డ్యామిట్‌.. అవినీతి అడ్డం తిరిగింది

దేశ రాజకీయాల్లోకి అనూహ్యంగా దూసుకొచ్చింది ఓ రాజకీయ పార్టీ. అదే ఆమ్‌ ఆద్మీ పార్టీ. వస్తూనే, సంచలనం సృష్టించింది. కాంగ్రెస్‌, బీజేపీలను దెబ్బకొట్టింది. కాంగ్రెస్‌ని పూర్తిగా మట్టి కరిపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీతో పోల్చితే సీట్ల పరంగా వెనకబడినా, అధికార పీఠమెక్కింది. కానీ, యాభై రోజుల్లోపే అధికారాన్ని వదులుకుని, ఎన్నికలకు వెళ్ళి ఈసారి బంపర్‌ మెజార్టీతో అధికార పీఠం దక్కించుకుంది. అలా దేశ రాజకీయాల్లో ఓ సంచలనంగా మారారు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌. 

ఆమ్‌ ఆద్మీ పార్టీ పెట్టకముందు అరవింద్‌ కేజ్రీవాల్‌ అంటే, అవినీతి వ్యతిరేక పోరాటంలో ఓ ఉద్యమకారుడు. అవినీతి వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించిన సామాజిక కార్యకర్త అన్నా హజారేకి 'కుడి భుజం'లా వ్యవహరించారాయన. అలాంటిది, ఇప్పుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మీదనే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 'నా నమ్మకాన్ని కేజ్రీవాల్‌ వమ్ము చేశారు..' అంటూ అన్నా హజారే వాపోతున్నారిప్పుడు. ఆ స్థాయిలో కేజ్రీవాల్‌ అవినీతి మరకలంటించుకుంటున్నారు. 

సాక్షాత్తూ కేజ్రీవాల్‌ మంత్రి వర్గంలో పనిచేసిన కపిల్‌ మిశ్రా, '2 కోట్ల రూపాయల నగదుని కేజ్రీవాల్‌కి లంచంగా మంత్రి సత్యేంద్రజైన్‌ ఇస్తుండడాన్ని నా కళ్ళతో నేను చూశాను..' అని ప్రకటించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. అయితే, మంత్రి పదవి ఊడిపోయాక కమల్‌ మిశ్రా ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. మంత్రి పదవి ఊడింది గనుక, ఇలాంటి ఆరోపణలు మామూలేనని ఆమ్‌ ఆద్మీ పార్టీ సరిపెట్టుకోవచ్చుగాక. కానీ, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటర్లు షాకివ్వడాన్ని అంత తేలిగ్గా తీసుకోలేం. అవినీతి ఆరోపణలు, ఇతరత్రా ఆరోపణలు.. వెరసి, కేజ్రీవాల్‌ పాలనపై ప్రజల్లోనే నమ్మకం సడలిపోయింది. 

ఎలాంటోడు, ఎలాగయిపోయాడు.? అని అంతా ఆశ్చర్యపోతున్నారిప్పుడు. భ్రష్టుపట్టిన రాజకీయాల్లో కేజ్రీవాల్‌ ఆశాదీపమన్న భావన ఒకప్పుడు చాలామందిలో వుండేది. ఇప్పుడు, ఆ భావనలు తొలగిపోయాయి. 'కేజ్రీవాల్‌ కూడా ఆ అవినీతి బురదలోనివాడే..' అన్న అభిప్రాయం బలపడ్తోంది. మరోపక్క, ఇదంతా బీజేపీ కుట్ర.. అని కొట్టి పారేస్తున్నారు కేజ్రీవాల్‌. ఆమ్‌ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనే బీజేపీ కుట్రలోనే భాగంగా ఇదంతా జరుగుతోందన్నది ఆయన ఆరోపణ. 

రాజకీయాల్లో ఆరోపణలు సహజం. అయితే, ఆ ఆరోపణలు వచ్చినప్పుడే పాలకులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. సంప్రదాయ రాజకీయ పార్టీలెలాగూ బుకాయింపులతోనే సరిపెడ్తాయి. వాటితో పోల్చితే తమ పార్టీ భిన్నమైనదని చెప్పడానికి, అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రయత్నించాలి.. ప్రజల మెప్పు పొందగలగాలి. కానీ, కేజ్రీవాల్‌ తనపై వస్తున్న ఆరోపణలపై సంప్రదాయ పార్టీలు ఎలా స్పందిస్తాయో అలాగే స్పందిస్తుండడం గమనార్హం. 

ఒకప్పుడు అవినీతి వ్యతిరేక పోరాటంలో ఉద్యమకారుడు కావొచ్చు. కానీ, కేజ్రీవాల్‌ కూడా ఇప్పుడు రాజకీయ నాయకుడే. ఆయనకి రాజకీయం బాగా వంటపట్టేసింది. అందుకే, ఆయన్నుంచి అద్భుతాల్నీ, చిత్తశుద్ధినీ, నీతి నియమాల్నీ ఆశించలేం.

Show comments