఆశగా ఎదురుచూసిన ఉత్తరాంధ్ర కేడర్‌కు తీరని ఆవేదనే మిగిలింది.

-పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌

Show comments