టీడీపీకి బీజేపీ షాక్‌: పులి.. పిల్లి అయ్యింది.!

ప్రధాని నరేంద్రమోడీని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిస్తే అది నేరమా.? మామూలుగా అయితే కాదు. కానీ, 'పచ్చ' కళ్ళతో చూస్తే, అది పెద్ద నేరమే. ఆ పచ్చకామెర్లకు భారతీయ జనతా పార్టీ సరైన మందే వేసింది. 'కర్రు కాల్చి వాతలెట్టడం..' అనే తరహాలో, బీజేపీ వాతలు పెట్టడంతో, తెలుగుదేశం పార్టీకి తత్వం బోధపడినట్లుంది. 

నిన్నటిదాకా పులిలా గర్జించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు పిల్లిలా మారిపోయింది. 'వైఎస్‌ జగన్‌, ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవడంలో మాకేమీ అభ్యంతరం లేదు.. అది తప్పు కూడా కాదు..' అంటూ సాక్షాత్తూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి సెలవిచ్చారు. అదే సమయంలో, ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా ఇదే విషయమ్మీద క్లారిటీ ఇచ్చేశారు. ఔనా.? నిజమా.? అలాగైతే, నిన్నటిదాకా టీడీపీ నేతలు, వైఎస్‌ జగన్‌ మీద చేసిన ఆరోపణల సంగతేంటి.? బీజేపీ సమాధానం చెప్పి తీరాలంటూ టీడీపీ నేతలు ఇచ్చిన అల్టిమేటం మాటేమిటి.? 

వారెవ్వా.. అదిరిందయ్యా చంద్రం.! చంద్రబాబు ఎంట్రీతో ఈక్వేషన్స్‌ మారిపోయాయి. ఢిల్లీలో ఆరు గంటల రహస్య పర్యటనలో, చంద్రబాబుని బీజేపీ అధిష్టానం ఫుల్లుగా 'తోమేసి వుండొచ్చు..' అన్న ఊహాగానాలకు ఇప్పుడు బలం చేకూరుతోంది. అవును మరి, పులి కాస్తా పిల్లిలా మారిపోతే అలాగే అనుమానించాల్సి వస్తుంది. 

ఏమాత్రం విజ్ఞత ప్రదర్శించకుండా, నోటికొచ్చిందల్లా వాగేశారు మోడీ - జగన్‌ భేటీ విషయంలో టీడీపీ నేతలు. ప్రధానిని, ఓ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత కలిస్తే, అందులో తప్పుపట్టడానికేమీ వుండదు. నిజంగానే మోడీ - జగన్‌ రాజకీయాలే మాట్లాడుకుని వుండొచ్చుగాక. కానీ, ఆ కలయికే అక్రమం.. అని ఎన్డీయే భాగస్వామి అయిన టీడీపీ విమర్శించడం, సహజంగానే ప్రధానికి కోపం తెప్పిస్తుంది. 

'మీతో కలిసి వుండాలా.? వద్దా.? అని ఆలోచించాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు.. ప్రధానినే అనుమానిస్తారా.?' అంటూ బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవడంతోనే టీడీపీ సెల్ఫ్‌గోల్‌ కొట్టుకుందనే విషయం సుస్పష్టమయిపోయింది. ఇక, ఇప్పుడు.. టీడీపీకి చెందిన ముఖ్య నేతలు, 'జగన్‌ ఢిల్లీ టూర్‌ని తప్పు పట్టాల్సిన పనిలేదు..' అనడంతో, చచ్చిన పాము మళ్ళీ మళ్ళీ చచ్చినట్లయ్యింది.

Show comments