బాబు హెచ్చరించినా.. మళ్లీ ఫ్లెక్సీ పంచాయితీలా!

ఇప్పటికే అత్యుత్సాహం వద్దని పరిటాల శ్రీరామ్ కు తెలుగుదేశం అధినేత సూచించాడనే మాట వినిపించింది. మీ నియోజకవర్గం వరకూ మీరు చూసుకోండి.. పక్క వాళ్ల నియోజకవర్గాల్లో వేలు పెట్టొద్దని బాబు సున్నితంగానే చెప్పినట్టుగా వార్తలొచ్చాయి. దీంతో గత కొంత కాలంగా.. పక్క నియోజకవర్గాల్లో పరిటాల వర్గం శబ్దం చేయడం ఆగినట్టుగా కనిపించింది.

రాప్తాడుకు అటుగా ఉన్న.. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, ఇటుగా ఉన్న ధర్మవరం నియోజకవర్గ పరిధిలో అలజడి సృష్టించడాన్ని కొంత వరకూ ఆపాడు పరిటాల శ్రీరామ్. అధికారంలోకి వచ్చిన ఆదిలోనే ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే ఉన్నా.. అవి తమ నియోజకవర్గాలు అన్నట్టుగా పరిటాల శ్రీరామ్ వ్యవహరించసాగాడు. వచ్చే ఎన్నికల్లో తల్లి సునీత రాప్తాడు నుంచినే పోటీలో ఉండాలి… తను అనంతపురం లేదా ధర్మవరం ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ.. ఈ రెండింటిలో ఏదో దాట్లో తమ అనుచరులను నిలబెట్టుకోవాలి.. అన్న వ్యూహంతో కనిపించాడు శ్రీరామ్.

అయితే  ఈ రెండు నియోజకవర్గాల్లోని సిట్టింగులూ తెలుగుదేశం వాళ్లే, అందునా కమ్మ వాళ్లే. తమ నియోజకవర్గంలోకి వచ్చి శ్రీరామ్ ఇబ్బంది పెడుతున్నాడని.. వాళ్లు బాబుకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆఖరికి ప్రభాకర్ చౌదరి అనంతపురంలో రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేయడంతో బాబు వీరి మధ్యన పంచాయితీ చేశాడని తెలుగుదేశం నేతలు చెప్పారప్పట్లో.

మరి అదంతా జరిగి కొన్ని నెలలు గడిచాయి.. ఇప్పుడు మళ్లీ లొల్లి మొదలైంది. తెలుగు తమ్ముళ్లు రచ్చకు ఎక్కి తన్నుకున్నారు.. రోడ్డుకు ఎక్కి కొట్టుకున్నారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో దీపావళి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ వేయించిన ఫ్లెక్సీల్లో పరిటాల సునీత, శ్రీరామ్ ల ఫొటోలు పెట్టి.. స్థానిక ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఫొటో పెట్టలేదన్న కారణంతో ఇరు వర్గాలకూ గొడవ మొదలైంది. ఇది చినికి చినికి గాలివానగా మారింది. పరిటాల, సూరి వర్గాల మధ్య నియోజకవర్గంపై ఆధిపత్య పోరు చల్లారింది ఏమీ లేదు, నివురు గప్పి ఉందన్న విషయాన్ని ఈ గొడవ స్పష్టం చేస్తోంది. ముందు ముందు ఈ రాజకీయం రసవత్తరంగా ఉండబోతోంది!

Show comments