అంత క్రేజీ వెబ్ సైట్ కు ఈ కష్టాలేమిటి!

ట్విటర్… వేరే ఉపోద్ఘాతం అక్కర్లేదు, పరిచయం చేయాల్సిన అవసరమూ లేదు! ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత క్రేజీయెస్ట్ వెబ్ సైట్లలో ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ముందుంది! ఒకటని కాదు.. ట్విటర్ తో ఉన్న లాభాలు, ఉపయోగాలు.. అనేకం! సమూహ, వ్యక్తిగత అవసరాల దృష్ట్యా.. ఈ సామాజిక మాధ్యమంలో ఖాతా తప్పని సరి అయిపోయింది. తప్పని అవసరమే కాదు.. అది ఎంతో ఉపయుక్తం కూడా! ప్రపంచం తన అవసరాలను తీర్చుకుంటూ ట్విటర్ కు రుణపడిపోయింది కూడా!

ట్విటర్ ద్వారా సెలబ్రిటీలతో మొదలు.. అనేక వ్యాపార సంస్థలు లాభపడుతున్నాయి. తమ వ్యాపారాల ప్రచారానికి ట్విటర్ ను ఉచితంగా వాడేస్తున్నాయి! ఖాతా కలిగి ఉంటే చాలు.. బోలెడంత ప్రమోషన్ ను చేసుకోవచ్చు. ఈ మార్గాన్ని ఎంచుకుని.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల వ్యాపార సంస్థలూ కలిసి కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంటున్నాయి. లాభాలు సంపాదించుకుంటున్నాయి.

 ట్విటర్ ను ఇలా లాభదాయకంగా మార్చుకుంటున్న వర్గాలు ఎన్నో ఉన్నాయి. ఆ జాబితా అనంతం. సెలబ్రిటీలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు.. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రాని ప్రచారం ట్విటర్ ద్వారా వస్తోంది. ఇక ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా ఉనికిని చాటుకుంటున్న వాళ్లు.. దీని ద్వారా మాత్రమే ఫేమస్ అయిన వారు.. ఇలా చెప్పుకొంటూ పోతే.. గత పదేళ్ల లో ప్రపంచ గతినే కొంత వరకూ మార్చేసింది ట్విటర్!

మరి ఈ విధంగా ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్న ఆ సైట్ కష్టాలు మాత్రం ఇప్పుడు తీవ్రస్థాయికి చేరాయి! ఒకవైపు ట్విటర్ తో పాటు పాపులర్ అయిన ఫేస్ బుక్ వందల కోట్ల రూపాయల లాభాల్లో ఉండగా.. ఫేస్ బుక్ అధినేత ప్రపంచ శ్రీమంతుల్లో ఒకడిగా, దాతృత్వంలో దూసుకుపోతుండగా.. ట్విటర్ మాత్రం, కాస్ట్ కటింగ్ లో పడిపోయింది!

మొత్తం 3,860 మంది ఉద్యోగులను కలిగి ఉన్న ట్విటర్ వీరిలో తొమ్మిది శాతం మందిని తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది! ట్విటర్ లో ఉన్న ఖాతాలతో పోలిస్తే.. ట్విటర్ కోసం పని చేస్తున్న ఉద్యగుల సంఖ్య అత్యల్పం అనుకుంటే.. వీరికి కూడా జీతాలు ఇవ్వలేక వరసగా ఉద్యోగులను తొలగించుకొంటూ వస్తోంది ట్విటర్ యాజమాన్యం. ఈ మధ్యకాలంలోనే ఇలాంటి తొలగింపులు చాలానే జరిగాయి. 
 
ఈ ఏడాదిలో ట్విటర్ నష్టాలు పది కోట్ల డాలర్లు అని తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ నష్టాలు కొంత వరకూ తగ్గాయట! పైకి అంత ఆకర్షణీయంగా.. ప్రపంచాన్నే మార్చేసిన ఈ అద్భుతం వెనుక ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సైట్ ను అమ్మేయాలనే ప్రయత్నాలూ సాగిస్తోంది యాజమాన్యం. మరీ ఇంత నష్టాల్లో ఉన్న సంస్థను కొనేదెవరు? 

ఇప్పటికే యాహూ వంటి సోషల్ సైట్ విలువ పతనం అయిపోయింది. అదంటే వినియోగదారులు తగ్గిపోయి ఇబ్బంది పడుతోంది అనుకుంటే.. కోట్ల సంఖ్యలో వినియోగదారుల సంఖ్య ఉన్న ట్విటర్ పరిస్థితి ఇలా తయారవ్వడమేమిటో! 

Show comments