టీటీడీ చైర్మ‌న్ రేసులో కొత్త ముఖాలు

టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వికి ఒక‌వైపు తెలుగుదేశం పార్టీ నుంచే కాకుండా రాజ‌కీయాల‌తో సంబంధం లేని బాబు స‌న్నిహితుల నుంచి కూడా తీవ్ర పోటీ నెలకొంది.

చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న ప‌లువురు నేత‌లు, పారిశ్రామిక వేత్తలు, మాజీ అధికారులు చైర్మ‌న్ ప‌ద‌వి కోసం త‌మకు తోచిన రీతిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అయితే ఎమ్మెల్యే, ఎంపీల వంటి ప‌ద‌వుల్లో ఉన్న వారికి టీటీడీ చైర్మ‌న్ ఇచ్చే ప్ర‌సక్తే లేద‌ని బాబు తేల్చిచెప్ప‌డంతో ఈ రెండు ప‌ద‌వులు లేని వారు ఇప్పుడు చైర్మ‌న్ ప‌ద‌విపై క‌న్నేసి త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ రేసులో ఇప్పుడు రెండు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒక‌రు రిటైర్డ్ ఐఏస్ లక్ష్మీనారాయ‌ణ కాగా ఇంకొక‌రు టెలికాం రంగ నిపుణులు త్రిపుర‌నేని హ‌నుమాన్ చౌద‌రి. 

మాజీ ఐఏఎస్ ల‌క్ష్మీనారాయ‌ణ చంద్ర‌బాబుకు చాలా ద‌గ్గ‌ర సంబంధాలున్నాయి. వీరిద్ద‌రికీ ఎస్వీ యూనివ‌ర్శిటీలో చ‌దువుకునే రోజుల నుంచి ప‌రిచ‌యం ఉంది.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ల‌క్ష్మీనారాయ‌ణ ఆయ‌న ప్రత్యేక కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. ఐఏఎస్ గా రిటైరైన ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ స్కిల్‌డెవెలెపెమెంట్  కార్పోరేష‌న్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక మ‌రో ఆశావ‌హుడు త్రిపుర‌నేని హ‌నుమాన్ చౌద‌రి టెలికాం రంగ‌ నిపుణుడిగా సుప్ర‌సిద్ధుడు. సెంట‌ర్ ఫ‌ర్ టెలీ క‌మ్యూనికేష‌న్స్ అండ్ మేనేజ్‌మెంట్‌ను స్థాపించి దేశంలో టెలికాం రంగానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గానూ ఈ ఏడాది భార‌త ప్ర‌భుత్వం అయ‌న్ని ప‌ద్మ‌శ్రీ అవార్డుతో స‌త్క‌రించింది.

టెలికాం రెగ్యులేట్ అధారిటీ ట్రాయ్ ఏర్పాటులో త్రిపుర‌నేని కీల‌క‌పాత్ర పోషించారు. దైవ‌భ‌క్తి మెండుగా ఉన్న త్రిపురనేనికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్క‌వ‌చ్చ‌ని రాజ‌కీయవ‌ర్గాల స‌మాచారం. 

Show comments